అంతా..హాంఫట్‌..!

ABN , First Publish Date - 2020-06-25T09:40:07+05:30 IST

కంచె చేను మేసిన చందంగా ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వ భూముల కబ్జాకు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అంతా..హాంఫట్‌..!

హయత్‌నగర్‌ తహసీల్దార్‌ 

కార్యాలయం అవినీతిమయం


హయత్‌నగర్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): కంచె చేను మేసిన చందంగా ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వ భూముల కబ్జాకు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదు చేసిన సామాన్యులపై కబ్జారాయుళ్లతో కలిసి దబాయింపులకు దిగుతూ భయభ్రాంతులకు గురిచే స్తున్నారని స్థానికులు అంటున్నారు. తిరస్కరణకు గురైన జీవో నెం.59 ఫైళ్లను రెగ్యులరైజ్‌ చేసి లక్షలు దండుకుంటున్నారని అంటున్నారు. 


అక్రమాలకూ రేటు.. 

హయత్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో అక్రమాలను సక్రమం చేసేందుకు కొంతమంది ఉద్యోగులు ప్రతి పనికో రేటు ఫిక్స్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలా కన్వర్షన్‌ ఫైలుకు ఒక రేటు, భూమి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు ఒక రేటు, ప్రభుత్వ భూమిలో ప్రహరీ ఇంటి, నిర్మాణానికి ఒక రేటు నిర్ణయించిన అధికారులు, సిబ్బంది.. చెరువు, కాలువ కబ్జా చేసినా డబ్బులు తీసుకొని ఓకే చేస్తారని అంటున్నారు. చివరికి వనస్థలిపురం ఎస్‌కేడీనగర్‌ కప్పలచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు రేట్‌ ఫిక్స్‌ చేసి లక్షలు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


బాగ్‌ హయత్‌నగర్‌ 207 సర్వే నంబర్‌లో అక్రమ నిర్మాణాలకు నలుగురు ఉద్యోగుల బృందం సహకరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కబ్జాలకు సహకరించడం లేదని కొన్ని రోజుల క్రితం ఓ వీఆర్‌వోను మరో రెవెన్యూ విలేజీకి బదిలీ చేశారు. ఆరు నెలలుగా హయత్‌నగర్‌లోని ప్రభుత్వ సర్వే నంబర్లు255, 207, 60, 191లలో స్థలం అవినీతి ఉద్యోగులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి అంటున్నారు. ఈ సమయంలో జీవో నంబర్‌ 59లో తిరస్కరణకు గురైన ఫైళ్లను చక్కబెట్టి రూ. లక్షలు దండుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సుమారు 300 గజాల స్థలాన్ని రెగ్యులరైజ్‌ చేయడానికి బహిరంగ మార్కెట్‌ ధరను పోల్చుకుని, వసూలు చేశారని, ఇటీవల ఓ రెగ్యులరైజేషన్‌కు సుమారు రూ.6 లక్షలు తీసుకున్నారని అంటున్నారు. ఓ ఉద్యోగి మధ్యవర్తిగా ఉండి పనులు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. గత ఆరు నెలల కాలంలో సుమారు 10 కన్వెన్షన్‌ డీడ్‌లు చేసి రూ. లక్షలు దండుకున్నట్లు తెలుస్తోంది. 


సర్వే నంబర్‌ 255లో గల రామకృష్ణానగర్‌లో ప్రహరీ నిర్మాణానికి క్షేత్రస్థాయి ఉద్యోగి ఒకరు లక్షా 20 వేల రూపాయలు తీసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. అన్మగల్‌  హయత్‌నగర్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పెట్రోల్‌ బంక్‌ రెవెన్యూ ఎన్‌ఓసీ కోసం  సుమారు రూ. 10 లక్షలు చేతులు మారినట్లు తెలిసింది. సామనగర్‌, వీరన్నగుట్ట, ముదిరాజ్‌కాలనీల్లో ప్రభుత్వ భూములు అవినీతి ఉద్యోగులకు సిరులు కురిపిస్తున్నాయి.


ఇన్ఫర్మేషన్‌ కాలనీ నుంచి ఇంజాపూర్‌ వెళ్లే దారిలో సుమారు రూ. 10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి (సర్వే నం. 191)లో ప్లాట్లు చేసి విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ ఉద్యోగి పరోక్షంగా సదరు కబ్జాదారులకు సహకరిస్తున్నాడని స్థానికులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అక్కడే ఉన్న రాచకాలువ పూడ్చినా పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడి ఉద్యోగుల పనితీరుపై నిఘా వేస్తే మరిన్ని నిజాలు బయటపడతాయని అంటున్నారు.  

Updated Date - 2020-06-25T09:40:07+05:30 IST