డిలే రెస్పాన్స్ ఫోర్స్
ABN , First Publish Date - 2020-05-18T08:41:12+05:30 IST
దేశంలో ఏ నగరానికి లేని విధంగా అత్యవసర సమయంలో సత్వరమే స్పందించేందుకు జీహెచ్‌ఎంసీ రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన విభాగం రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్‌ఎఫ్).

చిన్న విపత్తును ఎదుర్కోవడంలో విఫలం
కొనసా...గిన పనులు
రోడ్లపైనే విరిగిపడిన చెట్లు
ప్రజలకు తప్పని ఇబ్బందులు
హైదరాబాద్ సిటీ, మే17 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఏ నగరానికి లేని విధంగా అత్యవసర సమయంలో సత్వరమే స్పందించేందుకు జీహెచ్‌ఎంసీ రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన విభాగం రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్‌ఎఫ్). అయితే.. శనివారం నాటి గాలివాన బీభత్సం తర్వాత డీఆర్‌ఎఫ్ బృందం అనుకున్నంత వేగంగా పనులు చేయలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నపాటి విపత్తుకే పరిస్థితి ఇలా ఉంటే రానున్న వర్షాకాలంలో నగర వ్యాప్తంగా సమస్యలు ఎదురైతే ఏ మేరకు పరిష్కరిస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నగరంలో శనివారం మధ్యాహ్నం గంట పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలడంతో పాటు స్తంభాలు నెలకొరిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరి అత్యవసర వాహనాలూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిం ది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, రామంతాపూర్, ప్రశాసన్‌నగర్, అల్వాల్, బల్కంపేట, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున చెట్లు కూలిపోయాయి. మధ్నాహ్నం వర్షం తర్వాత సాయంత్రం నాలుగు గంటలకే జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన డీఆర్‌ఎఫ్ సరైన రీతిలో స్పందించి, పనులు పూర్తి చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో శనివారం రాత్రి వరకు కూడా సమస్యలు అలాగే ఉన్నాయి. రోడ్లపై పడిపోయిన చెట్లు అలాగే ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం రాత్రి వరకు చెట్లను తొలగించినా.. కొమ్మలు మాత్రం రోడ్ల పక్కనే అలాగే వదిలేశారు. సమస్య ఎదురై 24 గంటలు గడిచినా.. పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు.
ఇదీ డీఆర్‌ఎఫ్..
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాన్ని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. పోలీసు, టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులే కాకుండా దాదాపు 400మంది వర్క్ ఫోర్స్ విభాగంలో పని చేస్తున్నారు. ఇందులో నుంచి జోన్‌కు రెండు చొప్పున క్విక్ రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరితో పాటు అత్యవసర పరిస్థితుల్లో పని చేసేందుకు డైరెక్టరేట్ పరిధిలో ఒక డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను (డీఆర్‌ఎఫ్) ఏర్పాటు చేశారు. 120 మంది మంది ప్రత్యేక సిబ్బంది, ఎనిమిది వాహనాలు, విపత్తులను ఎదుర్కోవడానికి అవసరమైన సామగ్రిని సమకూర్చారు. జీహెచ్‌ఎంసీలోని విద్యుత్, ట్రాన్స్‌పోర్ట్ విభాగాల్లో ఉన్న అదనపు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
శనివారం నాటి వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో 70 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఏడు ట్రాన్స్‌పార్మర్లు దెబ్బతిని ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తింది. ఈ క్రమంలో సుమారు వంద మంది డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాల ఇంజనీర్లు, సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం వరకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.