వీరికి అండగా ఉందాం.. హరీశ్ రావు ట్వీట్

ABN , First Publish Date - 2020-04-08T20:48:00+05:30 IST

సంక్షోభ సమయాల్లోనే నాయకత్వ లక్షణాలు బయటపడతాయంటారు. ఆ లక్షణాలను పుణికిపుచ్చుకున్న నేత తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు.

వీరికి అండగా ఉందాం.. హరీశ్ రావు ట్వీట్

హైదరాబాద్: సంక్షోభ సమయాల్లోనే నాయకత్వ లక్షణాలు బయటపడతాయంటారు. ఆ లక్షణాలను పుణికిపుచ్చుకున్న నేత తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు.  సంక్షోభాలను ఎదుర్కొని.. ధైర్యంగా నిలబడటంలో ఆయనెప్పుడూ ముందుంటారు. ఇప్పుడు కరోనా అనే సంక్షోభం యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంటే.. నిత్యం జనాన్ని చైతన్యం చేస్తూ.. కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు హరీశ్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, శానిటైజేషన్ ఉపయోగించడం, చేతులు తరుచూ కడుక్కోవడం, ఇళ్లకే పరిమితమవ్వడం తదితర అంశాలను వివరిస్తూ జనంలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన జనం.. కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు, డాక్టర్లు, మున్సిపల్ సిబ్బంది ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్న వైనం మరోవైపు. ఈ నేపథ్యంలో పోలీసులు, డాక్టర్లు పడుతున్న కష్టాన్ని చెబుతూ హరీశ్ రావు ట్విట్టర్ వేదిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీశ్ ట్వీట్లపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ.. పోలీసులకు, డాక్టర్లకు తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు.  


పోలీసుల పడుతున్న కష్టాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. ‘‘సరిహద్దుల్లో సైనికులు మనకోసం ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో చూడనివాళ్లు ఈ దృశ్యాలు చూస్తే చాలు. విధి నిర్వహణలో మన తెలంగాణ పోలీసులు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి త్యాగాలకు మనం ఇవ్వగలిగిన గౌరవం, ఇంటిపట్టునే ఉండి లాక్‌డౌన్‌ను విజయవంతం చేయడం. వారికి నా శాల్యూట్’’ అని పేర్కొన్నారు.  


ఇక డాక్టర్ల గురించి చెబుతూ.. ‘‘అమ్మ మనకు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తున్నారు. కరోనాపై పోరాటంలో తెలంగాణ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది చూపుతున్న అంకితభావం, త్యాగనిరతి అద్భుతమైనవి. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలనే పణంగా పెడుతూ సైనికుల్లా పనిచేస్తున్న వీరందరికి అండగా ఉండటం మన బాధ్యత’’ అంటూ ట్వీట్ చేశారు. 





Updated Date - 2020-04-08T20:48:00+05:30 IST