ఎస్‌సీటీపీలకు స్థానికుల నో

ABN , First Publish Date - 2020-12-13T06:18:35+05:30 IST

గ్రేటర్‌లో నిత్యం 6 వేల మెట్రిక్‌ టన్నుల చెత్త

ఎస్‌సీటీపీలకు స్థానికుల నో

చెత్త రవాణా కేంద్రాలకు అభ్యంతరాలు

ప్రత్యామ్నాయాలపై జీహెచ్‌ఎంసీ దృష్టి

15 చోట్ల ఏర్పాటుకు శ్రీకారం

ఐదు ప్రాంతాల్లో పూర్తి

గ్రేటర్‌లో 90 ఏర్పాటు చేయాలని లక్ష్యం

పారిశుధ్య నిర్వహణ మెరుగుపర్చేందుకే


నిత్యం ఇంటింటి చెత్త సేకరణ.. మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం ప్రతిపాదించిన సెకండరీ కలెక్షన్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ పాయింట్స్‌ (ఎస్‌సీటీపీ) ఏర్పాటుకు క్షేత్రస్థాయిలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. నివాసాల మధ్య చెత్త తరలింపు కేంద్రాల ఏర్పాటుపై పలు ప్రాంతాల్లో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్వచ్ఛ ట్రాలీల ద్వారా చెత్త సేకరణ మెరుగుపర్చాలన్న ఆలోచనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. 


హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి) : గ్రేటర్‌లో నిత్యం 6 వేల మెట్రిక్‌ టన్నుల చెత్త వెలువడుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మెజార్టీ ప్రాంతాల్లో 3 వేల వరకు ఉన్న స్వచ్ఛ ట్రాలీల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ జరుగుతోంది. పలు ప్రాంతాల్లో రిక్షాల ద్వారా చెత్త సేకరిస్తున్నారు. ట్రాలీల డ్రైవర్లు తమకు కేటాయించిన పరిధిలోని ప్రాంతంలో రోజూ చెత్త సేకరించాలి. కానీ రెండు, మూడు రోజులకోమారు చెత్త సేకరణ జరుగుతోంది. ఇందువల్ల పలు ప్రాంతాల్లో పౌరులు చెత్తను రోడ్లపై వేస్తున్నారు. ఇది వల్నరబుల్‌ గార్బెజ్‌ పాయింట్లు(వీజీపీ) తొలగించాలన్న స్వచ్ఛ లక్ష్యానికి ప్రతిబంధకంగా మారుతోంది. ఇంటికి రెండు చెత్త డబ్బాలు ఇచ్చినా.. ట్రాలీలు ఏర్పాటు చేసినా.. రహదారుల పక్కన చాలా ప్రాంతాల్లో ఎప్పటిలానే చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్తను ట్రాలీల డ్రైవర్లు ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లలో వేస్తున్నారు. గ్రేటర్‌లో ప్రస్తుతం 17 ప్రాంతాల్లోనే ట్రాన్స్‌ ఫర్‌ స్టేషన్లున్నాయి. నిత్యం ఒక్కో ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌కు వందల సంఖ్యలో ట్రాలీలు వస్తుండడంతో ఖాళీ చేసేందుకు రెండు, మూడు గంటలు వేచి చూడాల్సి వస్తోంది. అందుకే నిత్యం రెండు ట్రిప్పుల కంటే ఎక్కువ చెత్త సేకరణ చేయలేకపోతున్నామని డ్రైవర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో 90 సెకండరీ కలెక్షన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా ప్రస్తుతం కంటే ట్రాలీలు ఎక్కువ ట్రిప్పులు తిరిగి.. మెరుగైన చెత్త సేకరణకు వీలవుతుందన్నది అధికారుల యోచన. 


ఆటోమేటెడ్‌... 

ఎస్‌సీటీపీల ఏర్పాటుకు గ్రేటర్‌లో స్థలాల గుర్తింపును జీహెచ్‌ఎంసీ మొదలు పెట్టింది. ఐదు కేంద్రాలు అందుబాటులోకి రాగా.. మరో 10 చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. గత నెలలో పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు సంజీవయ్య పార్కు సమీపంలో ఏర్పాటు చేసిన ఎస్‌టీఎస్‌ను ప్రారంభించారు. స్వచ్ఛ ట్రాలీలు తీసుకొచ్చే చెత్తను ఎస్‌సీటీపీల్లో డంప్‌ చేస్తారు. అధునాతన పరిజ్ఞానంతో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాల్లో చెత్త ఆటోమేటిక్‌గా కంటెయినర్లో కంప్రెస్‌ అవుతుంది. ఆ కంటెయినర్‌ను ట్రక్కులు నేరుగా జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు తీసుకెళ్తాయి.  ఈ తరహా 51 వాహనాలను కొన్నాళ్ల క్రితం అందుబాటులోకి తీసుకువచ్చారు. ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల సంఖ్య పెంచడం ద్వారా ట్రాలీలు ఎక్కువ సేపు వేచి చూడాల్సిన అవసరం ఉండదని, తద్వారా ఇంటింటి చెత్త సేకరణ మెరుగవుతుందని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. 


మా ఏరియాలో వద్దు.. 

గ్రేటర్‌లోని 30 సర్కిళ్లలో ఒక్కో సర్కిల్‌కు మూడు చొప్పున ఎస్‌సీటీపీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌, సికింద్రాబాద్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌ తదితర సర్కిళ్లలో చెత్త రవాణా కేంద్రాల ఏర్పాటు ఇబ్బందికరంగా మారుతోంది. ఆయా ప్రాంతాల్లో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోర్‌ ఏరియాలోని మెజార్టీ సర్కిళ్లలో స్థలం అందుబాటులో లేకపోగా.. ఉన్న చోట ఏర్పాటు వివాదస్పదంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. నగరంలో కొన్నేళ్లుగా డంపర్‌ బిన్లు, చెత్త రవాణా కేంద్రాల ఏర్పాటును స్థానికులు వ్యతిరేకించడం సాధారణమై పోయింది. అధునాతన పరిజ్ఞానం, ఆటోమేటేడ్‌ విధానంలో పనిచేసే ఈ కేంద్రాల్లో దుర్వాసన రాకుండా శాస్ర్తీయపరమైన ఏర్పాట్లు చేశామని చెబుతోన్న అధికారులు.. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామంటున్నారు. 

Updated Date - 2020-12-13T06:18:35+05:30 IST