‘తొలి’ పొద్దు పొడిచేనా..?
ABN , First Publish Date - 2020-11-26T06:47:27+05:30 IST
గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ పడుతున్న వారిలో తొలిసారిగా బరిలో దిగినవారు చాలా మంది ఉన్నారు. కొంతమంది భర్తల చాటు భార్యలు కాగా, మరికొంత మంది ఎన్నోమార్లు పార్టీ టికెట్ కోసం ప్రయత్నించి ఎట్టకేలకు దక్కించుకుని పోటీలో నిలిచారు. 150 డివిజన్లలో అన్ని ప్రధాన పార్టీల నుంచి సుమారు 312 మంది అభ్యర్థులు మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన వారు ఉన్నారు.

తొలిసారి ఎన్నికల బరిలో 312 మంది
అత్యధికంగా కాంగ్రెస్, బీజేపీల నుంచే
వారి రాజకీయ భవితవ్యానికి ఓ పరీక్షా
గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ పడుతున్న వారిలో తొలిసారిగా బరిలో దిగినవారు చాలా మంది ఉన్నారు. కొంతమంది భర్తల చాటు భార్యలు కాగా, మరికొంత మంది ఎన్నోమార్లు పార్టీ టికెట్ కోసం ప్రయత్నించి ఎట్టకేలకు దక్కించుకుని పోటీలో నిలిచారు. 150 డివిజన్లలో అన్ని ప్రధాన పార్టీల నుంచి సుమారు 312 మంది అభ్యర్థులు మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన వారు ఉన్నారు.
హైదరాబాద్ సిటీ, నవంబర్ 25 (ఆంధ్రజ్యోతి) : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 50 శాతం స్థానాలను మహిళలకు రిజర్వు చేయడంతో నేతలను తమ భార్యలను బరిలో నిలిపారు. టీఆర్‌ఎస్ 27 మంది కొత్తవారికి ఈ ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది. వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నారు. చర్లపల్లి డివిజన్ నుంచి మేయర్ బొంతురామ్మోహన్ భార్య శ్రీదేవి యాదవ్ తొలిసారి పోటీ చేస్తున్నారు. బేగంబజార్ నుంచి పూజావ్యాస్ బిలాల్, సుభాష్ నగర్ టీఆర్‌ఎస్ నుంచి గుడిమెట్ల హేమలత, అలాగే టీఆర్‌ఎస్ నుంచి మియాపూర్ అభ్యర్థిగా ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ రఘునాథరెడ్డి, గోల్నాక దూసరి లావణ్య, కాచిగూడ శిరీష, బౌద్ధనగర్ కంది శైలజ, అడ్డగుట్ట ప్రసన్నలక్ష్మీ, ఉప్పుగూడ శోభారెడ్డి, ఆర్‌కేపురం విజయభారతి, గౌలిపురా సరిత, దూద్‌బౌలి రహమన్, నవాబ్‌సాబ్ కుంట సమీనాబేగం, ఫలక్‌నుమా గిరిధర్‌నాయక్, రమ్నాస్‌పురా ఖాద్రీ, జాహనుమా పీ.వీరమణి, పురానాపూల్ లక్ష్మణ్‌రావు తదితరులు తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు.
మొన్నటి వరకు భర్తల చాటునే..
కొత్తగా బరిలో దిగిన మహిళల్లో చాలా మంది భర్తల చాటు భార్యలే. గృహిణులుగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్న వారే. ప్రస్తుతం ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ప్రజాక్షేత్రంలో దిగి ఓట్ల కోసం తిరుగుతున్నారు. బీజేపీ 149 డివిజన్ల నుంచి అభ్యర్థులను బరిలో దించగా, ఇందులో వందకు పైగా అభ్యర్థులు తొలిసారిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలో గతంలో టికెట్ దొరకడమే గగనమయ్యేది. ఇప్పుడు టికెట్ సులువుగా దొరకడంతో చాలా మంది కొత్తగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ 90 మంది వరకు, టీడీపీ 60 మందికి కొత్తవారికి చాన్స్ ఇచ్చాయి. ఎంఐఎం నుంచి 23 మంది కొత్తగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా సీపీఎం, సీపీఐల నుంచి బరిలో దిగినవారిలో 20 మంది వరకు కొత్తవారున్నారు. మొత్తంగా కాంగ్రెస్, బీజేపీల నుంచే కొత్తవారు ఎక్కువగా పోటీ చేస్తున్నారు.
వలస ఓటర్లపై అభ్యర్థుల గురి..
సైదాబాద్, నవంబర్ 25 (ఆంధ్రజ్యోతి) : గ్రేటర్ ఎన్నికల్లో ప్రతి ఓటూ విలువైనది కావడంతో అభ్యర్థులు ఏ ఒక్క ఆవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలలో నివాసముంటున్న వలస ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థులు చేస్తున్నారు. కుటుంబంలో ఎవరెక్కడ ఉంటున్నారో పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. వారి కుటుంబసభ్యులు, స్నేహితులతో ఫోన్లు చేయిస్తూ ఓటు వేసేందుకు రావాలని కోరుతున్నారు. వీరి ఓట్ల కోసం ప్రత్యేకంగా కొంత మందికి బాధ్యతలు అప్పగించారు.
ఎంత మంది... ఏం కావాలి...
‘మీ స్నేహితులు ఎంత మంది ఉన్నారు. రాత్రి విందుకు ఏం కావాలి. అవతలి పార్టీవాళ్లు ఏం ఇచ్చినా.., అంతకంటే ఎక్కువ చేస్తా. మీ స్నేహితులందరితో పార్టీ అరేంజ్ చేయి. మందు, మటన్, చికెన్‌తో విందు ఇద్దాం’ అంటూ వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు కోరుతున్నారు.
నేరుగా అభ్యర్థులకే ఫోన్లు
కొన్ని చోట్ల ఓటర్లు తమకేం ఇస్తారని నేరుగా అభ్యర్థులకు ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు. ‘మా వద్ద ఇన్ని ఓట్లు ఉన్నాయి... ఎంత ఇస్తారు.. ఎప్పుడు ఇస్తారు’ అని బేరసారాలు చేస్తున్నారు. కొందరు ఒక్కో ఓటుకు రూ. ఐదు వేల చొప్పున డిమాండ్ చేస్తున్నారు.