జల్‌’మయం... అప్పటి నుంచి ఇప్పటి వరకూ...

ABN , First Publish Date - 2020-12-10T06:24:38+05:30 IST

ఇది జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌నగర్‌ బస్తీ.

జల్‌’మయం... అప్పటి నుంచి ఇప్పటి వరకూ...

రెండు నెలలుగా వరద నీటిలోనే ఉస్మాన్‌నగర్‌, తదితర బస్తీలు


ఇది జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌నగర్‌ బస్తీ. ఫొటో చూసి వరదల నాటి పాత చిత్రం అనుకునేరు. వరదల వల్లే కానీ.. ఇప్పుడూ అదే పరిస్థితి అక్కడ. వరదలు వచ్చి రెండు నెలలు దాటినా ఆ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌నగర్‌, అహ్మద్‌నగర్‌, సైఫ్‌ కాలనీ, అబ్దుల్లా యహియా నగర్‌లు ఇప్పటికే నీటిలోనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రజా ప్రతినిధులు గానీ, అధికారులు గానీ పట్టించుకోవడం లేదని ఆయా బస్తీల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికీ ఆ ప్రాంతం ఇలాగే ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 


పహాడిషరీఫ్‌, డిసెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి) : బురాఖాన్‌ చెరువు పరిధిలోని ఎఫ్‌టీఎల్‌ భూములను పట్టాదారు రైతులు విక్రయించడంతో వారి నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొని విక్రయించారు. అప్పట్లో ఇక్కడ తక్కువ ధరకు భూమి లభించడంతో నగరంలోని వివిధ ప్రాంతాల పేదలు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. అలా 1991లో ఉస్మాన్‌నగర్‌ బస్తీ ఏర్పడింది. ఎక్కువ శాతం రేకుల ఇళ్లే ఉన్నాయిక్కడ. 1993, 2004లో కురిసిన భారీ వర్షాల్లోనూ ఉస్మాన్‌నగర్‌ బస్తీ జలమయమైంది. 2004లో వరదలు వచ్చినప్పుడు నాటి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి షబ్బీర్‌అలీ నీట మునిగిన ఇళ్ల బాధితులకు పట్టాలు ఇచ్చారు. అవి నిజమైన లబ్ధిదారులకు అందకుండా కొంతమంది నాయకుల చేతుల్లోకి వెళ్లినట్లు ఆరోపణలున్నాయి. 2011లో కూడా నాటి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సర్వే నెంబర్‌ 144లో ఉన్నవారిలో కొంత మందికి పట్టాలు ఇచ్చారు. ఇదిలా ఉండగా.. రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు బురాన్‌ఖాన్‌ చెరువులోకి అధికస్థాయిలో నీరు చేరింది. ఆ నీరు పొంగిపొర్లడంతో ఉస్మాన్‌గర్‌, అహ్మద్‌నగర్‌, సైఫ్‌కాలనీ, అబ్దుల్లా యహియానగర్‌లో సుమారు 700 ఇళ్లు ముంపునకు గురయ్యాయి. బాధితులు ఇళ్లు ఖాళీ చేసి ఇతర బస్తీలు, పాతబస్తీలోని బంధువుల ఇళ్లలో నివాసముంటున్నారు. రెండు నెలలు దాటినప్పటికీ ఆ ఇళ్లు నీటిలోనే ఉన్నాయి. నివాసితులు ఇళ్లకు దూరంగానే ఉంటున్నారు. నానుతున్న ఆ ఇళ్లు ఎప్పుడు కూలతాయో తెలియని పరిస్థితి. అధికార టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య ఈ ప్రాంతం పరిస్థితిపై మాటల యుద్ధం కొనసాగుతోంది కానీ పరిష్కారం ఎవరూ చూపడం లేదని బాధితులు వాపోతున్నారు.


ఇప్పటికైనా పరిష్కరిస్తారా.. 

బురాన్‌ఖాన్‌ చెరువు 78 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. సుమారు 30 ఎకరాల్లో నిర్మాణాలు వెలిశాయి. వరదల సమయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యవేక్షణలో బడంగ్‌పేట్‌, జల్‌పల్లి మున్సిపాలిటీ అధికారులు అలుగును ధ్వంసం చేసి నీరు దిగువకు వెళ్లేందుకు మార్గం చేశారు. తక్కువ మొత్తంలో నీరు బయటికి వెళ్లింది. దీంతో ఇప్పటికీ నివాసాలు నీటిలోనే ఉన్నాయి. పరిష్కారం కోసం అధికారులు చర్చిస్తూనే ఉన్నారు. ఆ ఇళ్లు ఎఫ్‌టీఎల్‌లో ఉండడంతో కూల్చివేయాలని అధికారులు అంటున్నారు. చెరువుకు మరో పక్కన అమెరికన్‌ టౌన్‌షిప్‌ అనే కాలనీ ఉంది. కూతవేటు దూరంలో ఉన్న బాలాజీనగర్‌ అల్లోన్‌కుంట చెరువులో ఓ రియల్‌ఎస్టేట్‌ కంపెనీ వెంచర్‌ వేసింది. వాటి జోలికి వెళ్లకుండా పట్టాలు ఉన్నప్పటికీ తమ ఇళ్లు ఎలా కూలుస్తారని బస్తీల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నీరు వెళ్లే మార్గం చేయాలని కోరుతున్నారు.


అనుమతులు ఉన్నాయి : స్థానికులు 

తాము కాయకష్టంతో సంపాదించిన సొమ్ముతో భూములు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నామని, ఇంటి నెంబర్లు, కరెంటు, నీటి కనెక్షన్‌ తీసుకొని నెలనెలా చెల్లిస్తున్నామని బస్తీ వాసులు తెలిపారు. ప్రభుత్వం తరఫున రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్‌ సైతం వేశారని, ఇప్పుడేమో ఎఫ్‌టీఎల్‌ అంటున్నారని వాపోతున్నారు. ఎఫ్‌టీఎల్‌ అయితే అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.


78 ఎకరాల్లో బురాన్‌ఖాన్‌ చెరువు : ఇరిగేషన్‌ డీఈ పరమేష్‌ 

జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బురాన్‌ఖాన్‌ చెరువు 78 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని 30 ఎకరాల్లో ఇళ్లు ఉన్నాయి. 48 ఎకరాల్లో చెరువు ఉంది. ఎఫ్‌టీఎల్‌ కావడం వల్లే నీళ్లు వెళ్లడం లేదు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.


నీరు పోయే మార్గం చేయాలి - మాజిద్‌, స్థానికుడు 

వరదలకు ఉస్మాన్‌నగర్‌ తదితర బస్తీలు ముంపునకు గురయ్యాయి. చెరువు తూములను మూసివేయడం వల్లే ఇళ్లు నీట మునిగాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు నిపుణుల సలహాలు తీసుకొని బస్తీలో నీరు నిలవకుండా శాశ్వత పరిష్కారం చూపాలి. 


బాధితులకు అండగా ఉన్నాం : చైర్మన్‌ అబ్దుల్లా సాది

ఉస్మాన్‌నగర్‌, సైఫ్‌ కాలనీ, హబీబ్‌కాలనీ, అహ్మద్‌నగర్‌ బస్తీలలో భారీగా నీరు చేరడంతో మున్సిపాల్టీ తరఫున అక్టోబర్‌ 14 నుంచి 22 వరకు మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆహారం, పాలు, నిత్యావసరాలు, దుప్పట్లు అందించాం. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి కలెక్టర్‌ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ నిధులతో బురాన్‌ఖాన్‌ చెరువు నుంచి బాలాపూర్‌ పెద్దచెరువులోకి నీరు వెళ్లడానికి పైప్‌లైన్‌ వేశాం. దాని ద్వారా నీరు బయటికి వెళ్తుంది. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశాం.

Updated Date - 2020-12-10T06:24:38+05:30 IST