నగరంలో పాకిస్థాన్‌ మహాకవి స్మారకం

ABN , First Publish Date - 2020-11-27T06:43:32+05:30 IST

సారే జహాసే అచ్చా..

నగరంలో పాకిస్థాన్‌ మహాకవి స్మారకం
సైఫాబాద్‌లోని ఇక్బాల్‌ మినార్‌ స్తూపం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): సారే జహాసే అచ్చా.. హిందూ సితా హమారా. భారతదేశ గొప్పదనాన్ని చాటే ఈ దేశభక్తి గీతాన్ని రచించింది పాకిస్థాన్‌కు చెందిన  ప్రపంచ ప్రఖ్యాత కవి, మహాపండిత బిరుదాంకితుడు మహమ్మద్‌ ఇక్బాల్‌. ఆయన స్వస్థలం పాకిస్థాన్‌లోని పంజాబ్‌. ఉర్దూ, పారశీ భాషల్లో మహోన్నత కవిత్వాన్ని సృజించిన ఇక్బాల్‌కి హైదరాబాద్‌తో అనుబంధం ప్రత్యేకం. ఆరో నిజాం కొలువులోని ప్రధాని మహారాజా కిషన్‌ ప్రసాద్‌ ఆహ్వానం మేరకు తొలిసారిగా 1910లో ఇక్బాల్‌ నగరానికి విచ్చేశారు. టౌన్‌హాల్‌(ఇప్పటి అసెంబ్లీ భవనం)లో ‘రీకన్ట్రక్షన్‌ ఆఫ్‌ రిలీజియస్‌ థాట్స్‌ ఇన్‌ ఇస్లాం’ అంశంపై ఆయన ఉపన్యసించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. నగరంలో ఐదు రోజులు బస చేసిన ఇక్బాల్‌, ‘కుతుబ్‌షాహీ టూం బ్స్‌’ ను సందర్శించి, అప్పటికప్పుడే ‘ఘోరిస్థాన్‌-ఏ-షాహీ’ కవితను రాశారు. మరో సందర్భంలో ఇక్బాల్‌తో ఉన్న స్నేహం మేరకు కిషన్‌ప్రసాద్‌ కూడా లాహోర్‌కు వెళ్లారు. 1930లోనూ ఇక్బాల్‌ హైదరాబాద్‌ను సందర్శించినట్లు చరిత్ర అధ్యయనకారులు సజ్జాద్‌ చెబుతున్నారు. 1938 జనవరిలో ఉస్మానియా వర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో మహాకవి ఇక్బాల్‌ను సత్కరించింది. అదే ఏడాది ఏప్రిల్‌ 21న ఆయన కీర్తిశేషులయ్యారు.

నగరంలోనే ఇక్బాల్‌  అకాడమీ

ఇక్బాల్‌ సాహిత్యానికి అభిమాని, విద్యావేత్త సయ్యద్‌ ఖలీలుల్లా హుస్సేన్‌ 1959లో ఇక్బాల్‌ అకాడమీని నగరంలో నెలకొల్పారు. ఇక్బాల్‌ సాహిత్యాన్ని పునర్ముద్రించారు. ఆరువేల పుస్తకాలతో కొలువుదీరిన ఇక్బాల్‌ అకాడమీ ఉర్దూ, పర్షియన్‌ భాషాభిమానులకు పట్టుకొమ్మగా విరాజిల్లుతోంది. నగరంలోని ఇక్బాల్‌ అభిమానులంతా కలిసి సైఫాబాద్‌ వద్ద ఇక్బాల్‌ స్మారకాన్ని 1986లో నెలకొల్పా రు. ఇక్బాల్‌ మినార్‌ను అప్పటి సీఎం ఎన్టీఆర్‌ ఆవిష్కరించారు. ఆ సభలో ఎన్టీఆర్‌ సారే జహాసే అచ్చా గీతాన్ని ఆలపించారని ఇక్బాల్‌ అకాడమీ ప్రస్తుత చైర్మన్‌ జియాయుద్దీన్‌ నయ్యర్‌ గుర్తుచేసుకున్నారు. పాకిస్థానీ మహాకవి మహమ్మద్‌ ఇక్బాల్‌ స్మారక స్తూపం నగర యవనికపై భిన్నత్వంలోని ఏకత్వానికి చిహ్నం.

Read more