‘తిండి లేక అలమటిస్తున్నాం.. సొంతూళ్లకు వెళ్లిపోతాం.. పర్మిషన్ ఇవ్వండి..’

ABN , First Publish Date - 2020-05-11T16:18:03+05:30 IST

లాక్‌డౌన్‌తో హోటల్‌లో పనిచేసే ఒడిశా కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. హోటళ్ల యజమానులు భోజనం పెట్టకపోవడంతో 36 మంది కార్మికులు

‘తిండి లేక అలమటిస్తున్నాం.. సొంతూళ్లకు వెళ్లిపోతాం.. పర్మిషన్ ఇవ్వండి..’

ఉపాధి లేక పస్తులుంటున్నాం

హోటల్‌ యజమానులు భోజనం పెట్టడం లేదు

మా రాష్ట్రానికి పంపించండి.. ఒడిశా కార్మికుల ఆవేదన


ముషీరాబాద్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌తో హోటల్‌లో పనిచేసే ఒడిశా కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. హోటళ్ల యజమానులు భోజనం పెట్టకపోవడంతో 36 మంది కార్మికులు పస్తులుంటున్నారు. వారి వద్ద ఉన్న డబ్బులు అయిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మా రాష్ట్రానికి పంపిస్తే వెళ్లిపోతామంటూ వేడుకుంటున్నారు. పోలీసులను కలిసి సమస్యను వివరిస్తే డీజీపీ ఆఫీసుకు వెళ్లాలని సూచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ముషీరాబాద్‌ చౌరస్తా సమీపంలో గల హోటల్‌లో పనిచేసే 15 మంది కార్మికులు చైనీస్‌ వంటలు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. చాదర్‌ఘాట్‌లోని 21 మంది కార్మికులు స్థానికంగా ఉండే హోటల్‌లో వంటలు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా హోటళ్లు బంద్‌ కావడంతో వారంతా ఉపాధి కోల్పోయారు. యజమానులు వీరికి కొద్ది రోజులు అన్నం పెట్టినప్పటికీ లాక్‌డౌన్‌ పొడిగించడంతో వారు చేతులెత్తేశారు. వెళ్లిపోవాలని చెబుతున్నారని కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ. 1,500, బియ్యం కూడా తమకు అందలేదని సద్దాం హరినా, తస్లీం, మునీస్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. తామంతా తిండికి అలమటిస్తున్నామన్నారు. ట్రావెల్స్‌ యజమానిని కలిస్తే రూ. 1.10 లక్షలు ఇస్తే తీసుకెళతామని చెప్పడంతో రూ. 10 వేలు కట్టామన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే బస్సులో తీసుకెళ్తామని అంటున్నారని మీర్జా కౌసర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ముషీరాబాద్‌ పోలీసులను కలిస్తే తాము ఏం చేయలేమని, డీజీపీ ఆఫీసుకు వెళ్లాలని చెబుతున్నారని, తమ పేర్లు రాసుకున్నారని వారు పేర్కొన్నారు. ఒడిశా వెళ్లేందుకు దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నారు. సహాయం చేసే వారు 7702956290 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.  


అనుమతి ఇస్తే చార్జీలు మేమే భరిస్తాం: సద్దాం హరినా, బాధితుడు

ఒడిశా వెళ్లేందుకు అనుమతి ఇస్తే అప్పు చేసి బస్సు చార్జీలు మేమే కడతాం. ట్రావెల్‌ యజమానితో మాట్లాడాం. అనుమతి తీసుకురావాలని అంటున్నారు. దయచేసి మా ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి..

Updated Date - 2020-05-11T16:18:03+05:30 IST