ఇంటి రుణం ఇప్పిస్తానంటూ మోసం
ABN , First Publish Date - 2020-09-14T09:54:43+05:30 IST
ఇంటి రుణం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.16 లక్షలతో ఉడాయించిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడి అరెస్టు రూ.6.88 లక్షలు స్వాధీనం
బంజారాహిల్స్, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): ఇంటి రుణం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.16 లక్షలతో ఉడాయించిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.6.88 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో నివసించే దివాకర్‌బాబు వ్యాపారి. తన సోదరుడు విపుల్‌కు డబ్బు ఇచ్చేందుకు ఇంటి రుణం కావాలంటూ పంజాబ్ నేషనల్ బ్యాంకు వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా మార్చి 24న దరఖాస్తు చేశాడు. జూన్ 20న సుజీత్‌కుమార్ వనమాలి అనే వ్యక్తి ఫోన్ చేసి తాను బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేసుకున్నాడు. మూడు కోట్ల రూపాయల రుణం కోసం డాక్యుమెంట్లు కావాలని చెప్పి దివాకర్ ఇంటికి వెళ్లి తీసుకున్నాడు. కొద్ది రోజులకు ఫోన్ చేసి ప్రాసెసింగ్ ఫీజు రూ.1.04 లక్షలు తీసుకున్నాడు.
అనంతరం జూలై 8న దివాకర్‌కు ఫోన్ చేసి రుణం ప్రాసెస్ పూర్తయిందని ఆగస్టు 21న బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-2లోని కార్యాలయానికి రావాలని సూచించారు. అక్కడ మరో రూ.1.65 లక్షలు డీడీల రూపంలో తీసుకున్నాడు. దివాకర్ అతడి సోదరుడు కలిసి ఆగస్టు 24న బ్యాంకుకు వెళ్లగా మూడు కోట్ల రూపాయల రుణం వచ్చేందుకు రూ.16 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని సుజీత్ వారికి చెప్పాడు. దీంతో మరుసటి రోజు దివాకర్ డబ్బుతో బ్యాంకుకు రాగా ఆ డబ్బును తీసుకున్న సుజీత్ మిగతా పనులు చూసుకొని వస్తానని చెప్పి బ్యాంకులోకి వెళ్లి తిరిగి రాలేదు. అనుమానం వచ్చి దివాకర్ బ్యాంకులోని సిబ్బందిని అడగ్గా అతనేవరో తమకు తెలియదని చెప్పా రు. మోసపోయినట్టు గ్రహించిన దివాకర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిందితుడిని పట్టుకొని రూ.6.88 లక్షలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.