అడ్డా కోసం అడ్డగోలు వసూళ్లు!

ABN , First Publish Date - 2020-08-11T09:45:27+05:30 IST

నూతనంగా ఏర్పాటు చేయబోయే కేసీఆర్‌ కూరగాయల మార్కెట్‌ను చిరువ్యాపారులు ఎంతో నమ్ముకున్నారు.

అడ్డా కోసం అడ్డగోలు వసూళ్లు!

కేసీఆర్‌ కూరగాయల మార్కెట్‌లో షెడ్ల నిర్మాణానికే అంటున్న కమిటీ సభ్యులు

ఒక్కొక్కరం రూ. 30 వేలు ఇచ్చామంటున్న కూరగాయల వ్యాపారులు 


జవహర్‌నగర్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): నూతనంగా ఏర్పాటు చేయబోయే కేసీఆర్‌ కూరగాయల మార్కెట్‌ను చిరువ్యాపారులు ఎంతో నమ్ముకున్నారు. ఎన్నో ఏళ్లుగా రోడ్లపైనే వ్యాపారం చేస్తున్న వ్యాపారులు కేసీఆర్‌ మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకోడానికి అడ్డా దొరికితే చాలు... బతుకుబండి ఎలాగో నెట్టుకోవచ్చని అనుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు అందినకాడికి దండుకుంటున్నారు. సుమారు 300 మంది కూరగాయల వ్యాపారుల నుంచి ఇప్పటికే రూ. 60లక్షల వరకు వసూలు చేసినట్టు సమాచారం.


ఇప్పటికీ రోడ్లపైనే వ్యాపారం

జవహర్‌నగర్‌ గ్రామపంచాయతీ నుంచి కార్పొరేషన్‌గా రూపుదిద్దుకున్నా ఇప్పటికీ రోడ్లపైనే కూరగాయలు అమ్ముతున్నారు. ఇప్పుడు కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేసిన స్థలంపై కోర్టులో వాదనలు జరగుతున్నాయి. అందరికీ అనువుగా స్థలం ఉండటంతో మార్కెట్‌ కమిటీవారు ఇక్కడే మార్కెట్‌యార్డ్‌ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసి భూమిపూజ కూడా చేశారు. ఇంతలో మరికొందరు స్థలం మాదేనంటూ వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేయడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంవల్ల వారిపై కేసులు నమోదుచేశారు.


తీసుకున్న డబ్బులకు రసీదులేవి?

కూరగాయల వ్యాపారులకు మార్కెట్‌ నిర్మించడం మంచి నిర్ణయమే. షెడ్ల నిర్మాణం ప్రభుత్వం చేపడితే ఇక్కడ సమస్య తలెత్తేది కాదు... కానీ మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు నేరుగా డబ్బులు వసూలు చేస్తున్నారని పలు వురు ఆరోపిస్తున్నారు. రసీదులు ఇవ్వడం లేదని అంటున్నారు. దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు కూడా కొందరు ఎక్కువ, మరికొందరు తక్కువ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. వ్యాపారుల నుంచి వసూలు చేసి షెడ్‌ల నిర్మాణం చేపట్టడం సరికాదని పలువురు ఆరోపిస్తున్నారు. 


షెడ్ల నిర్మాణం కోసమే వసూలు

కూరగాయల వ్యాపారులు ఏళ్లుగా మార్కెట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశం లేనందున్న వ్యాపారుల డబ్బులతోనే షెడ్ల నిర్మాణం జరుగుతోంది. కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేయలడమే మా లక్ష్యం.

- సునీత, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌


ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేలు..

కూరగాయల మార్కెట్‌ నిర్మాణం కోసం సుమారు 300 మంది కూరగాయల వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకున్నాం. అందులో కొందరు రూ. 5వేల నుంచి 30వేల వరకు ఇచ్చారు. వాటితోనే కేసీఆర్‌ మార్కెట్‌లో షెడ్ల నిర్మాణం చేపట్టాం. ఎవరికీ రశీదులు ఇవ్వడం లేదు. కూరగాయలు అమ్ముకోడానికి ఐడీ కార్డులు అందజేస్తాం. కూరగాయలు అమ్ముకునేవారికే ఇందులో ప్రాధాన్యం ఇస్తున్నాం. 

- మల్లెపాక మల్లేశం, మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు


‘మా వ్యాఖ్యలను వక్రీకరించారు’..ప్రభుత్వమే షెడ్ల నిర్మాణం చేపట్టాలి

షెడ్ల నిర్మాణం కోసం కూరగాయల వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేయడం తగదని అన్నందుకు కాంగ్రెస్‌ నాయకులపై బురద జల్లుతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు బల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. జవహర్‌నగర్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ 25వ డివిజన్‌లో ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్న వ్యాపారులు మా ర్కెట్‌లో అడ్డా కావాలంటే రూ. 30వేలు డిమాండ్‌ చేస్తున్నారని కార్పొరేటర్‌ నవీన్‌కు సమాచారం అందించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మార్కెట్‌ కమిటీ సభ్యులను నిలదీయగా కమిటీ చైర్మన్‌, అధ్యక్షుడు ఒక్కొక్కరి నుంచి రూ. 30వేలు తీసుకుంటున్నారని తెలిసింది.


గతంలోనే రూ.15వేలు తీసుకున్నారు. వ్యాపారుల నుంచి వసూళ్లు ఆపి ప్రభుత్వమే అధికారికంగా షెడ్లు నిర్మించాలని డిమాండ్‌ చేశామని మా వ్యాఖ్యల ను కొందరు వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ప్రసాద్‌గౌడ్‌, కార్పొరేటర్‌ నవీన్‌, రాహుల్‌ కదం, నాగరాజు, కొత్తకొండ వేణు, పల్లె కష్ణగౌడ్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు. 


వసూళ్లపై మున్సిపల్‌ కమిషనర్‌ ఆగ్రహం 

కేసీఆర్‌ కూరగాయల మార్కెట్‌లో అడ్డా కోసం వసూళ్లకు పాల్పడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో మున్సిపల్‌ కమిషనర్‌ మంగమ్మ స్పందించారు. వసూళ్లకు పాల్పడితే మున్సిపల్‌ చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Updated Date - 2020-08-11T09:45:27+05:30 IST