బియ్యం కోసం గుంపులు.. గుంపులుగా

ABN , First Publish Date - 2020-04-05T09:30:34+05:30 IST

నగరంలోని రేషన్‌ షాపుల వద్ద రోజుకు వంద మందికి మాత్రమే బియ్యం పంపిణీ చేస్తామని

బియ్యం కోసం గుంపులు.. గుంపులుగా

మియాపూర్‌/మల్కాజిగిరి/మన్సూరాబాద్‌/అల్లాపూర్‌/దుండిగల్‌/మంగళ్‌హాట్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): నగరంలోని రేషన్‌ షాపుల వద్ద రోజుకు వంద మందికి మాత్రమే బియ్యం పంపిణీ చేస్తామని అధికారులు ఇటీవల ప్రకటించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేషన్‌ షాపుల వద్ద క్యూలైన్లను ఏర్పాటు చేసి భౌతికదూరం పాటించి వరుస క్రమంలో సరుకులు అందజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసినా శనివారం పలు దుకాణాల వద్ద జనాలు గుంపులుగా ఎగబడ్డారు.


 మియాపూర్‌, హఫీజ్‌పేట, చందానగర్‌, గచ్చిబౌలి, లింగంపల్లి, రాయదుర్గం, కొండాపూర్‌, మాదాపూర్‌ ప్రాంతాల్లో ఉన్న రేషన్‌ షాపులు జనంతో కిటకిటలాడాయి. ఏమాత్రం సందు వదిలినా మరొకరు దూరుతారని భౌతికదూరం పాటించలేదు. వారికి మాస్క్‌లు కూడా లేవు. భౌతికదూరం పాటించేలా అక్కడి జనాలకు నిబంధన పెట్టేందుకు పోలీసులు కూడా లేరు.


ఆ వీధిలో జనాల గుంపును చూసి స్థానికులు సైతం భయాందోళనకు గురయ్యారు. చివరకు పోలీసులకు సమాచారమిస్తే మధ్యాహ్నానికి వచ్చారు. ఈ పరిస్థితే నగరంలోని పలు ప్రాంతాల్లో రేషన్‌ దుకాణాల వద్ద నెలకొంది. నాంపల్లి, గోషామహల్‌ నియోజకవర్గాల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు పనిచేయపోవడంతో రేషన్‌ షాపుల వద్ద జనాలు గంటల తరబడి వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది.

Updated Date - 2020-04-05T09:30:34+05:30 IST