సెటిల్ చేసుకుందాం.. రండి..!
ABN , First Publish Date - 2020-07-19T09:53:50+05:30 IST
కరోనా కాలం.. ఆదాయం తగ్గింది. ఖర్చులు పెరిగాయి. మరోవైపు అప్పుల భారం నేపథ్యంలో...

- వివాదాల పరిష్కారానికి అధికారుల చొరవ
- ఆదాయం పెంపుపై బల్దియా దృష్టి
- కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తి పన్ను వసూలుకు ప్రయత్నం
- యజమానులతో సంప్రదింపులకు యోచన
- రూ.25 కోట్లు పెండింగ్
హైదరాబాద్ సిటీ, జూలై 18(ఆంధ్రజ్యోతి): కరోనా కాలం.. ఆదాయం తగ్గింది. ఖర్చులు పెరిగాయి. మరోవైపు అప్పుల భారం నేపథ్యంలో ఖజానా నింపుకోవడంపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. ప్రత్యామ్నాయ వనరులను అన్వేషిస్తోంది. ఇతర విభాగాల నుంచి రావాల్సిన నిధులు, పౌరుల చెల్లించాల్సిన పన్నుల బకాయిల వసూలు దిశగా కసరత్తు ప్రారంభించారు.
సంస్థకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను. లాక్‌డౌన్ ఉన్నా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో కూడా రూ.1,400 కోట్లకుపైగా వసూలైంది. 2020-21కి సంబంధించి ఇప్పటి వరకు రూ.700 కోట్లు ఖజానాలో చేరాయి. పన్నుల వసూలు ఆశాజనకంగానే ఉన్నా, ఇతరత్రా వనరుల ద్వారా ఆదాయం తగ్గడంతో బకాయిల వసూలుకు అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా కోర్టు విచారణలో ఉన్న ఆస్తిపన్నుపై దృష్టిసారించారు. కోర్టు కేసులతో రూ.25 కోట్ల పన్ను బకాయి ఉండగా, ఇందులో వీలైనంత మేర ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం(పీటీపీ) ద్వారా వసూలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు సర్కిల్ కార్యాలయాల వారీగా ఆర్థిక సంవత్సరాంతంలో పీటీపీ వేదికలు ఏర్పాటు చేసి, ఆస్తిపన్ను చెల్లింపుదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఇప్పుడు అందుకు భిన్నంగా కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తుల యజమానులను ఫోన్‌లో సంప్రదించి పరిష్కారం దిశగా చర్చించాలని భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొన్న నేపథ్యంలో నిర్మాణ రంగ ప్రాజెక్టులకు సంబంధించి కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. ఇప్పటికే ఆమోదించిన ఫైళ్లకు సంబంధించిన రుసుము చెల్లించేందుకూ కొందరు ముందుకు రావడం లేదు. యేటా రూ.800 కోట్ల నుంచి రూ.900 కోట్ల వరకు ఆదాయం వచ్చే సంస్థపై ప్రస్తుత పరిస్థితుల వల్ల తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా ఇతర ఆదాయ వనరుల మెరుగుదలపై అధికారులు దృష్టి సారించారు.
అత్యధికంగా ఖైరతాబాద్ జోన్‌లో...
గ్రేటర్‌లో 16.08 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులున్నారు. ఏటా మెజార్టీ పౌరులు పన్ను చెల్లిస్తున్నా, పలు కారణాలతో కొన్ని ఆస్తులకు సంబంధించిన కేసులు వివిధ కోర్టుల విచారణలో ఉన్నాయి. ఆస్తిపన్ను మదింపు సరిగ్గా లేదని, పెనాల్టీ అధికంగా వేశారని తదితర కారణాలతో యజమానులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. సమస్య చిన్నదే అయినా, అధికారులు చొరవ చూపకపోవడంతో పరిష్కారానికి యేళ్లు పడుతోంది. కోర్టు స్టేతో పన్ను వసూలు కాక, సమస్య పరిష్కారం కాక జీహెచ్‌ఎంసీకి ఆర్థికంగా నష్టం జరుగుతోంది. అత్యఽధికంగా ఖైరతాబాద్ జోన్‌కు సంబంధించి కింది కోర్టులో 95 కేసులు పెండింగ్‌లో ఉండగా, ఆ ఆస్తుల నుంచి రూ.7.97 కోట్లు, హైకోర్టులో విచారణలో ఉన్న 38 కేసుల నుంచి రూ.4.36 కోట్లు వసూలు కావాల్సి ఉంది. సికింద్రాబాద్ జోన్ పరిధిలోని 45 కేసులు కిందికోర్టులో (రూ.2.49 కోట్లు), హైకోర్టులో 31 కేసులు (రూ.81 లక్షలు) విచారణలో ఉన్నాయి. అత్యల్పంగా శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని ఆస్తులకు సంబంధించి కింది కోర్టులో 5, హైకోర్టులో 11, కూకట్‌పల్లి జోన్ పరిధిలో కింది కోర్టులో 6, హైకోర్టులో 7 కేసులు విచారణలో ఉన్నాయి.