మునిసిపాలిటీల్లో మంచి నీటి ఎద్దడి
ABN , First Publish Date - 2020-09-14T09:31:04+05:30 IST
మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాల్లోని ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తోంది ప్రభుత్వం.
గ్రామాల్లో ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు
గ్రేటర్ పక్కనే ఉన్నా వాటికి తాగునీరు కరువు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాల్లోని ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తోంది ప్రభుత్వం. ఈ పథకానికి దేశంలోనే మంచి పేరు వచ్చింది. రాజధాని అయిన గ్రేటర్ హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న శివారు మునిసిపాలిటీల్లో మాత్రం సురక్షిత మంచినీటి సరఫరా అనేది మాటలకే పరిమితమైంది. ఏడాది క్రితం 7 కార్పొరేషన్‌లు, 7 మునిసిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలన్న లక్ష్యంతోనే వీటిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కానీ ఏడాది గడిచినా లక్ష్యం నెరవేరడం లేదు. రోడ్లు, మంచినీరు, విద్యుత్ సరఫరా, పారిశుధ్యం వంటివి అందని ద్రాక్షగా మారాయి. మంచినీటి సరఫరా ఇప్పటికీ సరిగా లేదు.
కొనుగోలు చేయాల్సిందే
ఇప్పటికీ శివారు ప్రాంతాల్లో బోరుబావుల నీటినే ఎక్కువగా వినియోగిస్తున్నారు. కొందరు నీటి క్యాన్‌లను నిత్యం కొనుగోలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బోర్‌వెల్‌లలో నీరు లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా కొంటున్న వారూ ఉన్నారు. బండ్లగూడజాగీర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 700 - 1100 అడుగుల (ఫీట్లు) వరకు బోర్‌వెల్ తవ్వితే కానీ నీళ్లు రావడం లేదు. ఇందుకోసం ఒక్కో ఇంటి యజమాని రూ.1.5లక్షల నుంచి రూ.2.5లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత చేస్తున్నా అవి వాడుకోవడానికి తప్ప, తాగడానికి పనిచేయడం లేదని వాపోతున్నారు. దీంతో రోజూ 20 లీటర్ల క్యాన్ కోసం రూ.20-30 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఔటర్ లోపల రూ.736 కోట్లు....
ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న 183 గ్రామాలు, మిగతా మునిసిపాలిటీలకు వాటర్ బోర్డు ద్వారా సురక్షిత మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం రూ.736 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఇందుకోసం ఔటర్ చుట్టూ రింగు మెయిన్ పైపులైనును నిర్మించింది. కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తీసుకువచ్చి జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రాంతాలకు, శివారు ప్రాంతాలకు తాగునీటి అందించాల్సి ఉంది. వందల కోట్లు ఖర్చు చేసినా శివారు మునిసిపాలిటీల్లో తాగునీటి సరఫరా ఇంకా మెరుగుపడలేదు. రోజు విడిచి రోజు సరఫరా చేసి ఒక్కో మనిషికి 125 లీటర్ల నీటిని అందేలా చూడాల్సిన బాధ్యత వాటర్ బోర్డుపై ఉంది. క్షేత్ర స్థాయిలో మాత్రం నీటిసరఫరా అధ్వానంగా ఉంది.
జనరల్ మేనేజర్ (జీఎం) స్థాయి నుంచి డివిజినల్ జనరల్ మేనేజర్(డీజీఎం), ప్రాంతాల వారీగా ఉండే మేనేజర్లు స్థానిక ప్రజల అవసరాలను ఏమాత్రం గుర్తించకుండా ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి పైపులైనులు వేస్తూ నీటిని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. భారీ అపార్టుమెంటు ప్రాజెక్టులు, గేటెడ్ కమ్యూనిటీలకు ఇచ్చిన ప్రాధాన్యం కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీలకు ఇవ్వడం లేదు. ఐటీ కారిడార్‌ను అనుకొని ఉన్న మణికొండ, నార్సింగి మునిసిపాలిటీలు, నిజాంపేట, బండ్లజాగీర్ మునిసిపాలిటీ, బడంగ్‌పేట, మీర్‌పేట కార్పొరేషన్లలోనూ మంచినీటి సరఫరా సరిగా లేదు. మూడు రోజులకోసారి రావడంతో పాటు గంటకంటే తక్కువ సమయం మాత్రమే నీటిని అందిస్తున్నారు. బిల్లులు సక్రమంగా చెల్లిస్తున్నా మంచినీటి సరఫరా సరిగా చేయడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలతో నదులు, రిజర్వాయర్లలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలోనూ గ్రేటర్ మునిసిపాలిటీల్లో మంచినీటి సరఫరా ఎందుకు పూర్తి స్థాయిలో లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.