రైతులు పండించిన తిండి తినే అందరూ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించాలి: మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్
ABN , First Publish Date - 2020-12-16T04:38:22+05:30 IST
రైతులు పండించిన తిండి తినే ప్రతి ఒక్కరూ దేశ ప్రధానిమోదీ తీసుకువచ్చిన దుర్మార్గమైన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్

కవాడిగూడ, డిసెంబర్ 15(ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన తిండి తినే ప్రతి ఒక్కరూ దేశ ప్రధానిమోదీ తీసుకువచ్చిన దుర్మార్గమైన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండటానికి రైతులను నాశనం చేయడానికే ఈ వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. మంగళవారం ఇందిరాపార్కు వద్ద అఖిలభారత రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రెండోరోజు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ డాక్టర్ నాగేశ్వర్ మాట్లాడుతూ, వ్యవసాయ చట్టాలలో ఎక్కడా కూడా రైతులకు కనీస మద్దతు ధర లేదని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు పండించిన సన్నవడ్లకు క్వింటా రూ.2,500లకు కార్పొరేట్ సంస్థలు కొనుగోలు చేస్తే ఆ చట్టాలను ఎవరూ వ్యవతిరేకించరని ఆయన స్పష్టం చేశారు. అనంతరం రైతుసంఘాల జాతీయ కమిటీ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఎంఎల్ న్యూ డెమొక్రసీ రాష్ట్ర నాయకులు పోటు రంగారావు తదితరులు మాట్లాడారు. నాయకులు రమ, సాగర్, పశ్యపద్మ, కొండపల్లి అచ్యుతరామారావు, ఉపేందర్, ఎస్‌ఎల్ పద్మ, హన్మేష్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ధర్నాలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల ఉరివేసుకోవడమే శరణ్యం అంటూ రైతు సంఘాల నాయకులు, చిన్నారులు ఉరితాళ్లతో ఉరివేసుకొని వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో చిన్నారులు పాల్గొనడంతో స్థానిక పోలీసులు అభ్యంతరం తెలపడంతో కొద్దిసేపు పోలీసులు, రైతు సంఘాల నేతలకు వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.