జొన్నల బస్తాల మాటున 340 కిలోల గంజాయి.. ఎనిమిది మంది అరెస్టు

ABN , First Publish Date - 2020-07-14T16:22:02+05:30 IST

ఏజెన్సీ ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నగరానికి తరలించి అధిక ధరకు విక్రయిస్తున్న ముఠాను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 17 లక్షల విలువైన 340 కిలోల గంజాయి, ఆటో, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

జొన్నల బస్తాల మాటున 340 కిలోల గంజాయి.. ఎనిమిది మంది అరెస్టు

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నగరానికి తరలించి అధిక ధరకు విక్రయిస్తున్న ముఠాను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 17 లక్షల విలువైన 340 కిలోల గంజాయి, ఆటో, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జాలీహనుమాన్‌ ప్రాంతానికి చెందిన గోపీ సింగ్‌(29) తండ్రితో కలిసి విగ్రహాలు తయారీ చేసేవాడు. వచ్చే ఆదాయం విలాసాలకు సరిపోకపోవడంతో గంజాయి వ్యాపారం ప్రారంభించాడు. ఇటీవల అరెస్టు అయి జైలుకెళ్లొచ్చాడు. తిరిగి గంజాయి వ్యాపారం చేసేందుకు పథకం పన్నాడు. మంగళ్‌హాట్‌ చుడీబజార్‌లో ఉండే రాజేంద్రపవార్‌ అలియాస్‌ రాజు పాటిల్‌(38), అదే ప్రాంతానికి చెందిన డ్రైవర్‌ దౌలత్‌ సింగ్‌(38), జిన్సీచౌరాహికి చెందిన కిరాణా వ్యాపారి మనీష్ మాల్‌పానీ అలియాస్‌ మనీష్‌(45), జాలీ హనుమాన్‌ ప్రాంతానికి చెందిన వ్యాపారి భీమ్‌సింగ్‌(30), అదేప్రాంతానికి చెందిన చిన్నచిన్న పనులు చేసుకునే రితేష్ సింగ్‌(21), నిఖిల్‌సింగ్‌(26), వసుదేవ్‌సింగ్‌(26)తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. మే నెలలో ఒడిశాకు చెందిన ప్రేమసత్య ప్రసాద్‌ను కలిశాడు. తనకు ఎక్కువ మొత్తంలో గంజాయి కావాలని అతడిని కోరాడు. 


సత్యప్రసాద్‌ గోపీ చెప్పినంత గంజాయి నిల్వచేసి సమాచారమిచ్చాడు. గోపీ ముఠా ఒడిశాలోని చిట్టుకుంట వెళ్లి 340 కిలోల గంజాయి కొన్నారు. అనుమానం రాకుండా 20 బస్తాల జొన్నలు కొని ఆటోలో పెట్టారు. వాటి మాటున గంజాయి తీసుకొని నగరానికి వచ్చారు. 200 కిలోలు ఒకరి వద్ద, 140 కిలోలు ఇంకొకరి వద్ద దాచిపెట్టారు. గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సమాచారం అందగా దాడిచేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 340 కిలోల గంజాయి, ఆటో, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేసిన ప్రసాద్‌ పరారీలో ఉన్నాడు. 

Updated Date - 2020-07-14T16:22:02+05:30 IST