గ్రేటర్‌లో తగ్గుతున్న కట్టడి ప్రాంతాలు

ABN , First Publish Date - 2020-04-25T10:46:15+05:30 IST

గ్రేటర్‌ పరిధిలోగల కట్టడి ప్రాంతాల్లో కరోనా వైరస్‌ ప్రభావం తగ్గుతుండడంతో ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు.

గ్రేటర్‌లో తగ్గుతున్న కట్టడి ప్రాంతాలు

మంగళ్‌హాట్‌లో 422 మందికి విముక్తి 

హబ్సిగూడ, ఖైరతాబాద్‌, సుభా్‌షనగర్‌లో తొలగింపు  

కోకాపేటలో కొనసాగింపు 

గాజులరామారం సర్కిల్‌లో అధికారుల పర్యటన 


హైదరాబాద్‌ సిటీ న్యూస్‌ నెట్‌వర్క్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ పరిధిలోగల కట్టడి ప్రాంతాల్లో కరోనా వైరస్‌ ప్రభావం తగ్గుతుండడంతో ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. మంగళ్‌హాట్‌ ప్రాంతంలో కరోనా వచ్చిన వ్యక్తికి నయం కావడం, అతడి 15 రోజుల హోం క్వారంటైన్‌ పూర్తవడంతో కట్టడి ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను ఇన్‌స్పెక్టర్‌ రణ్‌వీర్‌రెడ్డి సమక్షంలో జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించారు. ఆ ప్రాంతంలో ఉన్న 422 మంది ఇళ్లకే పరిమితమయ్యారు. దాదాపు నెలరోజులు బిక్కుబిక్కుమంటూ జీవించిన ఆర్‌కేపేట ప్రజలు కట్టడి ప్రాంతం నుంచి విముక్తి లభించడంతో సంతోషం వ్యక్తం చేశారు. 


హబ్సిగూడలో..

హబ్సిగూడ కాకతీయనగర్‌లో కరోనా పాజిటివ్‌ వచ్చిన యువతికి నెగెటివ్‌ రావడంతో ఇంటికి చేరింది. జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ ప్రాంతాన్ని కట్టడి నుంచి తొలగించారు. వైద్య సిబ్బంది ఆ ప్రాంతంలోని వారికి ప్రతిరోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఉదయం, సాయంత్రం సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తారని నోడల్‌ అధికారిణి నాగమణి తెలిపారు.  


ఖైరతాబాద్‌లో..

ఖైరతాబాద్‌ సర్కిల్‌లో ఐదు కట్టడి ప్రాంతాలు ఉండగా కొన్నిరోజుల క్రితం సోమాజిగూడ, బల్కంపేటలో బారికేడ్లను తొలగించారు.  లక్డీకాపూల్‌ లూథరన్‌ చర్చి వీధి, ఓల్డ్‌ిసీబీఐ క్వార్టర్స్‌లో ఉన్న కట్టడి ప్రాంతాలను శుక్రవారం తొలగించారు. ప్రస్తుతం ఓల్డ్‌ సీబీఐ క్వార్టర్స్‌, పంజాగుట్ట ప్రాంతాలు మాత్రమే కట్టడిలో ఉన్నాయి.


కోకాపేటలో..

నార్సింగ్‌ మున్సిపాలిటీ పరిధి కోకాపేటలో కట్టడి జోన్‌ను మున్సిపల్‌ అధికారులు కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో నలుగురు కరోనా పేషెంట్లు ఉండగా వారు గాంధీ ఆస్పత్రి నుంచి ఇటీవల డిశ్చార్జి అయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా కట్టడి జోన్‌ను కొనసాగిస్తున్నామని పోలీసులు, మున్సిపల్‌, వైద్యాధికారులు నిత్యం అందుబాటులో ఉంటున్నారని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.  


రాజేంద్రనగర్‌లో..

రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో ఉప్పర్‌పల్లి, ఎంఎం పహాడీ, కింగ్స్‌ కాలనీ, అన్సారీ రోడ్డులోని కట్టడి ప్రాంతాలను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 


సుభా్‌షనగర్‌లో..

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ సుభా్‌షనగర్‌ డివిజన్‌లోని అపురూపకాలనీ, మోడీ బిల్డర్స్‌, సుభా్‌షనగర్‌ను కట్టడి నుంచి మినహాయించారు. ఆ ప్రాంతాలను ఎమ్మెల్యే వివేకానంద్‌ పరిశీలించారు. ప్రజలు, అధికారుల సహకారంతో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. 


గాజులరామారం సర్కిల్‌లో..

 కట్టడిలో ఉన్న గాజులరామారం సర్కిల్‌ పరిధిలోని చంద్రగిరినగర్‌, కళావతినగర్‌, జహంగీర్‌ బస్తీల్లో సెంట్రల్‌ ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందం రీజనల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ పర్యటించారు. కట్టడి ప్రాంతంలోని ప్రజలకు ప్రతిరోజూ టెంపరేచర్‌ పరీక్షలు నిర్వహించాలని వైద్యసిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఏఎంవోహెచ్‌ డా.చంద్రశేఖర్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఆనంద్‌, డాక్టర్‌ నవనీత పాల్గొన్నారు.  

Updated Date - 2020-04-25T10:46:15+05:30 IST