ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ...

ABN , First Publish Date - 2020-11-27T16:37:02+05:30 IST

ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ... ఇప్పుడు ఎవరి నోట విన్నా... ఇదే వినిపిస్తోంది. రాజకీయ పక్షాలు దీనిని గెలుపు అస్త్రంగా చేసుకున్నాయి.

ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ...

ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ... ఇప్పుడు ఎవరి నోట విన్నా... ఇదే వినిపిస్తోంది. రాజకీయ పక్షాలు దీనిని గెలుపు అస్త్రంగా చేసుకున్నాయి. ఒక పార్టీని మించి, మరొకటి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అన్ని ప్రధాన పార్టీల మేనిఫెస్టోల్లోనూ ఉచిత హామీలున్నాయి. 


నీళ్లు, కరెంట్‌ ఉచితమే...

మెట్రో, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

కులవృత్తులకు రాయితీలు

ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల గాలం


హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌వాసులకు పార్టీలు ఓట్ల కోసం వరాలు కురిపిస్తున్నాయి. మంచినీళ్లను ఉచితంగా విద్యుత్‌ గ్రేటర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా నాయీ బ్రహ్మణుల సెలూన్లకు, రజకుల దోబీఘాట్లకు ఉచితగా విద్యుత్‌ అందిస్తామని టీఆర్‌ఎస్‌ ప్రకటించగా, జీహెచ్‌ఎంసీ సపోర్ట్‌ స్కీమ్‌లో భాగంగా కులవృత్తులు నిర్వహించుకునే వారికి ఉచితంగా నల్లా నీళ్లు అందిస్తామని దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ తమ మేనిఫెస్టోలో పేర్కొన్నాయి. నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని అందిస్తామని, అలాంటి వారు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్‌ పేర్కొంటే.. కాంగ్రెస్‌ మరో పది వేల లీటర్లు కలిపి 30 వేల లీటర్ల వరకు ఉచితం అంటోంది. నెల నెలా బిల్లులు చెల్లించే అవసరం లేకుండానే అందరికీ నల్లా నీళ్లు 24 గంటలూ అందిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. టీడీపీ కూడా తన మేనిఫెస్టోలో మంచినీటికి ప్రాధాన్యతనిచ్చింది.


విద్యుత్


గ్రేటర్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సెలూన్లకు, దోబీ ఘాట్లకు ఉచితంగా విద్యుత్ అని టీఆర్ఎస్ ప్రకటించగా, జీహెచ్ఎంసీ సపోర్ట్ స్కీమ్‌లో భాగంగా కులవృత్తులు నిర్వహించుకునే వారికి ఉచితంగా నల్లా నీళ్లు ఇస్తామని బీజేపీ పేర్కొంది. వంద లోపు యూనిట్లను వినియోగించుకునే కుటుంబాలకు ఉచిత కరెంట్‌ను అందిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో వివరించింది. కాంగ్రెస్‌ కూడా అదే సదుపాయాలు కల్పిస్తానని ప్రకటించింది. నాయీబ్రహ్మణులు, రజకులు, విశ్వకర్మలకు చెందిన దుకాణాలకు ఆస్తిపన్నుతో పాటు విద్యుత్‌ బిల్లులు మాఫీ చేస్తామని ప్రకటించింది. 


ఆరోగ్యానికి పెద్ద పీట

బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. కరోనా కట్టడికి సమర్థవంతమైన ఆరోగ్య ప్రణాళికను రూపొందిస్తామని, ఉచితంగా పరీక్షలు చేస్తామని బీజేపీ చెబుతోంది. ఆయుష్మాన్‌ భారత్‌ స్కీమ్‌ను అమలు చేస్తామని, మొబైల్‌ హెల్త్‌ చెకప్‌ కార్యక్రమాన్ని చేపడుతామని పేర్కొంది. ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు, రూ.25వేల వరద సాయం మరిన్ని అంశాలు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి చికిత్స ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్‌ పేర్కొంది. గాంధీ, ఉస్మానియా, నిలోపర్‌ ఇతర ఆస్పత్రులను మెరుగుపరచడంతో పాటు బస్తీ దవాఖానాలను 450 వరకు పెంచి రాత్రి 9 వరకు వైద్య సేవలు అందిస్తామని, ప్రతి వంద దవాఖానాలకు ఒక మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి, మలేరియా, డెంగీ నివారణకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నట్లు పేర్కొంది.


మెట్రోలో ఉచితం

మెట్రోరైలు రెండో దశ రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు, బీహెచ్‌ఈఎల్‌ నుంచి మెహిదీపట్నం వరకు విస్తరిస్తామని టీఆర్‌ఎస్‌ పేర్కొంది. ఎయిర్‌పోర్టు వరకు నాన్‌స్టాప్‌ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా మరో 90 కిలోమీటర్ల వరకు అందుబాటులోకి తెస్తామని తెలిపింది.కాంగ్రెస్‌ కూడా మెట్రోకు ప్రాధాన్యమిచ్చింది. పాతబస్తీ వరకు విస్తరణ, మహిళలు,  విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులకు బస్సులు, మెట్రో రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి మెట్రోరైళ్లను విస్తరించి, పాతబస్తీ, ఎయిర్‌పోర్టు, లింగంపల్లి, పఠాన్‌చెరువు, సంగారెడ్డి వరకు కనెక్టివిటి ఉండేలా మార్పులు చేస్తామంది. విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు, ఫ్రీ వైఫె అందిస్తామని బీజేపీ ప్రకటించింది.


ఉచిత ఇళ్లు....

గ్రేటర్‌లో లక్ష మందికి డబుల్‌ బెడ్‌ రూం అందిస్తామని, ఇప్పటికే కొందరికి ఇళ్లను అందజేశామని టీఆర్‌ఎస్‌ ప్రకటించగా, ప్రధాని అవాజ్‌ యోజన కింద లక్ష మంది వరకు ఉచితంగా ఇళ్లు కట్టి ఇస్తామని బీజేపీ పేర్కొంటోంది.


వరద నీటి కోసం

వరద నీటి ప్రవాహన్ని అడ్డుకునేందుకు సమగ్ర వరద నీటి నిర్వహణ ప్రణాళిక ఏర్పాటు చేయనున్నట్లు టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. 30 నుంచి 40 సెంటిమీటర్ల వర్షపాతాన్ని తట్టుకునే విధగా నాలాలు, వరద నీటి కాలువలు ఏర్పాటు చేస్తామని, నాలా అభివృద్ధి విభాగం ద్వారా ప్రణాళిక అమలుకు 12 వేల కోట్ల వెచ్చిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. వరద నీటి ముంపు నివారణకు అన్ని ప్రాంతాల్లోనూ ఓపెన్‌ నాలాలు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు రూ.10 వేల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ వెల్లడించింది. చెరువులు, నాలాల ఆక్రమణల నివారణకు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామంది.


ట్రాఫిక్‌ ఫ్రీ గా...

ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిద్దిడానికి ఫుట్‌పాత్‌, సైకిల్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లు టీఆర్‌ఎస్‌ తెలిపింది. గ్రేటర్‌ పరిధిలో టూవీలర్‌, ఆటోలపై ఇప్పటి వరకు ఉన్న జరిమానాలు రద్దు చేస్తామని బీజేపీ ప్రకటించింది. రోడ్లపై గుంతలు పడితే 15 రోజుల్లో మరమ్మత్తులు చేస్తామని పేర్కొంది.


ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు...

గ్రేటర్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తామని, వరద బాధితులకు రూ.25 వేల సాయం అందిస్తామని బీజేపీ పేర్కొంది. మురికి వాడలు, కుటుంబాలకు ఆస్తి పన్ను మాఫీ చేస్తామని,   ఎస్సీ కాలనీలు, బస్తీలకు ఆస్తి పన్నును మినహాయింపు ఇస్తామని ప్రకటించింది.


మూసీపై....

మూసీ నదిని స్వచ్ఛంగా మారుస్తామని, సమగ్ర సివరేజీ మాస్టర్‌ ప్లాన్‌ను రూ.13 కోట్లతో అమలు చేస్తామని టీఆర్‌ఎస్‌ పేర్కొంది. ఏడాదిలోగా మూసీ ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. పాతబస్తీ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామని బీజేపీ పేర్కొంది.


ఇంటింటికీ వంటగ్యాస్‌ పైపులైన్‌

ఇంటింటికీ మంచినీటి సరఫరా  అందించడం, పూర్తి స్థాయిలో వైఫై నగరంగా మార్చడం, పైపులైన్ల ద్వారా  ఇంటింటికీ వంటగ్యాస్‌, పేదలకు పక్కా ఇళ్లు, పూర్తి స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ ఆఽధనీకరణ, ముఖ్యమైన కూడళ్ల వద్ద, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత పార్కింగ్‌, మెట్రో విస్తరణ, డంప్‌యార్డ్‌ ఫ్రీ సిటీగా  హైదరాబాద్‌, విద్యుత్‌ తరహాలో నీటి పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తన మెనిఫెస్టోలో పేర్కొంది. 

Updated Date - 2020-11-27T16:37:02+05:30 IST