ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకూ వాళ్లే..!

ABN , First Publish Date - 2020-12-07T12:36:38+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలూ వెలువడ్డాయి.

ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకూ వాళ్లే..!

ప్రస్తుత కార్పొరేటర్లు యథాతధం

బడ్జెట్‌ ప్రతిపాదనలు ఆమోదిస్తారా..? 


హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలూ వెలువడ్డాయి. విజేతలెవరు అన్నదీ తేలింది. పూర్వ ఎంసీహెచ్‌, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ చరి త్రలో ఎప్పుడూ లేని విధంగా పాలకమండలి గడువు ముగియక ముందే ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీన ముగియనుండగా.. చట్ట ప్రకారం అప్పటి వరకు కొత్తగా ఎన్ని కైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేదని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు నెలలపాటు ప్రస్తుత పాలకమండలి యథాతధంగా కొనసాగనుంది. అప్పటి వరకు అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో ఇప్పుడున్న కార్పొరేటర్లు పాల్గొనే అవకాశం ఉంటుంది. సిట్టింగ్‌లు 35మందికిపైగా ఓడిపోయిన నేపథ్యంలో వారు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. పరాజయం బాధతో వారు రాకున్నా.. కొత్త వారిని అధికారికంగా పిలిచే అవకాశం ఉండదు. ప్రమాణ స్వీకారం అనంతరమే గెలిచిన వారు సాంకేతికంగా కార్పొరేటర్లుగా పరిగణింపబడతారు.


స్టాండింగ్‌ కమిటీ, కౌన్సిల్‌ సమావేశాలు యథాతధంగా...

ప్రస్తుత పాలకమండలితో స్టాండింగ్‌ కమిటీ, కౌన్సిల్‌ సమావేశాలు యథాతధంగా కొనసాగించే వెసులుబాటు చట్టంలో ఉందని అధికారులు చెబుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5,600కోట్లతో ప్రతిపాదించిన జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ను గత నెలలో స్టాండింగ్‌ కమిటీ ఎదుట ఉంచారు. నిబంధనల ప్రకారం ఈ నెల 10వ తేదీ నాటికి కమిటీలో ఆమోదించి 15వ తేదీ వరకు కౌన్సిల్‌ ముందుంచాలి. ఎన్నికలు జరిగిన నేపథ్యంలో స్టాండింగ్‌ కమిటీ నిర్వహిస్తారా..? లేదా..? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. బడ్జెట్‌ ప్రతిపాదనలు మార్చి వరకు ప్రభుత్వానికి పంపాల్సి ఉందని, ఆ లోపు స్టాండింగ్‌ కమిటీ, కౌన్సిల్‌లో ఆమోదించినా చాలని జీహెచ్‌ఎంసీ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2020-12-07T12:36:38+05:30 IST