డాక్టర్‌ను కాటేసిన కరోనా..!
ABN , First Publish Date - 2020-08-20T09:38:44+05:30 IST
ఆయనో ఆర్‌ఎంపీ డాక్టర్.. పదిహేనేళ్ల క్రితం వరంగల్ నుంచి వచ్చి బాలాపూర్ మండలంలోని గుర్రంగూడలో స్థిరపడ్డారు.

వరంగల్ నుంచి వచ్చి గుర్రంగూడలో క్లినిక్
పదిహేనేళ్లుగా తక్కువ ఫీజుతో స్థానికులకు వైద్యం
సరూర్‌నగర్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఆయనో ఆర్‌ఎంపీ డాక్టర్.. పదిహేనేళ్ల క్రితం వరంగల్ నుంచి వచ్చి బాలాపూర్ మండలంలోని గుర్రంగూడలో స్థిరపడ్డారు. అప్పటి నుంచి ఇక్కడి ప్రజలకు తలలో నాలుకలా మారి, తక్కువ ఫీజుతో వైద్యం చేసేవారు. ఎన్నడూ ఒక్క రిమార్క్ లేకుండా వైద్య సేవలందించి పేదల డాక్టర్‌గా పేరు సంపాదించుకున్నాడు. సదరు డాక్టర్‌ను కరోనా కాటేసింది..!
రూ.15 నుంచి మొదలుకుని రూ.50దాకా..
వరంగల్ ప్రాంతానికి చెందిన ఎస్.పి.రాజు(46) ఆర్‌ఎంపీ వైద్యుడు పదిహేనేళ్ల క్రితం గుర్రంగూడకు వచ్చి చిన్న క్లినిక్ పెట్టుకుని బతుకుబండి లాగుతున్నారు. ఆయన ఏనాడూ వైద్యాన్ని వ్యాపారంగా చూడలేదు.. ఎవరు ఎంత ఇచ్చినా తీసుకుని వైద్యం చేసేవారని స్థానికులు చెబుతున్నారు. మొదట్లో రూ.15 నుంచి మొదలుకుని.. ప్రస్తుతం రూ.50దాకా మాత్రమే ఆయన ఫీజు తీసుకునేవారు. పేదవారెవరైనా తమ వద్ద డబ్బు లేదని చెప్పి రూ.20 లేదా 30 ఇచ్చినా తీసుకునే వారు. గుర్రంగూడ కూడలిలో ఉదయ్ క్లినిక్ పేరుతో ఓ షెట్టర్‌లో ఆస్పత్రి ఏర్పాటు చేసుకున్న రాజు.. రోగుల ఇళ్లకు కూడా వెళ్లి వైద్యం చేసేవారు.
తండ్రి అంత్యక్రియలకు వెళ్లి..
ఇటీవల వరంగల్‌లో రాజు తండ్రి అనారోగ్యంతో మరణించారు. ఆయన అంత్యక్రియల నిమిత్తం అక్కడకు వెళ్లిన రాజు అస్వస్థతకు గురికాగా కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దాంతో స్థానిక ఆస్పత్రిలో చేరిన ఆయన అక్కడ వైద్యం తీసుకుంటూ ఐదు రోజుల క్రితం తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న గుర్రంగూడ వాసులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అలాంటి పేదల డాక్టర్ లేడంటే నమ్మలేకున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయనది నిస్వార్థ సేవాగుణం...
రాజు మరణవార్త మమ్మల్ని తీవ్రంగా కలచి వేసింది. ఆర్‌ఎంపీ డాక్టర్ అయినా అన్ని రుగ్మతలకు చక్కని వైద్యం చేసేవారు. పేదల వద్ద డబ్బు తీసుకునే వారు కాదు. ఎంత ఇస్తే అంతే తీసుకుని వైద్యం చేసేవారు. లేవలేని స్థితిలో ఉన్న రోగుల ఇళ్లకు సైతం వెళ్లి సేవలందించేవారు. ఆయనది నిస్వార్థ సేవాగుణం. ఆయనకు గుర్రంగూడ తరపున కన్నీటి నివాళులర్పిస్తున్నాం.
- గడ్డం లక్ష్మారెడ్డి, గుర్రంగూడ 7వ వార్డు కార్పొరేటర్