గుర్రం చెరువు కబ్జాల గాథ
ABN , First Publish Date - 2020-11-06T09:57:13+05:30 IST
దశాబ్దాల క్రితం మంచి నీటితో కళకళలాడుతూ ప్రజల దాహార్తి తీర్చేది గుర్రం చెరువు. దీని కింద వందల ఎకరాల ఆయకట్టు ఉండేది.
ఎఫ్‌టీఎల్ పరిధిలో బస్తీలు
నాడు కళకళ నేడు విలవిల
చార్మినార్, నవంబర్ 5 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాల క్రితం మంచి నీటితో కళకళలాడుతూ ప్రజల దాహార్తి తీర్చేది గుర్రం చెరువు. దీని కింద వందల ఎకరాల ఆయకట్టు ఉండేది. చెరువు కింద గల హఫీజ్‌బాబానగర్, ఘాజీయే మిలత్ కాలనీ, ఫూల్‌బాగ్, నసీబ్‌నగర్, కందిగల్ గేట్, కృష్ణారెడ్డి నగర్, శివాజీనగర్, సాయిబాబానగర్, అరుంధతీ కాలనీ, గుల్షన్‌ఎక్బాల్ కాలనీ, ఆయేషా కాలనీ, యూసుఫియన్ కాలనీ, రక్షాపురం, ఫతేషానగర్ ప్రాంతాలలోని వందల ఎకరాల వ్యవసాయ భూములను సాగు చేసేవారు. తర్వాతి క్రామంలో ఆ భూములన్నింటినీ ప్లాట్లుగా మార్చి విక్రయించారు. దీంతో ఎఫ్‌టీఎల్ పరిధిలో కూడా బస్తీలు వెలిశాయి. ఈ చెరువు రంగారెడ్డి, హైదరాబాద్ మధ్యలో బాలాపూర్, బండ్లగూడ మండలాల పరిధిలో ఉండడంతో కబ్జాదారులు రెండు మండలాల అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఎఫ్‌టీఎల్ పరిధిలోని భూములు విక్రయించారు.
గుర్రం చెరువులోకి...
పహాడిషరీఫ్, షాహీన్‌నగర్, ఆర్‌సీఐ, మల్లాపూర్, సుల్తాన్‌పూర్, వెంకటాపూర్, కొత్తపేట్, బాలాపూర్ గ్రామం, దేవతలగుట్ట, ఫకీర్‌మల్లా, కురుమల్‌గూడ ప్రాంతాల్లోని వర్షపు నీరు నాలాల ద్వారా గుర్రం చెరువులోకి చేరేది. మల్లాపూర్ సుల్తాన్‌పూర్ మధ్యలోని అల్లంకుంటలో చెరువు నిండిన అనంతరం ఆ నీరు బాలాపూర్ పెద్ద చెరువులోకి చేరుతుంది. అక్కడి నుంచి బాలాపూర్‌లోని బతుకమ్మకుంట గుండా గుర్రం చెరువులోకి చేరుతుంది. వెంకటాపూర్ మల్లాపూర్ మధ్యలో ఉన్న బురాన్‌ఖాన్ చెరువులోకి జల్‌పల్లి వైపు నుంచి వచ్చే ఫిరంగి నాలా నీరు చేరుతుంది. కొన్ని దశాబ్దాలుగా బురాన్‌ఖాన్ చెరువు నీరు కిందకు వెళ్లకుండా తూములను మూసివేయడంతో ఉస్మాన్‌నగర్ బస్తీ ముంపునకు గురవుతోంది.
సగానికిపైగా కబ్జా
గుర్రం చెరువు రెండు జిల్లాలు, రెండు మండలాల పరిధిలో ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువు ఎఫ్‌టీఎల్‌లో గల వ్యవసాయ భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించేశారు. పదేళ్ల క్రితం సుమారు 80 ఎకరాల్లో ఉండే గుర్రం చెరువు ప్రస్తుతం 35 నుంచి 40 ఎకరాలకు కుంచించుకుపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు బురాన్‌ఖాన్ చెరువు, అలోన్‌కుంట, బాలాపూర్ పెద్ద చెరువు నుంచి అలుగు పోవడంతో ఆ నీరంతా గుర్రం చెరువులోకి చేరింది. గుర్రం చెరువు నిండి కట్టపై నుంచి వరద నీరు ప్రవహించింది. ఇది గమనించిన అధికారులు, ప్రజా ప్రతినిథులు కలిసి బార్కాస్ వైపు కట్టకు గండి కొట్టించి నీటిని వదిలారు. ఓ రోజు మధ్యరాత్రి భారీగా గండి పడడంతో చెరువులోని నీరు హఫీజ్‌బాబానగర్, నసీబ్‌నగర్, గుల్షన్ ఎక్బాల్ కాలనీ, అరుంఽధతి కాలనీలను ముంచెత్తడంతో భారీగా నష్టం జరిగింది. మున్ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే చెరువు తూముల ద్వారా ట్రంక్‌లైన్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
బాలాపూర్ మండల పరిధిలో కబ్జాకు గురైంది
గుర్రం చెరువు ఎక్కువ భాగం బండ్లగూడ మండల పరిధిలోకి వస్తుంది. ఎఫ్‌టీఎల్ పరిధి బాలాపూర్ మండల పరిధిలోకి వస్తుంది. ఎఫ్‌టీఎల్ పరిధిలో కాలనీలు వెలిశాయి. గతంలోనే కబ్జాలకు గురైంది. ఎఫ్‌టీఎల్ వివరాలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
- శ్రీనివాస్, తహసీల్దార్
పీడీ యాక్ట్ నమోదు చేయాలి
గుర్రం చెరువు ఎంతో విశాలంగా ఉండేది. చెరువు కబ్జాకు గురవుతుండడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల అభివృద్ధికి కృషి చేస్తుంటే బాలాపూర్ మండలంలోని చెరువులు, కుంటలు మాయమవుతున్నాయి. చెరువు స్థలాన్ని ప్లాట్లుగా మార్చి అమ్మేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి.
- బాల్ నింగని జంగయ్య, చెరువు, కుంటల పరిరక్షణ సమితి అధ్యక్షుడు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
గుర్రం చెరువు 78 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సుమారు 30 ఎకరాలు కబ్జాకు గురైంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అధికారుల ఆదేశాలతో చర్యలు తీసుకుంటాం.
- పరమేశ్వర్, ఇరిగేషన్ డీఈ