గ్రేటర్ రేసులో కాంగ్రెస్ ఎంత దూరంలో ఉందంటే...
ABN , First Publish Date - 2020-11-25T07:07:26+05:30 IST
గ్రేటర్‌పై పట్టు సాధించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

గ్రేటర్‌పై పట్టు సాధించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 150 డివిజన్లకు గాను 148 చోట్ల అభ్యర్థులను బరిలోకి దించి టీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీగా నిలవడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. పార్టీ ఓటు బ్యాంకుతో పాటు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడమే ధ్యేయంగా ముందుకెళ్తోంది. ప్రధానంగా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలోని డివిజన్లపై కాంగ్రెస్ గురి పెట్టింది.
హైదరాబాద్ సిటీ, నవంబర్ 24 (ఆంధ్రజ్యోతి) : అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌లో రెండు ఎమ్మెల్యే స్థానాలతో పాటు కుత్బుల్లాపూర్, ముషీరాబాద్, సికింద్రాబాద్ తదితర నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఎల్‌బీనగర్, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్ గూటికి చేరిపోయారు. అయినప్పటికీ పార్టీ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదనే ధీమా కాంగ్రెస్‌లో ఉంది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలో దిగి మాల్కాజిగిరి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నాడు తనకు పడిన ప్రతి ఓటునూ తిరిగి గ్రేటర్ ఎన్నికల్లో రాబట్టుకోవడానికి రేవంత్ కసరత్తు చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలనే..
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో ఆ పార్టీల పాలనలోని వైఫల్యాలను నగరవాసుల ముందుకు తీసుకెళ్ళేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. టీఆర్‌ఎస్ వైఫల్యాలను బీజేపీ ఎత్తి చూపుతుంటే, బీజేపీ వైఫల్యాలను టీఆర్‌ఎస్ వేలెత్తి చూపుతోంది. ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది.
ఆ నియోజకవర్గాలపైనే..
గ్రేటర్‌లోని మహేశ్వరం, ఎల్‌బీనగర్ నియోజకవర్గాలతో పాటు ఉప్పల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాల్లో బలమైన ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు ఉండడంతో నియోజకవర్గాల వారీగా ప్రధాన పోటీగా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో అధికంగా నల్లగొండ జిల్లా ప్రాంతానికి చెందినవారుండడంతో ఆయా ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలను రంగంలోకి దించి ప్రచారం చేస్తున్నారు. మల్కాజిగిరి, ఉప్పల్ ప్రాంతాల్లో అధికంగా వరంగల్, జనగాం తదితర జిల్లాలలకు చెందిన వారుండడంతో ఆయా ప్రాంతాలకు చెందిన నేతలను రంగంలోకి దించారు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో పటాన్‌చెరు, నాచారం డివిజన్‌లు మాత్రమే కాంగ్రెస్‌కు దక్కగా, ఈ సారి ఆయా డివిజన్లతో పాటు మరిన్ని డివిజన్లలో జయకేతనం ఎగురవేసి, ఓటింగ్ శాతాన్ని పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరి నగర ఓటర్లు కాంగ్రెస్‌ను ఆదరిస్తారా..? లేదా..? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.