రెండు నవలలు రాశా!

ABN , First Publish Date - 2020-06-11T10:52:39+05:30 IST

కరోనా నేపథ్యంలో వలస బతుకులపై ఒక నవల రాయాలనే ఆలోచన కలిగింది. అందుకు ప్రస్తుతం ప్రణాళిక సిద్ధం

రెండు నవలలు రాశా!

ప్రఖ్యాత రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్‌


‘ఆయనకు 82 ఏళ్లు. లాక్‌డౌన్‌ని పుస్తక పఠనానికి, రచనా వ్యాసంగానికి  అనువుగా మలుచుకున్నారు. రెండు నవలలూ రాశారు. బోలెడు పుస్తకాలూ చదివారు. మరో కొత్త రచన కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకు సమకాలీన సమస్యలపై అధ్యయనం చేస్తున్నారు. ఆయనే ఎస్వీ యూనివర్సిటీ మాజీ ఉపాధ్యక్షుడు, తెలుగు సాహితీ దిగ్గజం, ప్రతిష్ఠాత్మక మూర్తిదేవి పురస్కార గ్రహీత, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌. సాహిత్య రంగంలో ఆయన స్పృశించని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. కరోనా సెలవులతో ఇనాక్‌ దైనందిన జీవితంలో వచ్చిన మార్పులను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. 


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో వలస బతుకులపై ఒక నవల రాయాలనే ఆలోచన కలిగింది. అందుకు ప్రస్తుతం ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నా. అదిగాక ఈ మూడు నెలల్లో రెండు నవలలు రాశాను. అందులో అస్తిత్వంలోని ఔన్నత్యాన్ని వెతికే ఒక వ్యక్తి ప్రయత్నం ఇతివృత్తంగా ఒక నవల సాగుతుంది. మరొక నవలలో తల్లిజాడ కోసం పరితపించే ఒక బిడ్డ ఆరాటాన్ని అక్షరీకరించా. నా రచనలన్నీ మనిషి వేదన కేంద్రంగా సాగుతాయి. 


వర్క్‌ఫ్రమ్‌ హోం వల్ల..

వర్క్‌ఫ్రమ్‌ హోం వల్ల నా కొడుకు, కోడలు ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్లతో ఎక్కువ సమయం గడిపే అవకాశాన్ని కరోనా అందించింది(నవ్వుతూ...). ముంబాయి ఐఐటీలో చదివే నా మనవడు సుధీరథ్‌, మెడిసిన్‌ చదువుతోన్న నా మనవరాలు సుకీర్తితో కబుర్లాడుతూ కాసేపు కాలక్షేపం చేస్తుంటా. 


నా కోసం ప్రత్యేకమైన డైట్‌.. 

లాక్‌డౌన్‌లో బయటకెళ్లొద్దని నా కొడుకు శ్రీకిరణ్‌, కోడలు అనిత స్ట్రిక్ట్‌గా చెప్పారు. దాంతో మా ఇంటి వరండాలోనే ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట నిత్యం నడుస్తున్నా. రోజుకు మూడుసార్లు స్నానం చేస్తున్నా. నా కోడలు రూపొందించిన డైట్‌ చార్టు  ఫాలో అవుతున్నా. రోజూ ఉదయం కషాయం ఇస్తున్నారు. బ్రేక్‌పాస్టులో ఇడ్లీ, దోసె, వడ, పొంగల్‌లో ఏదో ఒకటి తింట. ఒక గ్లాసు రాగిజావ తాగుతా. తర్వాత ఏదైనా ఒక పండు తింటా. నాన్‌వెజ్‌ కన్నా, ఆకుకూరలు, కాయగూరల్ని ఇష్టంగా తింటా. బ్రాందీ, విస్కీనే కాదు.. టీ, కాఫీ కూడా అలవాటు లేదు(నవ్వుతూ...). రోజుకొక కోడిగుడ్డు కంపల్సరీ. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో అన్నం తక్కువ, కూరలెక్కువ తినడం మొదటి నుంచి అలవాటు. డైనింగ్‌ టేబుల్‌పై పెరుగు ఉండాల్సిందే.


రెండు పూటలా భోజనం చేశాక, కచ్చితంగా ఏదో ఒక సీజనల్‌ పండు తీసుకుంటా. ఉదయం 11.30కు కొబ్బరినీళ్లు లేదా ఫ్రూట్‌ జ్యూస్‌ ఇస్తారు. సాయంత్రం నాలుగింటికి బిస్కెట్స్‌ లేదా ఫ్రూట్స్‌ తింటా. ఇప్పుడు మామిడిపళ్లు బాగా తింటున్నా. తక్కువ మోతాదులో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడమే నా ఆరోగ్యరహస్యం. కాస్తా బీపీ తప్ప మిగతా ఆరోగ్య సమస్యలేమీ లేవు. ఏమి తిన్నా అరిగించుకొనే శక్తి ఉంది. నిద్ర కూడా పిలిస్తే వచ్చేస్తుంది. రోజూ మఽధ్యాహ్నం రెండు గంటలు నిద్రపోతా. రాత్రి పదింటికి పడుకుంటే ఉదయం 6కు లేస్తా. 


చదివిన పుస్తకాలు....

ఇప్పుడు రోజూ నేను రాసుకునే సమయం.. ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు. మళ్లీ మధ్యాహ్నం 3.30గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు. ఇక రాత్రిళ్లు చదువుతా. గుర్రం జాషువా సంకలనం ఇష్టంగా చదువుతుంటా. అంబేడ్కర్‌ రచనలు చూస్తుంటా. లాక్‌డౌన్‌లో చదివిన పుస్తకాలంటే ‘గ్రేట్‌ స్టోరీస్‌ బై నోబెల్‌ ఫ్రైజ్‌ విన్నర్స్‌’, ప్లేటో ‘రిపబ్లిక్‌’ (ఆదర్శరాజ్యం), చార్లెస్‌ డార్విన్‌ ‘ఆన్‌ ది ఆరిజన్‌ ఆఫ్‌ స్పీషియస్‌’. ఇవిగాక సాల్మన్‌ రష్‌డై ‘మిడ్‌నైట్స్‌ చిల్డ్రన్‌’ చదువుతుంటే ఉత్సాహంగా అనిపించింది. ‘సెలెక్టెడ్‌ స్టోరీస్‌ ఆఫ్‌ రష్యన్‌ రైటర్స్‌’లో లియో టాల్‌స్టాయ్‌, దాస్తొయెవ్‌స్కీ, చెహోవ్‌, పుష్కిన్‌, మాక్సింగోర్కి రచనలు చదువుతుంటే.. ఆ రచయితలకు మనిషి పట్ల ఎంత ఆర్తి ఉందో అర్థమవుతోంది.


రుడ్యార్డ్‌ కిప్లింగ్‌, వీఎస్‌ నైపాల్‌, రస్కిన్‌బాండ్‌ రచనలంటే కూడా నాకు అమితమైన ఇష్టం. రెండు సంస్కృతుల మధ్య నలిగే మనిషి ఎట్లా ఉంటాడో వాళ్ల రచనల ద్వారా తెలిసింది.  పోతులూరి వీరబ్రహ్మం ‘కాళికాంబ శతకం’ చదివాను. ఆయన మనిషిని ఎంత గొప్పగా ప్రేమించారో ఆ కవిత్వం ద్వారా అర్థమవుతోంది. ఆ రచన చదివాక సమాజాన్ని అంత ఉన్నతంగా ప్రేమించారు కనుకే మనుషుల మదిలో పోతులూరి మహిమాన్వితుడిగా నిలిచారని నాకు అనిపించింది. 


భార్య జ్ఞాపకాలతో...

నేనొక రూపం దిద్దుకోడానికి మా అమ్మ కారణమైతే, ఆ రూపం నిలుపుకోవడానికి గొప్ప శక్తి నా భార్య భాగీరథి. ఆమె దూరమై పదమూడేళ్లు. ఇప్పుడు నా భార్య జ్ఞాపకమొస్తే కుమిలిపోను కానీ సన్నటి దుఃఖపు జీర ఒకటి రెండు, మూడు నిమిషాలు కళ్లలో నిలుస్తాయి. తర్వాత మా అమ్మ కూడా గుర్తొస్తుంది. 

Updated Date - 2020-06-11T10:52:39+05:30 IST