వనస్థలిపురం వాసులకు గుడ్‌న్యూస్.. ఈ రోజు నుంచి..

ABN , First Publish Date - 2020-05-18T16:03:46+05:30 IST

వనస్థలిపురం కరోనా భయం నుంచి బయటపడుతోంది. వైరస్‌తో పోరాడిన వారంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు చేరుకోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

వనస్థలిపురం వాసులకు గుడ్‌న్యూస్.. ఈ రోజు నుంచి..

తేరుకుంటున్న వనస్థలిపురం

42 మంది ప్రైమరీ కాంటాక్టులన్నీ నెగెటివ్‌

నేడు రెండు కట్టడి ప్రాంతాల తొలగింపు


వనస్థలిపురం/హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): వనస్థలిపురం కరోనా భయం నుంచి బయటపడుతోంది. వైరస్‌తో పోరాడిన వారంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు చేరుకోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రెండు కట్టడి ప్రాంతాలను తొలగించనున్నారు. బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌, ఎస్కేడీనగర్‌ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనా బాధితుల్లో భార్య, కుమారుడు వైరస్‌ను జయించి గాంధీ ఆస్పత్రి నుంచి ఆదివారం ఇంటికి చేరుకున్నారు.

కుటుంబ పెద్ద కూడా సోమవారం డిశ్చార్జి అవుతారని సర్కిల్‌-3 ఉప కమిషనర్‌ మారుతీ దివాకర్‌ తెలిపారు. వనస్థలిపురం కాంప్లెక్స్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కరోనా బాధితుల్లో గృహిణి, ఈమె ఇద్దరు పిల్లలు వైరస్‌ను జయించి ఇంటికి చేరుకున్నారు. 72 ఏళ్ల వృద్ధురాలు (గృహిణి అత్త) సోమవారం డిశ్చార్జి అవుతారని సర్కిల్‌-4 ఉప కమిషనర్‌ విజయకృష్ణ తెలిపారు. ఈ కుటుంబంలో 76 ఏళ్ల వృద్ధుడు, ఆయన 42 ఏళ్ల కుమారుడు మృతి చెందారు. ఈ మూడు డివిజన్లలో 28 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకు మృతి చెందారు. ఈ క్రమంలో కరోనా బాధితులకు ప్రైమరీ కాంటాక్టులుగా ఉన్న 42 మంది నుంచి సేకరించిన శాంపిల్స్‌ కూడా నెగిటివ్‌గా అధికారులు నిర్ధారించటంతో స్థానికులు భయం గుప్పిట్లోంచి బయటపడ్డారు. మూడు డివిజన్లలో 907మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. వీరిలో ఎవరికీ వ్యాధి లక్షణాలు బయటపడలేదు.


కింగ్‌కోఠి ఆస్పత్రిలో ముగ్గురు.. 

కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు 3 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఆస్పత్రి ఓపీ విభాగానికి మొత్తం 65 మంది రోగులు రాగా, వారిలో 14 మందిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ 26 మంది కరోనా రోగులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో ఇద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 


సరోజినీలో ఐదుగురు.. 

మెహిదీపట్నం సరోజినీదేవి ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో ఐదుగురు ఉన్నట్లు ఇన్‌చార్జి డాక్టర్‌ అనురాధ తెలిపారు. వీరంతా రంగారెడ్డి జిల్లాకు చెందిన వారని అన్నారు. 


చెస్ట్‌ ఆస్పత్రిలో..

ఎర్రగడ్డలోని ఛాతీవ్యాధుల ఆస్పత్రిలో 18 మంది అనుమానితులు ఉన్నారు. ఒకరిని డిశ్చార్జి చేసినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ తెలిపారు. 


ఆయుర్వేద ఆస్పత్రిలో...

ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రిలో ఆదివారం మొత్తం 15 మంది అనుమాతులు ఉన్నారు. ఇద్దరికి నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జి చేశామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పరమేశ్వర్‌ నాయక్‌ తెలిపారు. 


ఫీవర్‌ ఆస్పత్రిలో..

నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రికి ఇద్దరు అనుమానితులు వచ్చారు. వారి నమూనాలు సేకరించి, ల్యాబ్‌కు పంపించారు. గ్రేటర్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండగా ఫీవర్‌ ఆస్పత్రికి మాత్రం అనుమానిత కేసులు తగ్గుతున్నాయి. 

Updated Date - 2020-05-18T16:03:46+05:30 IST