రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు

ABN , First Publish Date - 2020-03-24T09:48:27+05:30 IST

భరత్‌పూర్‌ సైబర్‌ దొంగలు రెచ్చిపోతున్నారు. సైబర్‌ నేరాలు చేయడంలో ఆరితేరిన కేటుగాళ్లు ఓఎల్‌ఎక్స్‌ను ..

రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు

ఓఎల్‌ఎక్స్‌ వేదికగా మోసాలు 

సైబరాబాద్‌లో 2 నెలల్లో.. రూ.43.95 లక్షల దోపిడీ 

భరితెగిస్తున్న భరత్‌పూర్‌ దొంగలు


హైదరాబాద్‌ సిటీ, మార్చి23 (ఆంధ్రజ్యోతి): భరత్‌పూర్‌ సైబర్‌ దొంగలు రెచ్చిపోతున్నారు. సైబర్‌ నేరాలు చేయడంలో ఆరితేరిన కేటుగాళ్లు ఓఎల్‌ఎక్స్‌ను వేదికగా చేసుకుని.. ఈ ఏడాది కేవలం రెండు నెలల్లో ఒక్క సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే 54 మంది అమాయకులను బురిడీకొట్టించి రూ.43,95,923 కొల్లగొట్టారంటే వారు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. వారిని పట్టుకోవడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.


మారని ప్రజలు.. తగ్గని మోసాలు...

పోలీసులు ఎన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నా.. ఎంతో మంది అమాయకులు సైబర్‌ నేరగాళ్ల బారినపడి రూ. లక్షలు పోగొట్టుకుంటున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. దాంతో హైదరాబాద్‌ నగరాన్ని టార్గెట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు ఏటా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. లక్షలాది మంది వారి ఉచ్చులో పడి రూ.లక్షల్లో నష్టపోతున్నారు. గతేడాది ఒక్క ఓఎల్‌ఎక్స్‌ మోసాలతోనే సైబర్‌ నేరగాళ్లు రూ.13,35,60,523 కొల్లగొట్టినట్లు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు వెల్లడించారు. వారిలో సింహభాగం భరత్‌పూర్‌ దొంగలే దోచేసినట్లు పేర్కొన్నారు. గతేడాది హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 3,838 మంది ఓఎల్‌ఎక్స్‌ మోసాల బారినపడినట్లు ఫిర్యాదులు అందాయి.


ఓఎల్‌ఎక్స్‌ వేదికగా...

ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్‌ను సైబర్‌ నేరగాళ్లు తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. తక్కువ ధరకే బైక్‌లు, కార్లు, వంటి వస్తువుల అమ్మకం, కొనుగోలు పేరుతో నకిలీ ప్రకటనలు పోస్టు చేస్తున్నారు. ఆ తర్వాత మోసపూరితమైన మాటలతో కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నారు. తియ్యటి మాటలతో బుట్టలో వేసుకొని అందినంతా దండుకుంటున్నారు. ఇలా రోజుకో కొత్తరకం మోసంతో కొనుగోలు దారులు, అమ్మకం దారులను బురిడీ కొట్టించి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. నైజీరియన్‌ సైబర్‌ నేరగాళ్ల నుంచి నేర్చుకున్న ఈ సైబర్‌ తెలివితేలను ఇప్పుడు రాజస్థాన్‌కు చెందిన భరత్‌పూర్‌ దొంగలు అమలు చేస్తున్నారు. కేవలం ఓఎల్‌ఎక్స్‌ మోసాలనే టార్గెట్‌ చేస్తున్న ఆ నేరగాళ్లు ఏటా రూ.కోట్లు దోచేస్తున్నారు. 


నగరవాసులను టార్గెట్‌ చేసి...

ఓఎల్‌ఎక్స్‌ మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు హైదరాబాద్‌ నగరవాసులను టార్గెట్‌ చేస్తున్నారు. వారి అత్యాశను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అడ్డంగా దోచేస్తున్నారు. రూ.50 వేలు విలువ చేసే ఒక బైక్‌ ఫొటోను పోస్టుచేసి దాని అమ్మకం పేరుతో రూ.2 లక్షలు దోచేశారంటే వారి మోసం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా నైజీరియన్‌లు, రాజస్థాన్‌కు చెందిన భరత్‌పూర్‌ సైబర్‌ నేరగాళ్లు ఓఎల్‌ఎక్స్‌ మోసాల్లో సిద్ధహస్తులుగా సైబర్‌ క్రైం పోలీసులు గుర్తించారు. సరికొత్త పద్ధతిలో ఓఎల్‌ఎక్స్‌ మోసాలకు పాల్పడుతూ నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ మోసాలను అరికట్టడానికి సీఐడీ, మూడు కమిషనరేట్ల పరిధిలోని సైబర్‌ క్రైం పోలీసులు రంగంలోకి దిగి ప్రత్యేక దృష్టి సారించారు. అయినా.. ప్రజలు ఓఎల్‌ఎక్స్‌ మోసాల బారినపడుతున్నారు. ఓఎల్‌ఎక్స్‌లో వస్తువుల కొనుగోలు, అమ్మకం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


ఈ ఏడాది రెండు నెలల్లో సైబరాబాద్‌లో నమోదైన ఓఎల్‌ఎక్స్‌ మోసాల వివరాలు... 

మొత్తం ఫిర్యాదులు : 54

నేరగాళ్లు కొల్లగొట్టిన సొత్తు : రూ. 43,95,923


ట్రై కమిషనరేట్‌ల పరిధిలో 2019లో అందిన ఓఎల్‌ఎక్స్‌ మోసాల వివరాలు.. 


కమిషనరేట్‌ అందిన ఫిర్యాదులు నేరగాళ్లు కొల్లగొట్టిన సొత్తు


హైదరాబాద్‌ 1,642 రూ. 5,23,00,000

సైబరాబాద్‌ 1,309 రూ. 4,37,69,843

రాచకొండ 887 రూ. 3,74,90,680

మొత్తం 3,838 రూ. 13,35,60,523

Read more