నాడు మంచినీటి చెరువు..నేడు మురుగుమయం

ABN , First Publish Date - 2020-09-05T08:02:43+05:30 IST

హిమాయత్‌సాగర్‌, గండిపేట్‌ చెరువుల నిర్మాణానికి ముందు రాజేంద్రనగర్‌ సర్కిల్‌ తాడ్‌బన్‌ వద్ద గల మీరాలం చెరువే

నాడు మంచినీటి చెరువు..నేడు మురుగుమయం

 దీనావస్థలో మీరాలం చెరువు

 గుర్రపుడెక్క, దోమలకు ఆవాసంగా మారిన వైనం

 అధికారుల సమన్వయలోపమే కారణం..


హసన్‌నగర్‌, సెప్టెంబర్‌ 4 (ఆంధ్రజ్యోతి): హిమాయత్‌సాగర్‌, గండిపేట్‌ చెరువుల నిర్మాణానికి ముందు రాజేంద్రనగర్‌ సర్కిల్‌ తాడ్‌బన్‌ వద్ద గల  మీరాలం చెరువే మంచినీటి చెరువు. అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా పనిచేసిన మీరాలం బహదూర్‌ హయాంలో 1804 జూలై 20న ఈ చెరువు నిర్మాణానికి భూమిపూజ చేసి రెండేళ్ల అనంతరం 1806 జూన్‌లో పూర్తి చేశారు. చెరువు డ్యామ్‌ అర్ధ చంద్రాకారంలో కనిపించేలా 21 ఆర్చ్‌లతో నిర్మించారు.  జూపార్కు ఎలిఫెంట్‌ సఫారీ నుంచి చూస్తే నేటికీ మీరాలం డ్యామ్‌ అదే ఆకారంలో చూడముచ్చటగా ఉంటుంది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఈ చెరువు నిర్మాణం చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు. సుమారు 600 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు కొంతమేర కబ్జాకు గురి కాగా ప్రస్తుతం ఉన్నది కూడా గుర్రపుడెక్కతో నిండిపోయి దోమలకు నిలయంగా మారింది. 


ఆయా శాఖల నిర్లక్ష్యంతో...

పాలకుల నిర్లక్ష్యం, శాఖల మద్య సమన్వయ లోపం కారణంగా మంచినీటి చెరువు నేడు మురుగునీటితో నిండిపోయింది. దోమలకు ఆవాసంగా మారింది. చెరువు చుట్టురా ఉన్న హసన్‌నగర్‌, సులేమాన్‌నగర్‌, ఎం.ఎం. పహాడి, నౌనెంబర్‌ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. చెరువులో చేపలకు కూడా గుర్రపు డెక్క శాపంగా మారింది. చెరువు పరిసర బస్తీల్లో దోమల నిర్మూలనకు గ్రేటర్‌ ఎంటమాలజీ విభాగం మందును స్ర్పే చేస్తున్నప్పటికీ దోమల ప్రభావం పెద్దగా తగ్గడం లేదు. 


సమన్వయంతో పనిచేస్తే...

మీరాలం చెరువు అభివృద్ధి కావాలన్నా, గుర్రపు డెక్కను తొలగించాలన్నా, వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరం. చెరువులోని నీటి నిర్వహణ మెట్రో వాటర్‌వర్క్స్‌ అధికారులు చూస్తుండగా, చెరువు అభివృద్ధిని గ్రేటర్‌ హైదరాబాద్‌ పర్యవేక్షిస్తోంది. అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి అభివృద్ధి చేస్తే రాబోయే రోజుల్లో మీరాలం చెరువుకు పూర్వవైభవం తీసుకురావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సమీప బస్తీల నుంచి వస్తున్న మురుగునీటిని పైపులైన్‌ల ద్వారా మూసీలోకి మళ్లించే ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. 


పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి

మీరాలం చెరువులో నిండిపోయిన గుర్రపు డెక్కను తొలగించాలి. అప్పుడే దోమల వృద్ధికి అడ్డుకట్ట వేయవచ్చు. ఫలితంగా బస్తీలలో నివసించే ప్రజలను  అనారోగ్యం నుంచి కాపాడొచ్చు. గతంలో ఈ చెరువులో బోటు షికారు చేసే అవకాశం ఉండేది. తిరిగి ఆ సౌకర్యాన్ని కల్పించేలా అధికారులు మార్పులు చేస్తే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని స్థానికులు సూచిస్తున్నారు.

Updated Date - 2020-09-05T08:02:43+05:30 IST