అనుమతి లేకుంటే.. కొనకండి

ABN , First Publish Date - 2020-08-01T10:23:20+05:30 IST

అనుమతి లేకుండా, నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాల్లో ఫ్లాట్‌లు కొనుగోలు చేయొద్దని గ్రేటర్‌ కమిషనర్‌ డీఎస్‌

అనుమతి లేకుంటే.. కొనకండి

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సూచన 

శేరిలింగంపల్లిలో జోరుగా కూల్చివేతలు

నాలుగు రోజుల్లో 30 భవనాల నేలమట్టం


హైదరాబాద్‌ సిటీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): అనుమతి లేకుండా, నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాల్లో ఫ్లాట్‌లు కొనుగోలు చేయొద్దని గ్రేటర్‌ కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ ప్రజలకు సూచించారు. జీహెచ్‌ఎంసీ అనుమతి పత్రం, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లలో ఏదో ఒకటి పరిశీలించిన అనంతరం కొనుగోలు చేయాలన్నారు. అనుమతి పత్రంలో ఉన్న మేరకే భవనం నిర్మించారా..? అదనపు అంతస్తులు, ఫ్లాట్లు ఉన్నాయా? లేదా అనేది క్షుణ్ణంగా పరిశీలించాలని పేర్కొన్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేని భవనాలకు రెట్టింపు ఆస్తి పన్ను, మూడురెట్ల నీటిబిల్లు పెనాల్టీ ఉంటుందని హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో నిర్మాణ అనుమతులతోపాటు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల వివరాలు ఉంటాయన్నారు. సమీపంలోని సర్కిల్‌ కార్యాలయాలను సంప్రదించి మీరు ఫ్లాట్‌ కొనుగోలు చేయాలనుకుంటున్న భవనానికి అనుమతి ఉందా? మీరు తీసుకునే అంతస్తు వరకు పర్మిషన్‌ ప్లాన్‌ ఉందా..లేదా తెలుసుకోవాలన్నారు.

 

కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌

అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. శేరిలింగంపల్లి సర్కిల్‌లో స్పెషల్‌ డ్రైవ్‌ జోరుగా సాగుతోంది. ఇతర సర్కిళ్లలోనూ కూల్చివేతలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జూలై 27వ తేదీన చేపట్టిన రెండో విడత డ్రైవ్‌లో భాగంగా శేరిలింగంపల్లి సర్కిల్‌లోని పలు ప్రాంతాల్లో 30 భవనాలకు చెందిన 140 శ్లాబ్‌లను కూల్చివేసినట్టు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో జీహెచ్‌ఎంసీ పేర్కొంది. గత నెలలో అయ్యప్ప సొసైటీలోని 29 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఐదారు అంతస్తుల మేర ఉన్న భవనాలను కూల్చి వేసేందుకు ఇటీవల భారీ యంత్రాన్ని వినియోగించారు. భవనాల ఎత్తును బట్టి గ్యాస్‌ కట్టర్లు, కంప్రెషర్లు వాడుతున్నామని అధికారులు చెబుతున్నారు. అనుమతి లేని, తీసుకున్న అనుమతి కంటే అదనపు అంతస్తులు, ఎక్కువ విస్తీర్ణంలో, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలను గుర్తించి కూల్చివేతలు చేపడుతున్నామని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. 


అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్‌ కేసులు

జవహర్‌నగర్‌: ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని కాప్రా తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ హెచ్చరించారు. జవహర్‌నగర్‌ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్‌ 227, 338, 340, 395లలో అక్రమంగా నిర్మించిన ఇల్లు, నాలుగు బేస్‌మెంట్లు, పశువుల షెడ్‌ను రెవెన్యూ అధికారులు తొలగించారు. కూల్చివేతల కార్యక్రమంలో గిర్దావర్‌ రమేష్‌, వీఆర్వో గంగాధర్‌, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  


గండిపేట మండలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత 

నార్సింగ్‌: గండిపేట మండలంలోని నార్సింగ్‌, మణికొండలలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను శుక్రవారం కూడా కొనసాగించారు. గౌలిదొడ్డిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులను కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి పరిశీలించారు. అనుమతి లేని వాటిని కూల్చివేస్తామన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయ కాలనీలోని తిరుమలహిల్స్‌, నెక్నాంపూర్‌లలో అక్రమ నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేశారు.  

Updated Date - 2020-08-01T10:23:20+05:30 IST