గూగుల్‌లో నకిలీల గోల

ABN , First Publish Date - 2020-02-16T08:32:25+05:30 IST

ఫ్రిజ్‌, టీవీ, వాషింగ్‌ మెషిన్‌, ఎయిర్‌ కూలర్‌.. ఏది కొన్నా సమస్య ఎదురైతే కస్టమర్‌ కేర్‌ నెంబర్లకు ఫోన్‌ చేయడం అందరికీ అలవాటే.

గూగుల్‌లో నకిలీల గోల

హిమాయత్‌నగర్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : ఫ్రిజ్‌, టీవీ, వాషింగ్‌ మెషిన్‌, ఎయిర్‌ కూలర్‌.. ఏది కొన్నా సమస్య ఎదురైతే కస్టమర్‌ కేర్‌ నెంబర్లకు ఫోన్‌ చేయడం అందరికీ అలవాటే. ఆ అలవాటే కొందరి కొంప ముంచుతోంది. గూగుల్‌ లో నకిలీ నెంబర్లను పెడుతున్న సైబర్‌ నేరగాళ్లు కస్టమర్లను మోసం చేస్తూ ఖాతాల్లో సొమ్ము డ్రా చేసేస్తున్నారు.


బిర్యానీ కోసం ఉచ్చులో పడి... 

రహ్మత్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు జొమాటోలో బిర్యానీ ఆర్డర్‌ ఇచ్చాడు. కానీ అతడికి ఆ సంస్థ సాధారణ భోజనం డెలివరీ చేసింది. దీనిపై అతను జొమాటోకు ఫిర్యాదు చేసేందుకు గూగుల్‌లో నెంబర్‌ సెర్చ్‌ చేశాడు. ఓ నెంబర్‌కు కాల్‌ చేసి సైబర్‌ నేరగాళ్ల వలలో పడిపోయాడు. రూ. 50,000 పోగొట్టుకున్నాడు. ఆర్డర్లు క్యాన్సిల్‌ కావడం, తప్పుగా డెలివరీ కావడం వంటి పొరపాట్ల వల్ల వినియోగదారులు అయోమయానికి గురి అవుతున్నారని, ఆ సందర్భాల్లో కస్టమర్‌ కేర్‌ నెంబర్లుగా భావించి నకిలీ నెంబర్లకు ఫోన్‌ సైబర్‌ మోసాలకు గురి అవుతున్నారని సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ విశ్లేషిస్తున్నారు. 


అప్రమత్తంగా వ్యవహరించాలి .. సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌

ఫుడ్‌ డెలివరీ సంస్థల నుంచి సేవలు విఫలమైన పక్షంలో డబ్బులను రిటర్న్‌ తీసుకునే విషయంలో అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించాలి. గూగుల్‌లోకి వెళ్లి హడావుడిగా కాల్‌ సెంటర్ల నెంబర్లు సెర్చ్‌ చేసి ఫోన్‌ చేయకూడదు. ఆ నెంబర్లను ఒకసారి పరిశీలించాలి. గూగుల్‌లో సగానికి పైగా సైబర్‌ నేరగాళ్లకు చెందిన ఫేక్‌ కాల్‌సెంటర్‌ నెంబర్లు ఉంటున్నాయి. ఫోన్లలో మాట్లాడి ఎదుటి వ్యక్తులు సూచించే ఎలాంటి బార్‌ కోడ్‌, క్యూఆర్‌ కోడ్‌, లింక్‌లను వారి నెంబర్లకు పంపించవద్దు. ఒకవేళ వాళ్లు పంపించినా వాటిని ఓపెన్‌ చేయకూడదు. అలా చేస్తే మన ఖాతాలో ఉండే డబ్బులు సదరు లింక్‌ ద్వారా లాగేసుకునే అవకాశముంటుంది. నేరుగా సంస్థలకు చెందిన కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేయడం ఉత్తమం. 

Updated Date - 2020-02-16T08:32:25+05:30 IST