జీహెచ్ఎంసీ అలెర్ట్.. నిబంధనలు పాటించకుంటే సీజ్‌!

ABN , First Publish Date - 2020-05-10T14:10:29+05:30 IST

లాక్‌డౌన్‌ ఉల్లంఘనల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నగరంలో నిబంధనలకు

జీహెచ్ఎంసీ అలెర్ట్.. నిబంధనలు పాటించకుంటే సీజ్‌!

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ ఉల్లంఘనల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా జిమ్‌లు, ఇనిస్టిట్యూట్లు, స్టడీ రూమ్‌లు, స్పోర్ట్స్‌ క్లబ్‌లు, ఫిట్‌నెస్‌ స్టూడియోలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు తెరుస్తోన్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అనుమతి ఉన్న దుకాణాలు, సంస్థల వద్ద భౌతికదూరం, మాస్క్‌ ధరించడం తదితర నిబంధనలు పాటించకున్నా సీజ్‌ చేయనున్నారు. సోమవారం నుంచి గ్రేటర్‌వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించనున్నట్టు  ఈవీడీఎం డైరెక్టర్‌  విశ్వజిత్‌ కంపాటి తెలిపారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించి తెరిచిన 140 జిమ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, స్టడీ రూంలు,  ఇనిస్టిట్యూట్లు, స్కూళ్లు, ఫిట్‌నెస్‌ స్టూడియోలను సీజ్‌ చేసినట్టు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 


అలాగే.. ఈవీడీఎంలోని 18 బృందాలు తనిఖీలు నిర్వహించి 28 సంస్థలను సీజ్‌ చేశాయి. భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోకపోవడం, శానిటైజర్‌ ఏర్పాటు చేయకపోవడం, మాస్క్‌లు లేని వారిని అనుమతించిన పది సూపర్‌ మార్కెట్లు కూడా సీజ్‌ చేశారు. సికింద్రాబాద్‌, శేరిలింగంపల్లి, చార్మినార్‌, ఎల్‌బీనగర్‌, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌ తదితర జోన్ల పరిధిలో 140 దుకాణాలు/సంస్థలను సీజ్‌ చేశామని చెప్పారు. ఇందులో జిమ్‌లు, స్టడీ రూంలు, ఫిట్‌నెస్‌ సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి. సడలింపుల నేపథ్యంలో తెరుస్తోన్న సూపర్‌ మార్కెట్లు, కిరాణ, మెడికల్‌ షాపులు, మద్యం దుకాణాలు, హార్డ్‌వేర్‌ తదితర దుకాణాలు కూడా నిబంధనలు పాటించాల్సిదే. లేకుంటే ఎపిడమిక్‌ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఈవీడీఎంకి ఉందని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2020-05-10T14:10:29+05:30 IST