హెచ్‌ఎండీఏ ఇక..

ABN , First Publish Date - 2020-09-13T08:44:01+05:30 IST

హెచ్‌ఎండీఏ రానున్న కాలంలో ప్లానింగ్‌, విజనింగ్‌, డిజైనింగ్‌ అంశాలపై మరింత దృష్టి సారించాలని, అందుకోసం ..

హెచ్‌ఎండీఏ ఇక..

ప్లానింగ్‌, విజనింగ్‌, డిజైనింగ్‌

ఔటర్‌ వెంట వసతులు 8 సమీక్షించిన మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌12 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఎండీఏ రానున్న కాలంలో ప్లానింగ్‌, విజనింగ్‌, డిజైనింగ్‌ అంశాలపై మరింత దృష్టి సారించాలని, అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికను రూపొందించుకోవాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంటా ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని, పెట్రోల్‌ బంకులు, ఫుడ్‌ కోర్టులు, రెస్ట్‌ ఏరియాలు, గేట్‌వే  నిర్మాణాలు పీపీపీ మోడల్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. బుద్ధభవన్‌లోని  జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం కార్యాలయంలో హెచ్‌ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు, ఇతర కార్యక్రమాలను మంత్రి కేటీఆర్‌ శనివారం సమీక్షించారు. హెచ్‌ఎండీఏ చేపట్టిన మౌలిక వసతుల కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకుపోవాలని ఈ సంద ర్భంగా మంత్రి సూచించారు. టీఎస్‌ బీపాస్‌ చట్టం వచ్చిన తర్వాత హెచ్‌ఎండీఏలో జరగబోయే మార్పులకు సంబంధించి ఇప్పటి నుంచి సంసిద్ధంగా ఉండాలన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై చేపడుతున్న కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.


హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ పరిధిలో ఉన్న బఫర్‌ జోన్‌లో వచ్చిన నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ విషయంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు విస్తరించి ఉన్న జిల్లాల కలెక్టర్ల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. బాలానగర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను నవంబర్‌ చివరి నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ తరహాలో అసెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఏర్పాటు చేసి, ఈ విషయంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై హెచ్‌ఎండీఏ చేపట్టిన గ్రీనరీ కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌ అధికారులను  అభినందించారు. హెచ్‌ఎండీఏ నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, మెహిదీపట్నం, ఉప్పల్‌లో చేపట్టిన స్కైవే పనులను మంత్రి సమీక్షించారు.


హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై హెచ్‌ఎండీఏ కమిషనర్‌, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్యాంక్‌బండ్‌ సుందరీకరణ పనులకు సంబంధించిన వివరాలను  అధికారులు మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. సమావేశంలో హెచ్‌ఎండీఏ కార్యదర్శి సంతోష్‌, చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, ప్లానింగ్‌ డైరెక్టర్‌ బాలకృష్ణ, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ శరత్‌ చంద్ర, ఎస్టేట్‌ ఆఫీసర్‌ ప్రసూనాంబ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-13T08:44:01+05:30 IST