ఎంసెట్‌ టాపర్‌ మనోడే

ABN , First Publish Date - 2020-10-07T08:35:46+05:30 IST

తెలంగాణ ఎంసెట్‌ 2020 ఫలితాల్లో నగర విద్యార్థి టాపర్‌గా నిలిచాడు. టాప్‌ 10 ర్యాంకుల్లో మొదటి ర్యాంకుతో పాటు 4

ఎంసెట్‌ టాపర్‌ మనోడే

మొదటిర్యాంకుతో పాటు మరో మూడు...

 ఎంసెట్‌ టాప్‌ 10లో నగరానికి నాలుగు ర్యాంకులు 

 గత రెండేళ్లతో పోల్చితే తగ్గిన వైనం


రెజిమెంటల్‌బజార్‌/హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 6 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఎంసెట్‌ 2020 ఫలితాల్లో నగర విద్యార్థి టాపర్‌గా నిలిచాడు. టాప్‌ 10 ర్యాంకుల్లో మొదటి ర్యాంకుతో పాటు 4, 5, 8 ర్యాంకులు నగర విద్యార్థులు సాధించారు. అయితే రెండేళ్లతో పోల్చితే నగరానికి వచ్చే ర్యాంకులు తగ్గాయి. 2018లో టాప్‌ 10లో ఆరు, 2019లో ఏడు ర్యాంకులను నగర విద్యార్థులు సాధించారు. ఈ ఏడాది టాప్‌ 10లో కేవలం  నలుగురు మాత్రమే చోటుదక్కించుకున్నారు. నగరానికి చెందిన వారణాసి సాయితేజ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు సాధించాడు. 93.37 కంబైన్డ్‌ స్కోర్‌తో తెలంగాణ ఎంసెట్‌ టాపర్‌గా నిలిచాడు.


లాన్సర్‌ కాలనీ సికింద్రాబాద్‌కు చెందిన చాగరి కౌశల్‌కుమార్‌ రెడ్డి 4వ ర్యాంకు, జేఈఈలో తెలంగాణ నుంచి మొదటి ర్యాంకు సాధించిన హార్దిర్‌ రాజ్‌పాల్‌ 5వ ర్యాంకు, మాదాపూర్‌ కావూరీహిల్స్‌ ప్రాంతానికి చెందిన అన్నం శ్రీవర్ధన్‌ 8వ ర్యాంకు సాధించారు. ప్రభుత్వ గురుకుల కాలేజీలో చదివే విద్యార్థులతో పాటు ప్రభుత్వ కాలజీల్లో చదివిన విద్యార్థులకూ మెరుగైన ర్యాంకులు వచ్చాయి.

గౌలిదొడ్డిలోని గురుకుల కాలేజ్‌ విద్యార్థులు సైతం పలు ర్యాంకులు సాధించారు. నిరంజన్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో 905వ ర్యాంకు సాధించాడు.


 స్టార్టప్‌ కంపెనీని ప్రారంభించాలి : వారణాసి సాయితేజ 

కాలేజీలో ఇచ్చిన షెడ్యూల్‌ను మిస్‌ అవ్వకుండా చూసుకునే వాడిని. ఏకాగ్రతతో రోజుకు 8 గంటల పాటు చదివే వాడిని. తల్లిదండ్రుల ప్రోత్సాహం, టీచర్ల పర్యవేక్షణతో ఈ ర్యాంకు సాధించాను. లాక్‌డౌన్‌ వల్ల పరీక్షలు ఆలస్యం కావడంతో చదువుకునేందుకు మరింత సమయం దొరికింది. ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా లెక్చరర్లు అనుమానాలను తీర్చేవారు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో చేరాలనుకుంటున్నాను. ఐటీ స్టార్టప్‌ కంపెనీని ప్రారంభించాలన్నది నా కోరిక.


 లాజిక్‌తో చదవాలి : కౌశల్‌కుమార్‌ రెడ్డి 

ఇంజినీరింగ్‌ విభాగంలో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో సొంతంగా ఆవిష్కరణలు చేయాలనేది నా లక్ష్యం. రోజూ 8-9 గంటలు చదివాను. కాలేజీలో నిర్వహించే పరీక్షలలో జరిగే తప్పులను గుర్తించి పునరావృతం కాకుండా చూసుకోవడం వలన ర్యాంకు సాధించాను. ఐఐటీ రూర్కిలో గాని, మద్రాస్‌లో గాని సీటు వచ్చే అవకాశముంది. అమ్మ శ్రీలత ట్రాన్స్‌కో ఉద్యోగిని. తండ్రి నీలకంఠ రెడ్డి సీనియర్‌ ప్రొఫెసర్‌. సికింద్రాబాద్‌లోని లాన్సర్‌కాలనీలోని రైల్వే క్వార్టర్స్‌లో ఉంటున్నాము.


 నాపై నాకు నమ్మకం పెరిగింది : హార్దిక్‌ రాజ్‌పాల్‌

తెలంగాణ నుంచి జేఈఈలో మొదటి ర్యాంకు ఆలిండియా 6వ ర్యాంకు సాధించాను. ఎంసెట్‌ రాసిన తర్వాత నాకు మంచి ర్యాంకు వస్తుందన్న నమ్మకం వచ్చింది. ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరాలనుకుంటున్నాను. నాన్న సీనియర్‌ చార్టెడ్‌ ఎకౌంటెంట్‌, అమ్మ ప్రవేటు ఉద్యోగిని. ఎంసెట్‌లో 5వ ర్యాంకు వచ్చిందని తెలియగానే నాపై నాకు నమ్మకం పెరిగింది. 


 పరీక్షలు ఆలస్యం కావడంతో : అన్నం శ్రీవర్ధన్‌

జేఈఈలో ఓపెన్‌ క్యాటగిరీలో 93వ ర్యాంకు వచ్చింది. ఐఐటీ ముంబైలో సీటు వస్తుందని అనుకుంటున్నాను. లాక్‌డౌన్‌ కారణంగా పరీక్షలు లేట్‌గా జరిగాయి. అనుకోకుండా కలిసి వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. రోజుకు 10 నుంచి 12 గంటలు చదివేవాడిని. కాలేజ్‌ నుంచి లెక్చరర్లు అన్ని విధాల సహకరించారు. ఆన్‌లైన్‌ క్లాసులతోపాట, టెస్ట్‌లు పెట్టి పరీక్షలకు ప్రిపేర్‌ చేశారు. తల్లిదండ్రులు చదువు విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. 


ఏడాది టాప్‌ 10లో ర్యాంకులు ర్యాంకులు

2018 6 1, 2, 4, 7, 9, 10.

2019 7 2, 3, 4, 6, 7, 9, 10.

2020 4 1, 4, 5, 8.Read more