బౌద్ధనగర్‌లో చోరీ.. 13.5 తులాల బంగారం పోతే.. ఎఫ్‌ఐఆర్‌లో 5 తులాలే నమోదు.!

ABN , First Publish Date - 2020-12-10T06:58:03+05:30 IST

బౌద్ధనగర్‌లో భారీ దొంగతనం జరిగింది. చిలకలగూడ పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బౌద్ధనగర్‌లో చోరీ.. 13.5 తులాల బంగారం పోతే..  ఎఫ్‌ఐఆర్‌లో 5 తులాలే నమోదు.!

13.5తులాల బంగారం, 50తులాల వెండి, లక్షా పదివేల నగదు అపహరణ

 ఎఫ్‌ఐఆర్‌లో 5తులాలే నమోదు.!


బౌద్ధనగర్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): బౌద్ధనగర్‌లో భారీ దొంగతనం జరిగింది. చిలకలగూడ పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేవలం పదిహేను నిమిషాల్లోనే నిందితుడు తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించి 13.5 బంగారు నగలు, 50తులాల వెండి, రూ.10 లక్షల నగదును ఎత్తుకెళ్లాడు. బౌద్ధనగర్‌ కనకదుర్గ ఆలయం వెనుక వీధిలో కొల్తూరి చంద్రశేఖర్‌ చారి, కుమారుడు శశాంక్‌, భార్య భాగ్యలక్ష్మి, కుమార్తె మేఘనతో కలిసి తన నాలుగంతస్తుల అపార్టుమెంట్‌లోని మొదటి ఫ్లోర్‌లో నివసిస్తున్నారు. చంద్రశేఖర్‌చారి సైనిక్‌పురిలోని బ్యాటరీ షాపును నిర్వహిస్తున్నాడు. ఈ నెల 7న ఉదయం చంద్రశేఖర్‌చారి షాపునకు వెళ్లాడు. భార్య భాగ్యలక్ష్మి ఇంటికి తాళం వేసి కుమారుడు, కుమార్తెతో కలసి ఉదయం 11:58 నిమిషాలకు షాపింగ్‌ కోసం సికింద్రాబాద్‌ వెళ్లారు. వారు షాపింగ్‌ చేస్తుండగా.... ఆదే భవనంలో అద్దెకు ఉంటున్న కిషోర్‌ ఫోన్‌ చేసి మీ ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయని కార్పెంటర్‌ రాము చెప్పాడని చెప్పాడు. దాంతో భాగ్యలక్ష్మి మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ఇంటికి రాగా తాళాలు పగలుగొట్టి ఉన్నాయి. వెంటనే భర్తకు ఫోన్‌ చేసి విషయాన్ని తెలిపింది. చంద్రశేఖర్‌చారి వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా ఫర్నీచర్‌ కప్‌బోర్డులోని వస్తువులు చిందర వందరగా పడి ఉండి, ఖాళీ బంగారు బాక్సులు కిందపడి ఉన్నాయి. వెంటనే బాధితుడు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌కుమార్‌, క్లూస్‌టీమ్‌, డాగ్‌స్క్వాడ్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. డాగ్స్‌ జామై ఉస్మానియా వరకు వెళ్లి ఆగిపోయాయి. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా ఒక వ్యక్తి ఇంటి లోపలకు వెళ్లి పదిహేను నిమిషాల్లో బయటకు వచ్చిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. సంఘటన ఉదయం 12గంటల నుంచి 1:00 గంటలోపు జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. బాధితుడు చంద్రశేఖర్‌ 13.5 తులాల బంగారు నగలు, 50తులాల వెండినగలు, లక్షాపదివేలు నగదు పోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు కేవలం ఐదుతులాల బంగారు నగలు పోయినట్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బాధితుడు 13.5బంగారు నగలు, 50తులాల వెండి. లక్షా పదివేలు నగదు పోయినట్టు మరో ఫిర్యాదును పోలీసులకు అందజేశారు. చంద్రశేఖర్‌చారి తన ఇంట్లోని నాల్గవ అంతస్తులో కొన్నిరోజుల నుంచి కార్పెంటింగ్‌ పనులను చేయిస్తున్నాడు. ఈ చోరీకి, కార్పెంటర్‌కు సంబంధం ఏమైనా ఉందోమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో కార్పెంటర్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఎనిమిది పోలీసు బృందాలు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలిస్తున్నాయి

Updated Date - 2020-12-10T06:58:03+05:30 IST