విద్యా వలంటీర్లను రెగ్యులరైజ్‌ చేయాలి: ఆర్‌. కృష్ణయ్య

ABN , First Publish Date - 2020-12-13T06:50:17+05:30 IST

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పదేళ్లుగా పనిచేస్తున్న 15 వేల మంది విద్యా వలంటీర్లను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

విద్యా వలంటీర్లను రెగ్యులరైజ్‌ చేయాలి: ఆర్‌. కృష్ణయ్య

రాంనగర్‌, డిసెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పదేళ్లుగా పనిచేస్తున్న 15 వేల మంది విద్యా వలంటీర్లను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. శనివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో రాష్ట్ర విద్యా వలంటీర్ల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నిరుద్యోగ జాక్‌ చైర్మన్‌ నీలా వెంకటేష్‌ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ విద్యా వలంటీర్లకు జీతాలను చాలా తక్కువ ఇస్తున్నారని, నెలకు 12 వేలు ఇస్తే వారి కుటుంబాలను ఎలా పోషిస్తారని ప్రశ్నించారు. వీరి జీతాలను మైనారిటీ పాఠశాలలకు ఇస్తున్న మాదిరిగా 24 వేలకు పెంచాలని అన్నారు. విద్యా వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.12 వేల నుంచి రూ.24 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా కల్పించాలని, విద్యా వలంటీర్‌ అనేపదాన్ని తొలగించి కాంట్రాక్టు టీచర్లుగా మార్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో నీలా వెంకటేష్‌, గొరిగే మల్లేష్‌, సి.రాజేందర్‌, ఆర్‌.చంద్రశేఖర్‌గౌడ్‌, కోటేశ్వరరావు, అరుణ, నవనీత, వినోద్‌, వినయ్‌యాదవ్‌, సిద్దిరాజు, శ్రీనివాస్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-13T06:50:17+05:30 IST