బేగంపేట మెట్రో నుంచి ఎక్బాల్‌ మినార్‌ వరకు..

ABN , First Publish Date - 2020-09-06T09:37:15+05:30 IST

స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌లో భాగంగా సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.

బేగంపేట మెట్రో నుంచి ఎక్బాల్‌ మినార్‌ వరకు..

 


సైకిల్‌ ట్రాక్‌ డిసెంబర్‌లోపు రెడీ..  పరిశీలించిన అధికారులు 


ఖైరతాబాద్‌, సెప్టెంబర్‌ 5 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌లో భాగంగా సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. జీహెచ్‌ఎంసీలో పైలెట్‌ ప్రాజెక్టుగా బేగంపేట మెట్రోస్టేషన్‌ నుంచి సైఫాబాద్‌ ఎక్బాల్‌ మినార్‌ వరకు 12.3 కిలోమీటర్ల మేర(వన్‌ వే) సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు శనివారం జీహెచ్‌ఎంసీ, ఉమ్టా, ట్రాఫిక్‌ పోలీసుల బృందం ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య ఆధ్వర్యంలో ఈ రహదారిని పరిశీలించింది. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి ఫేజ్‌ వన్‌లో డిసెంబర్‌ వరకు మొదటి ట్రాక్‌ సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జోనల్‌ కమిషనర్‌  ప్రావీణ ్య తెలిపారు.  


 జోన్‌లో ఎనిమిది రహదారులు..

ఖైరతాబాద్‌ జోన్‌లో మొత్తం ఎనిమిది రహదారులను సైకిల్‌ ట్రాక్‌లుగా మార్చాలని నిర్ణయించారు. అమీర్‌పేట స్వర్ణజయంతి కాంప్లెక్స్‌ నుంచి ఖైరతాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయం వరకు 4.5 కిలోమీటర్లు, మూడు కిలోమీటర్ల పొడవున రాజ్‌భవన్‌ రహదారి, 3.5 కిలోమీటర్ల పొడవుగల బంజారాహిల్స్‌ తాజ్‌కృష్ణా చౌరస్తా నుంచి లక్డీకాపూల్‌ చౌరస్తా వరకు, కేబీఆర్‌ పార్కు చుట్టూ, నెక్లెస్‌ రోడ్డు పూర్తిగా.. ఇలా మరిన్ని  ప్రాంతాల్లో సైకిల్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ కార్యాలయాలు, మెట్రో రైల్వేస్టేషన్లను కలుపుతూ ఉద్యోగులకు, ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా వీటిని ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.


జీహెచ్‌ఎంసీ సైకిళ్లు, ట్రాక్‌ల వినియోగం, ప్రజల్లో చైతన్యం కల్పించడంలో ఎన్‌జీవో, హైదరాబాద్‌ బైసైక్లింగ్‌ క్లబ్‌ సహకారం తీసుకోనుంది. ఈ ఎనిమిది ట్రాక్‌లలో కొన్నింటిని కలిపి పైలెట్‌ ప్రాజెక్ట్‌ రూట్‌ను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా రహదారికి ఇరువైపులా ఉన్న కొన్ని నివాస ప్రాంతాల్లో కూడా సైకిల్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. కుందన్‌బాగ్‌, భానుమతి రోడ్‌, అమీర్‌పేట్‌, గ్రీన్‌లాండ్స్‌, రాజ్‌ భవన్‌ క్వార్టర్స్‌, ఎన్‌టీఆర్‌ మార్గం పక్కనున్న ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. 

Updated Date - 2020-09-06T09:37:15+05:30 IST