డ్యూటీని కష్టంగా కాదు ఇష్టంగా చేయాలి

ABN , First Publish Date - 2020-10-31T07:57:33+05:30 IST

పోలీసు అధికారులు ప్రజలకు సేవ చేయడంలో ఉన్న ఆనందాన్ని పొందగలిగితే జీవితాంతం డ్యూటీని ఆనందంగా చేయొచ్చని సీపీ అంజనీకుమార్‌ అన్నారు

డ్యూటీని కష్టంగా కాదు ఇష్టంగా చేయాలి

విధుల్లో చేరిన ప్రొబేషనరీ ఎస్సైలకు సీపీ మార్గదర్శనం


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): పోలీసు అధికారులు ప్రజలకు సేవ చేయడంలో ఉన్న ఆనందాన్ని పొందగలిగితే జీవితాంతం డ్యూటీని ఆనందంగా చేయొచ్చని సీపీ అంజనీకుమార్‌ అన్నారు. బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా విధుల్లో చేరిన 202 ప్రొబేషనరీ సబ్‌ ఇన్పెక్టర్లతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిక్రూట్‌మెంట్‌ లో పెద్ద సంఖ్యలో మహిళలు ఎంపికయ్యారని, ఇది చాలా మంచి పరిణామమన్నా రు. ఎన్నో ఆశలతో, ఆశయాలతో విధుల్లో చేరిన వారు చివరి వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. అందరూ ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో విధుల్లో నిమగ్నమై ఉండాల్సి వస్తుందని తెలిపారు. గడిచిన 9 నెలలుగా పోలీస్‌ అకాడమీలో, జిల్లాల్లో, గ్రేహౌండ్స్‌ శిక్షణలో నేర్చుకున్న విషయాలను ఇక్కడ ప్రతిఫలించేలా పనిచేయాలన్నారు. డ్యూటీని కష్టంగా కాకుండా ఇష్టంతో చేయాలన్నారు. అన్ని విభాగాలతో పోలిస్తే పోలీస్‌ శాఖలో పనిచేయడం తృప్తిగా ఉంటుందన్నారు. వెయ్యి మంది నేరస్థులు తప్పించుకున్నా ఫర్వాలేదు కానీ.. ఒక నిరపరాధికి శిక్ష పడకూడదన్నారు. ప్రతి ఒక్కరూ మంచి పోలీస్‌ ఆఫీసర్లుగా కొనసాగుతారని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీటీసీ అడిషనల్‌ డి.సునీతా రెడ్డితోపాటు ప్రొబేషనరీ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Read more