వెంటాడిన వాన... చుట్టుముట్టిన సమస్యలు.. పొంచి ఉన్న ప్రమాదాలు
ABN , First Publish Date - 2020-08-18T19:02:36+05:30 IST
బస్తీల ప్రజలు వాన సమస్యలతో కుస్తీ పట్టాల్సి వస్తోంది. సోమవారం వాన కాస్త తెరిపినిచ్చినప్పటికీ...అయిదు రోజులు వెంటాడిన వర్షం తెచ్చిపెట్టిన కష్టాల ఎఫెక్ట్ ఇప్పట్లో పోయేలా లేదు. ఎప్పుడూ ఇంతే...! ప్రతి వాన వెన్నంటి కష్టాల వరద ముంచెత్తుతోంది.
ప్రవహించే దారి లేక...రోడ్లపై నిలిచిన నీరు...అటునుంచి ఇళ్లలోకి...
దోమలు, ఈగల దాడి...అసలే కరోనా రోజులు...
ఆపై ‘వానాకాలం వ్యాధుల’ భయం
బంజారాహిల్స్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): బస్తీల ప్రజలు వాన సమస్యలతో కుస్తీ పట్టాల్సి వస్తోంది. సోమవారం వాన కాస్త తెరిపినిచ్చినప్పటికీ...అయిదు రోజులు వెంటాడిన వర్షం తెచ్చిపెట్టిన కష్టాల ఎఫెక్ట్ ఇప్పట్లో పోయేలా లేదు. ఎప్పుడూ ఇంతే...! ప్రతి వాన వెన్నంటి కష్టాల వరద ముంచెత్తుతోంది. లక్షలాది ప్రజానీకం నివసించే ఈ బస్తీ ప్రజలు తమను ఈ కష్టాల నుంచి గట్టెక్కించే వారెవరా అని ఎదురుచూస్తున్నారు. లీడర్లు, ఆఫీసర్లు...తమ సమస్యలను ప్రస్తుతం...తాత్కాలికంగా...ఆ తర్వాత శాశ్వతంగా పరిష్కరించే ప్రణాళిక రూపొందించాలని దేవుళ్లను వేడుకుంటున్నారు.
ఫిలింనగర్ బసవతారకనగర్‌లో నాలా వెంబడి ఉన్న కొన్ని ఇళ్లల్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు రావడంతో ముంపునకు గురయ్యాయి. వీధులన్నీ బురదతో నిండి అస్తవ్యస్తంగా తయారయ్యాయి. మహాత్మాగాంధీనగర్ బస్తీల్లో డ్రైనేజీ పొంగి మురుగు నీరు రోడ్లను ముంచెత్తుతోంది. ఫిలింనగర్‌లో 18 బస్తీలు కొండచరియలను తొలగించి ఏర్పాటు చేసినవే. ఇక్కడ ఏళ్ల క్రితం కట్టిన నిర్మాణాలు అనేకం ఉన్నాయి. అవి ఎప్పుడు పడిపోతాయో అనే ఆందోళన నెలకొంది. శనివారం అర్ధరాత్రి ఓ ఇల్లు పూర్తి గా కూలిపోయింది. పటేల్‌నగర్‌లో ప్రమాదకరంగా ఉన్న నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ అధికారులు వారం క్రితం కూల్చివేశారు. బంజారాహిల్స్ లోటస్ పాండ్ వద్ద వరద నీరు భారీగా వచ్చి చేరింది. పార్కులో ఉన్న చెరువులోకి భారీగా నీరు చేరుతోంది.
శేరిలింగంపల్లి జోన్ బృందం: మియాపూర్ ప్రాంతంలోని ప్రశాంత్‌నగర్-దీప్తిశ్రీనగర్ ఎంఏనగర్ మీదుగా వెళ్లే రహదారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇక్కడి నాలాను కొందరు మట్టి పోసి పూడ్చివేయడంతో అంతర్గత రహదారులు, ఇళ్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. నీరు బయటకు పంపే మార్గం లేకపోవడంతో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దీప్తిశ్రీనగర్‌లో ఇటీవల వేసిన రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయి భారీగుంత ఏర్పడింది. ఎంఏనగర్, న్యూకాలనీ, మక్తా, హెచ్‌ఎంటీ స్వర్ణపురి, జేపీఎన్‌నగర్ తదితర ప్రాంతాల్లోని అంతర్గత రహదారుల్లో చెత్త నిల్వలు రోడ్ల పక్కన పేరుకుపోతున్నాయి. టేకు నర్సింహనగర్, పాతమియాపూర్ ప్రాంతా ల్లో న్యూహఫీజ్‌పేట, ఆదిత్యనగర్‌లో పారిశుధ్యం అధ్వానంగా మారింది. హఫీజ్‌పేట నుంచి కొండాపూర్, కొత్తగూడ ప్రధానరహదారి అధ్వానంగా మారింది.
మ్యాన్‌హోల్ ఓపెన్ చేసి...
మాదాపూర్, హైటెక్‌సిటీలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుట్టలబేగంపేట, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, చంద్రనాయక్‌తండా, కాకతీయ హిల్స్, నిసైట్ కో ఆపరేటివ్ సొసైటీ వంటి కాలనీల్లో వర్షపు నీరు మోకాళ్ల లోతు వరకు చేరింది. గుట్టల బేగంపేటలోని అమర్ కోఆపరేటివ్ సొసైటీలో పలు అపార్ట్‌మెంట్‌లలోకి వర్షపునీరు చేరడంతో మూడు రోజులు గా నివాసితులు నరకయాతన పడుతున్నారు. ఇక్కడ జీహెచ్‌ఎంసీ సిబ్బంది మ్యాన్‌హోల్స్ ఓపెన్ చేసి తమ పని అయిపోయిందని చేతులు దులుపుకున్నారు. గచ్చిబౌలిలో నూతన ఫ్లైఓవర్ ప్రారంభం సందర్భంగా రెండు నెలల క్రితమే వేసి న బీటీరోడ్డు వర్షాలకు కొట్టుకుపోయి గుంతలమయంగా మారింది. కొత్తగూడ, కొండాపూర్, బొటానికల్ గార్డెన్, ఐకియా స్టోర్ ప్రాంతాల్లో వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయాయి.
కునుకులేని కూకట్‌పల్లి..
కూకట్‌పల్లి, బాగ్‌అమీర్, ప్రకా్‌షనగర్, రాఘవేంద్ర సొసైటీ బస్తీ ల్లో పరిస్థితి దయనీయంగా మారింది. రోడ్లపై భారీగా వర్షపునీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది.
అల్లాపూర్: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీలలో రోడ్లు జలమయమయ్యాయి. సఫ్దర్‌నగర్, యూసు్‌ఫనగర్‌లలో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
కనిపించని అధికారులు
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో బస్తీలు, కాలనీల్లో చెత్త పేరుకుపోయింది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నా, ఎక్కడా కనిపించడం లేదు. సుభా్‌షనగర్, చింతల్, జగద్గిరిగుట్ట డివిజన్‌లలో రోడ్లు, నాలా లు, డ్రైనేజీల పరిస్థితి దారుణంగా ఉంది. సుభా్‌షనగర్ డివిజన్ రామిరెడ్డినగర్‌లో మురికినీరు పారుతోంది.
చిత్తడిగా బస్తీలు..
కృష్ణానగర్: బోరబండ, రహ్మత్‌నగర్ డివిజన్లలోని పలు బస్తీల్లో అంతర్గత రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. మ్యాన్‌హోళ్లు పొంగి బస్తీల్లోకి మురికినీరు వస్తోంది. రహ్మత్‌నగర్ డివిజన్‌లో హబీబా ఫాతిమానగర్‌లో మ్యాన్‌హోల్ నుంచి తీసిన సిల్ట్‌ను రోడ్ల మధ్య అలాగే వదిలేశారు.
పొంగుతున్న డ్రైనేజీలు
బేగంపేట ప్రాంతంలోని బస్తీల్లో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ఓల్డ్ కస్టమ్స్ బస్తీ, మాతాజీనగర్, శ్యామ్‌లాల్ బిల్డింగ్, పోచమ్మబస్తీ, పాటిగడ్డ, ప్రకాశ్‌నగర్ ఎక్స్‌టెంక్షన్, అల్లం తోటబాయి ప్రాంతాల్లో చెత్త తొలగించలేదు. ప్రకాశ్‌నగర్, ప్రకాశ్‌నగర్ ఎక్స్‌టెంక్షన్ ప్రాంతాల్లోని రహదారుల్లో మురుగునీరు పొంగి ప్రవహిస్తోంది. పాటిగడ్డ ప్రభుత్వ క్వార్టర్స్‌లోని వల్లభనగర్ సబ్‌రిజిస్ర్టార్‌కు వెళ్లే రహదారిలో రోడ్డుపైనే చెత్త పేరుకుపోయి అపరిశుభ్రంగా మారింది.
యూసఫ్‌గూడ డివిజన్‌లో మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లుతూ రోడ్లపై మురికినీరు ప్రవహిస్తోంది. బస్తీలు అపరిశుభ్రంగా మారాయి. ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. లంగర్‌హౌజ్, టోలిచౌకి ప్రాంతాల్లో పెద్దఎత్తున మురుగునీరు చేరడంతో దోమలు విజృంభిస్తున్నాయి.
రాజేంద్రనగర్/చార్మినార్/హసన్‌నగర్: వర్షం కురిసినప్పుడల్లా చాంద్రాయణగుట్ట బ్రిడ్జి వద్ద నీరు నిలిచి రాకపోకలు స్తంభించి పోతున్నాయి. ఓవైసీ ఆస్పత్రి నుంచి రాజేంద్రనగర్ వైపు వెళ్లే మార్గంలో ఈ బిడ్రి వద్ద నీరు నిలిచి చెరువులా మారింది. ఛత్రినాక ప్రాంతంలో వర్షపు నీటితో పాటు డ్రైనేజీ నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాతబస్తీలోని గాంధీనగర్ నుంచి రాజన్న బా వి రెడ్డి జన సంఘం వరకు ఉన్న ఓపెన్ నాలాకు ఫెన్సింగ్ లేకపోవడం, నాలాలో చెత్తా చెదారం వేయడం తో అవి పేరుకుపోయి వర్షపు నీరు నాలాపై నుంచి పా రుతోంది. దీంతో శివాజీనగర్, శివగంగానగర్, ఛత్రినాక వరకు రాకపోకలు స్తంభించిపోతున్నాయి. బండ్లగూడలోని రోడ్లన్నీ వర్షం వచ్చినప్పుడు నీటితో నిండి కనిపిస్తుంటాయి. రాజేంద్రనగర్ సర్కిల్‌లోని 191 పిల్లర్ వద్ద వర్షం వచ్చినప్పుడల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారిలో నీరు నిలుస్తోంది. ఆరాంఘర్ చౌరస్తా నుంచి బహదూర్‌పురా వెళ్లే మార్గంలో, మీరాలం చెరువు ప్రాంతంలో నీరు రోడ్డుపైనే పారుతోంది.
రోడ్లపై వర్షపు నీరు, చెత్త..
సీతాఫల్‌మండి, బౌద్ధనగర్ డివిజన్లలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై చెత్తతో పాటు మురికినీరు నిలిచి ఉంది బౌద్ధనగర్ డివిజన్ న్యూ అశోక్‌నగర్, పుల్లయ్యబావి, ఎల్.నారాయణ నగర్, అంబర్‌నగర్, అంబానగర్ ప్రాంతాల్లో మూడు రోజుల నుంచి పారిశుధ్య పనులు సవ్యంగా జరగడం లేదు. పార్శీగుట్ట, న్యూ అశోక్‌నగర్, అంబానగర్ ప్రాంతాల్లో రెండురోజులకు ఒకసారి వచ్చే మంచినీరు సవ్యంగా వస్తున్నా, అప్పుడప్పుడు కొద్దిసేపు కలుషితనీరు వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
భయం గుప్పిట్లో బస్తీలు..
ముషీరాబాద్, అంబర్‌పేట జోన్ బృందం : ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల్లోని లోతట్టు ప్రాంతాల్లో కచ్చా నాలాల నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తమ ఇళ్లల్లోకి వస్తాయేమోనని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ముషీరాబాద్‌లోని అంబేడ్కర్‌నగర్, వినోభానగర్, పార్సిగుట్ట, బాప్టి్‌స్టచర్చి వీధి, కవాడిగూడలోని కోదండరెడ్డినగర్, సూరజ్‌నగర్, భోలక్‌ఫూర్‌లోని అంబేడ్కర్‌నగర్ ప్రాంతాల ప్రజలు ఎడతెరిపిలేని వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. దయార కమాన్, పటాన్‌బస్తీ, రాజా డీలక్స్ చౌరస్తా వద్ద మురుగునీరు పారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అంబర్‌పేట నియోజకవర్గం నల్లకుంటలోని వెంకటేశ్వరనగర్, భాగ్యనగర్, గోల్నాకలోని శాంతినగర్, గంగానగర్, కాచిగూడలోని ఖాజాగరీబ్‌నగర్, శాస్త్రీనగర్, అంబర్‌పేటలోని అంబేడ్కర్‌నగర్, దుర్గానగర్ తదితర ప్రాంతాల ప్రజలు వర్షాలతో ఇక్కట్లకు గురవుతున్నారు.