ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగి
ABN , First Publish Date - 2020-03-08T10:37:11+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తూ మరో ప్రభుత్వ ఉద్యోగిని లంచం డిమాండ్ చేసిన ఓ అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు శనివారం పట్టుకున్నారు.

ఆబిడ్స్(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తూ మరో ప్రభుత్వ ఉద్యోగిని లంచం డిమాండ్ చేసిన ఓ అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు శనివారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వరరావు తెలిపిన ప్రకారం.. నారాయణగూడ విఠల్‌వాడి ప్రాంతానికి చెందిన కొనుగంటి కృష్ణ సర్వే అండ్ ల్యాండ్స్‌లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు గతంలో పెండింగ్‌లో ఉన్న జీతాల బిల్లు రూ. 1,78,737 రావలసి ఉంది. ఇందుకు సంబంధించిన బిల్లు కోసం బీమా భవన్‌లోని పీఏఓ కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. ఇందుకోసం సెక్షన్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న తోట రామారావు బిల్లును పాస్ చేసేందుకు ఆడిటర్ గోపీనాథ్‌తో ఫోన్ చేయించి రూ.5వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని కృష్ణ అతడి వాయి్‌సను రికార్డు చేసి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫోన్ రికార్డింగ్ ఆధారంగా ఏసీబీ అధికారులు రామారావును విచారించి అదుపులోకి తీసుకుని మేజిస్ర్టేట్ ముందు హాజరుపర్చారు. ఆడిటర్ గోపీనాథ్ పరారీలో ఉన్నట్టు డీఎస్పీ తెలిపారు.