గ్రేటర్‌ ఆర్టీసీకి రూ.225 కోట్ల నష్టం

ABN , First Publish Date - 2020-05-18T08:45:58+05:30 IST

గ్రేటర్‌ ఆర్టీసీపై లాక్‌డౌన్‌ తీవ్రమైన ప్రభావం చూపుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత కూడా మరింత ప్రభా వం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గ్రేటర్‌ ఆర్టీసీకి రూ.225 కోట్ల నష్టం

లాక్‌డౌన్‌తో 57 రోజులుగా నయా పైసాలేదు

మూతపడిన కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు

నిర్వహణ లేక అద్దెలు చెల్లించలేని పరిస్థితి


హైదరాబాద్‌ సిటీ, మే17 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ ఆర్టీసీపై లాక్‌డౌన్‌ తీవ్రమైన ప్రభావం చూపుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత కూడా మరింత ప్రభా వం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనతా కర్ఫ్యూ నాటి నుంచి నగరంలో ప్రధాన ప్రజా రవాణా వ్యవస్థగా ఉన్న ఆర్టీసీ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రజా అవసరాల మేరకు అడపా దడపా బస్సులను వినియోగిస్తున్నా.. ఆర్టీసీకి నయా పైసా ఆదాయం రావడం లేదు. 57 రోజులుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో గ్రేటర్‌ ఆర్టీసీకి రూ. 225 కోట్ల ఆదాయానికి గండిపడింది. ఆర్టీసీ చరిత్రలోనే ఇంత కాలం పాటు బస్సులన్నీ  డిపోలకే పరిమితమవ్వడం ఇదే తొలిసారి. 


రోజుకు రూ. 3.9 కోట్ల నష్టం...

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో రోజూ సుమారు 30 లక్షల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేవారు. దీంతో ప్రతి నెలా ఆర్టీసీకి రూ.117 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రతి నెలా కార్మికుల జీతాలు, డీజిల్‌ చార్జీలు, స్పేర్‌పార్ట్స్‌ ఇతర ఖర్చు రూ.145 కోట్లు. ఆర్టీసీకి వచ్చే ఆదాయం కంటే ఖర్చే అధికంగా ఉండడంతో ప్రతి నెలా రూ.28 కోట్ల నష్టం వచ్చేది. లాక్‌డౌన్‌ వల్ల ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకపోవడంతో మొత్తంగా రూ. 225 కోట్ల ఆదాయం కోల్పోయింది.


అద్దెల ద్వారా ఆదాయం లేదు...

నగరంలోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, కోఠి, కేపీహెచ్‌బీ, దిల్‌సుఖ్‌నగర్‌, రేతిబౌలి, కుషాయిగూడ, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో ఆర్టీసీకి కమర్షియల్‌ భవనాలున్నాయి. వాటిని అద్దె ప్రాతిపదికన వివిధ జనరల్‌ స్టోర్స్‌, హోట ళ్లు తదితర వాటికి ఇచ్చారు. ఆర్టీసీ ప్రాంగణాల్లో పార్కింగ్‌ కూడా నడుపుతున్నారు. వీటి ద్వారా ప్రతి నెలా రూ. 3 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. లాక్‌డౌన్‌తో అవన్నీ మూతపడ్డాయి. దీంతో అద్దెల ద్వారా కూడా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. 


లాక్‌డౌన్‌ తర్వాత ఇబ్బందులేనా..?

లాక్‌డౌన్‌ తర్వాత బస్సులు నడిపే తీరుపై ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో కిక్కిరిసేలా బస్సులు ప్రయాణం చేస్తున్నా.. ప్రతి నెలా పెద్దఎత్తున నష్టం వస్తోంది. లాక్‌డౌన్‌ తర్వాత బస్సులో కేవలం 32 మంది మాత్రమే ప్రయాణించాల్సి ఉండడంతో నిర్వహణ కష్టంగా మారే అవకాశం ఉంది. 


ఆర్టీసీ బస్సుల్లో భౌతిక దూరం అమలు చేయాలంటే గతంతో పోల్చితే ప్రయాణికుల సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా గ్రేటర్‌ ఆర్టీసీకి ఇబ్బందికర పరిస్థితి ఉండనుందని ఓ అధికారి చెప్పారు. 

Updated Date - 2020-05-18T08:45:58+05:30 IST