జంట జలాశయాలకు కొత్తనీరు

ABN , First Publish Date - 2020-09-18T09:19:44+05:30 IST

నగరంలో వర్షాలు పడుతున్నా అన్ని చెరువులు, జలాశయాలు నిండిపోయినా జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్‌సాగర్‌లకు ఇప్పుడే నీటి ప్రవాహం మొదలైంది

జంట జలాశయాలకు కొత్తనీరు

నార్సింగ్‌, సెప్టెంబర్‌ 17 (ఆంధ్రజ్యోతి) : నగరంలో వర్షాలు పడుతున్నా అన్ని చెరువులు, జలాశయాలు నిండిపోయినా జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్‌సాగర్‌లకు ఇప్పుడే నీటి ప్రవాహం మొదలైంది. ఈసీ, మూసీ నదులు ఉధృతంగా ప్రవహించడంతో జంట జలాశయాలకు కొత్తగా నీరు వచ్చి చేరుతోంది. మూసీ నదిలో వికారాబాద్‌, శంకర్‌పల్లి, పొద్దుటూరు మీదుగా గండిపేటకు రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. హిమాయత్‌సాగర్‌ జలాశయం పైభాగంలో గల ఈసీ నదిలో నాలుగు అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. వికారాబాద్‌ నుంచి షాబాద్‌, మొయినాబాద్‌, వెంకటాపూర్‌, అమడాపూర్‌ మీదుగా ఈసీ నదిలో వరదనీరు ప్రవహిస్తోంది. ఈ నదులను జలమండలి అధికారులు పరిశీలించారు. పొద్దుటూరు వద్ద మూసీ నది రెండు అడుగుల మేర ప్రవహిస్తోందని జలమండలి టేబుల్‌ను అక్కడ ఏర్పాటు చేశామని గండిపేట జలాశయం ఏజీఎం వెంకటరావు తెలిపారు. గండిపేట జలాశయం ఫుల్‌ట్యాంక్‌ లెవెల్‌ 1,790 అడుగులు కాగా, గురువారం సాయంత్రానికి 1,762 అడుగులు ఉందని, శుక్రవారం ఉదయం వరకు మరో రెండు అడుగులు పెరుగుతుందని ఆయన తెలిపారు. హిమాయత్‌సాగర్‌లో గురువారం సాయంత్రానికి 1,745.75 అడుగుల నీరు వచ్చిందని, శుక్రవారం మరింత పెరిగే అవకాశముందని జలమండలి హిమాయత్‌సాగర్‌ అధికారిణి రేణుకరాజు తెలిపారు. 


విరిగిపడ్డ కొండ చరియలు

రాజేంద్రనగర్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండ చరియలు విరిగి ఔటర్‌ రింగ్‌ రోడ్డు సర్వీసు రోడ్డులో పడిపోయాయి. గురువారం సాయంత్రం రాజేంద్రనగర్‌ ఎగ్జిట్‌-16 సమీపంలో కొండ చరియలు విరిగి సర్వీసు రోడ్డులో అడ్డుగా పడ్డాయి. ఆ సమయంలో వాహనాలూ రాకపోవడంతో ప్రమాదం తప్పింది. బండరాళ్లను తొలగించేందుకు హెచ్‌ఎండీఏ-హెచ్‌జీసీఎల్‌  అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లించారు. 


ఉప్పర్‌పల్లిలో ఎంతకాలం ఈ బాధలు ?

రాజేంద్రనగర్‌ : రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప్పర్‌పల్లి పిల్లర్‌ నెంబర్‌-191 వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో వర్షం పడినప్పుడల్లా రోడ్డుపై రెండున్నర గంటల పాటు వర్షం నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం రూ. 10 కోట్లకు టెండర్లు పిలిచి మూసీ నది నుంచి సన్‌రైజ్‌ కాలనీ వరకు బాక్స్‌ టైప్‌ నాలా నిర్మించారు. మరో రూ. 10 కోట్లు ఫోర్ట్‌వ్యూ కాలనీ నుంచి సన్‌రైజ్‌ కాలనీ వరకు బాక్స్‌ టైపు నాలా నిర్మించడానికి నిధులను మంజూరు చేశారు. టెండర్లు పిలవాలి. ఈ మార్గంలో 300 మీటర్ల మేర ప్రైవేటు వ్యక్తుల వ్యవసాయ భూమి ఉంది. దాన్ని గ్రేటర్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి బాక్స్‌ టైప్‌ నాలా నిర్మించాలి. 


యూసుఫ్‌గూడ జలమయం

యూసుఫ్‌గూడ : యూసుఫ్‌గూడను వర్షం అతలాకుతలం చేసింది. గురువారం కురిసిన వర్షానికి కృష్ణనగర్‌ ఏ, బీ, సీ బ్లాకుల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్‌, వెంకటగిరి ప్రాంతాల్లోని వరద నీరంతా ఇటుగా రావడంలో రోడ్లపై మోకాళ్ల లోతు నీరు ప్రవహించింది. వరద నీరంతా ప్రగతి నగర్‌ మీదుగా రావడంతో ఆక్కడ పార్కు చేసిన కారు సైతం వరదనీటిలో కొట్టుకుపోయి నాలాకు ఢీకొని ఆగిపోయింది. 


ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ 

రాయదుర్గం: వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాలను గురువారం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. గచ్చిబౌలి డివిజన్‌ ఖాజాగూడలో స్థానిక కార్పొరేటర్‌ సాయిబాబా, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. 


చినుకుపడితే చిత్తడే

జవహర్‌నగర్ : చినుకుపడితే చాలు మట్టిరోడ్లు పూర్తిగా చిత్తడిగా మారుతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో చాలా రోడ్లు గుంతలమయంగా మారాయి.  దీంతో వాహనదారులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వాహనాలు నడుపుతున్నారు. యాప్రాల్‌ నుంచి జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌కు వచ్చే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. జవహర్‌నగర్‌లో 100కు పైగా కాలనీలు ఉన్నాయి. ఇప్పటికీ 80శాతానికిపైగా కాలనీల్లో మట్టిరోడ్లు దర్శనమిస్తున్నాయి. బీజేఆర్‌ నగర్‌, పాపయ్య నగర్‌, చెన్నాపురం, బాలాజీ నగర్‌లలోని పలు కాలనీల్లో వరదనీరుతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యాప్రాల్‌ నుంచి జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌కు వచ్చేదారిలో మోకాలి లోతు గుంతలు ఏర్పడ్డాయి.


మళ్లీ వర్షం

హైదరాబాద్‌ సిటీ : నగరంలో గురువారం సాయంత్రం మళ్లీ వర్షం కురిసింది. అత్యధికంగా బాలానగర్‌లో 71.5, మల్కాజిగిరిలో 54.5, బాలానగర్‌లోని భగత్‌ సింగ్‌నగర్‌లో 49.8, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 49.5, ఓల్డ్‌ బోయిన్‌పల్లి బస్‌డిపో వద్ద 48.8, బేగంపేట ఐఎండీ కార్యాలయం వద్ద 40.0, మారేడ్‌పల్లిలో 36.8, తొర్రూరు గ్రామ పంచాయతీ వద్ద 29.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా ఖైరతాబాద్‌, షేక్‌పేటలో 13.0 మిల్లీమీటర్లు నమోదైంది. 


మణికొండను ముంచెత్తిన వరద నీరు

నార్సింగ్‌ : వర్షం మణికొండను అతలాకుతలం చేసింది. పందెన్‌వాగులో నుంచి వరద నీరు పారడంతో పంచవటి కాలనీలోని పలు అపార్ట్‌మెంట్‌లు, ఇళ్లు మునిగిపోయాయి.  మునిగిపోయిన ప్రాంతాలను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కస్తూరీ నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ కె. నరేందర్‌రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ్ల సందర్శించారు.

Updated Date - 2020-09-18T09:19:44+05:30 IST