మొదటి రోజు 2,300

ABN , First Publish Date - 2020-10-03T09:11:56+05:30 IST

మహానగరంలో అధికారిక లెక్కల ప్రకారం మొత్తం ఆస్తులు 16.45 లక్షలు.

మొదటి రోజు 2,300

జీహెచ్‌ఎంసీలో ఆస్తుల నమోదు లెక్క

మొత్తం ఆస్తులు 16.45 లక్షలు

గడువులోగా పూర్తయ్యేనా?

వారం రోజులే గడువు

తొలిరోజు నమోదుపై కమిషనర్‌ సీరియస్‌

నేటి నుంచి కంట్రోల్‌ రూమ్‌

బిల్‌ కలెక్టర్లకు క్షేత్రస్థాయిలో అడ్డంకులు

కరోనా వేళ రావొద్దంటు పౌరుల అభ్యంతరం


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 3 (ఆంధ్రజ్యోతి): మహానగరంలో అధికారిక లెక్కల ప్రకారం మొత్తం ఆస్తులు 16.45 లక్షలు. 


మొదటి రోజు నమోదు చేసిన 

ఆస్తుల వివరాలు 2,300

ఆస్తుల నమోదు పూర్తి చేయాల్సిన 

గడువు - 10 రోజులు. 


మొదటి రోజు తరహాలో ఆస్తులు నమోదు ప్రక్రియ కొనసాగితే గ్రేటర్‌ మొత్తం ఆస్తుల నమోదు ఎప్పటి వరకు పూర్తయ్యేను అన్న ప్రశ్న ఉదయిస్తోంది. పంచాయతీలు, ఇతర మునిసిపాలిటీలలో ఈ ప్రక్రియ జోరుగా సాగుతుండగా, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో నెంబర్‌ వన్‌ అని చెప్పే జీహెచ్‌ఎంసీ ఆస్తులను ఆన్‌లైన్‌ చేయడంలో విఫలమవుతోంది. గురువారం పూర్తిస్థాయిలో ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు ప్రకటించగా, యాప్‌ (ధరణి యాప్‌) డౌన్‌లోడ్‌ చేసుకున్న 280 మంది బిల్‌ కలెక్టర్లు(బీసీ), 100 మందికి పైగా ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు (టీఐ) కలిసి కేవలం 2,300 ఆస్తులు మాత్రమే నమోదు చేశారు. అంటే, ఒక్కొక్కరు కేవలం ఐదారు ఆస్తులు మాత్రమే నమోదు చేసినట్టు లెక్క. మరో 90 మందికి పైగా బీసీలు, 70 మంది టీఐల మొబైల్స్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ కాలేదు. శుక్రవారం దాదాపు 90 శాతానికిపైగా సిబ్బంది క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ ప్రారంభించారని ఓ అధికారి తెలిపారు.


అందుబాటులో టెక్నికల్‌ టీం

వ్యవసాయేతర ఆస్తుల సేకరణ వివరాల నమోదును పరిశీలించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పంచాయతీలు, ఇతర ముసిసిపాలిటీలో వివరాల నమోదు వేగంగా జరుగుతుంటే,  ఇక్కడ ఎందుకు జాప్యమవుతోందని మండిపడ్డట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నేటి నుంచి సాంకేతిక కంట్రోల్‌ రూమ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. కంట్రోల్‌ రూమ్‌లో మీ సేవా టెక్నికల్‌ టీంతోపాటు, జీహెచ్‌ఎంసీ ఐటీ, రెవెన్యూ విభాగాల ఉద్యోగులు ఉంటారు. బీసీ, టీఐ, ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను కంట్రోల్‌ రూమ్‌లో ఉన్న వారి దృష్టికి తీసుకెళ్తే, వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తారని ఓ అధికారి చెప్పారు. 


పన్ను చెల్లించే ఆస్తులు మాత్రమే..

గ్రేటర్‌లో పన్ను చెల్లిస్తోన్న ఆస్తులు 16.45 లక్షలు ఉన్నాయి. ఇప్పటికీ పన్ను మదింపు చేయని నిర్మాణాలు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటాయని అంచనా. ప్రస్తుతం ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌ (పీటీఐఎన్‌) ఉన్న ఆస్తుల వివరాలు మాత్రమే సేకరిస్తున్నారు. ఆస్తిపన్ను మదింపు కాని నిర్మాణాలు, ఓపెన్‌ ప్లాట్ల వివరాల సేకరణపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఉన్న 16.45 లక్షల ఆస్తుల వివరాలు గడువులోపు సేకరించడం ప్రస్తుత నమోదు ప్రక్రియను పరిశీలిస్తే అసాధ్యమన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో వెంటనే ఎన్యూమరేటర్లను నియమించి, వివరాల నమోదును వేగిరం చేయాలని భావిస్తున్నారు. 


పలు చోట్ల అభ్యంతరాలు

కరోనా నేపథ్యంలో బీసీ, టీఐలను ప్రజలు అనుమతించడం లేదు. ‘మీరు ఎక్కడెక్కడో తిరుగుతారు.. మా ఇళ్లకు ఎలా వస్తారు’ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇళ్ల వద్దకు రానివ్వడం లేదని పలువురు బీసీలు చెప్పారు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఈ తరహా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. కాచిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన ఓ బిల్‌ కలెక్టర్‌ను అక్కడి సెక్యురిటీ గార్డ్‌ లోనికి అనుమతించకపోవడంతో ఆమె చేసేదేమీ లేక వెనుదిరిగినట్టు సమాచారం. మరో ప్రాం తంలోని అపార్ట్‌మెంట్‌లో జీహెచ్‌ఎంసీ నుంచి ఎవరో వచ్చారన్న సమాచారంతో అసోసియేషన్‌ ప్రతినిధి ఒకరు కిందకు వచ్చి అందరి వివరాలు సేకరించి మీకు ఫోన్‌ చేస్తామని వెనక్కి పంపించాడు. 


అవాంతరాలు.. అవస్థలు

ఆస్తుల నమోదులో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. సాంకేతిక ఇబ్బందులతో వివరాల నమోదుకు అరగంట నుంచి గంటకుపైగా సమయం పడుతోందని ఓ బిల్‌ కలెక్టర్‌ చెప్పాడు. ‘మేం వెళ్లిన తర్వాత యజమానులు వాటర్‌, విద్యుత్‌ బిల్లు, ఆధార్‌ కార్డు వెతుకున్నారు. ఇది కూడా ఆలస్యానికి ఒక కారణం’ అని పేర్కొన్నారు. సర్వర్‌ డౌన్‌ ఉండడంతో కొన్నిసార్లు యాప్‌ ఓపెన్‌ కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ లేకపోవడంతో ఫోన్లలో మొబైల్‌ డేటా కనెక్టవడం లేదు. రెండురోజు కూడా మెజార్టీ బీసీలు 8 నుంచి 12 ఆస్తుల వివరాలు మాత్రమే నమోదు చేసినట్టు సమాచారం. ఇప్పటికీ కొందరి ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడ్‌ కాకపోవడం గమనార్హం. 

Updated Date - 2020-10-03T09:11:56+05:30 IST