నాగోల్ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు..
ABN , First Publish Date - 2020-05-18T09:21:05+05:30 IST
దిల్‌సుఖ్‌నగర్, నాగోల్ పరిసర ప్రాంతాల్లో ఉంటూ బోరు వాహనాలపై పనిచేసే కూలీలు వారి స్వరాష్ట్రం ఛత్తీ్‌సగఢ్‌కు బయలు దేరారు.

హయత్‌నగర్, మే 17 (ఆంధ్రజ్యోతి): దిల్‌సుఖ్‌నగర్, నాగోల్ పరిసర ప్రాంతాల్లో ఉంటూ బోరు వాహనాలపై పనిచేసే కూలీలు వారి స్వరాష్ట్రం ఛత్తీ్‌సగఢ్‌కు బయలు దేరారు. వీరితోపాటు ఇతర కంపెనీల్లో పనిచేసే వారు కూడా జాతీయరహదారిపై కాలినడకన వెళ్తూ కనిపించారు. వీరిని ‘ఆంధ్రజ్యోతి’ పలకరించగా.. పలు విషయాలు చెప్పారు. ఇక్కడ పనులు లేకపోవడం, కుటుంబ సభ్యులు గ్రామానికి రావాలని ఫోన్లో ఒత్తిడి చేస్తున్నారని పలువురు తెలిపారు. నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఆహారంతో కడుపు నింపుకుంటూ రోజుకు 30 నుంచి 50 కిలోమీటర్లు నడుస్తున్నామని చెప్పారు.
మల్కాజిగిరి నుంచి 73 మంది
మల్కాజిగిరి, మే 17 (ఆంధ్రజ్యోతి): ఆదివారం మల్కాజిగిరి నుంచి 73 మంది వలస కార్మికులను పోలీసులు వారివారి స్వరాష్ట్రాలకు పంపారు. కార్మికులకు ఫోన్‌ల ద్వారా సమాచారం అందించి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అక్కడి నుంచి బస్సుల్లో రైల్వే స్టేషన్లకు తరలించారు. సుమారు 65 మంది కార్మికులు బిహార్, 8 మంది ఛత్తీస్‌గఢ్ వెళ్లారు.
సొంతూరు చూడాలని..నిత్యపల్లి లక్ష్మణ్, ఒడిశా
లాక్‌డౌన్‌తో ఉపాధి కరువైంది. కొందరు నిర్మాణ దారులు తిండి గింజలు కూడా ఇవ్వలేదు. దాతలు ఇచ్చిన ఆహార ప్యాకెట్లు, బియ్యంతో గడపాల్సి వచ్చింది. ఊళ్లో భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎలా ఉన్నారనే బాధ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రైల్లో ఎప్పుడు తీసుకెళ్తారనే విషయం పోలీసులు, అధికారులు చెప్పడం లేదు. ప్రాణం ఉండగానే సొంతూరు చూడాలని కాలినడకన వెళ్తున్నాం.
కరోనా భయంతో.. షకీల్, యూపీ
రెండు నెలలుగా దొరికిన ఆహారం తిని కడుపు మాడ్చుకొని బతికాం. సొంతూరు, కన్నవారు గుర్తుకు వచ్చినప్పుడల్లా నిద్రపట్టడం లేదు. కరోనాతో చనిపోతే కనీసం ఇంటికి మృతదేహాన్ని కూడా పంపరని విన్నాం. నగరంలో పెరుగుతున్న కరోనా కేసులు చూస్తే ప్రాణం ఎప్పుడు పోతుందోనని భయమేస్తోంది. అందుకే సొంతూరుకు వెళ్తున్నా.