ఈ మూడు నెలల్లో..15 వందల పేజీలు రాశా..!

ABN , First Publish Date - 2020-06-09T10:56:22+05:30 IST

లాక్‌డౌన్‌తో మాకు పెద్ద సమస్యేమీ లేదు. ఎందుకంటే, నేను ‘శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధిని సంస్కృత కాలేజీ’ ప్రిన్సిపాల్‌గా రిటైర్‌

ఈ మూడు నెలల్లో..15 వందల పేజీలు రాశా..!

పురాణ గ్రంథాలను అనువదిస్తున్నా 

డాక్టర్‌ కందాడై రామానుజాచార్య 


సంస్కృతంలో పోగుపడిన భారతీయ సనాతన ధర్మశాస్త్ర విజ్ఞానాన్ని పిడికిట పట్టి, తెలుగు వారి లోగిళ్ల ముందు కుమ్మరిస్తోన్న ఆధ్యాత్మిక వేత్త, సంస్కృత పండితుడు డాక్టర్‌ కందాడై రామానుజాచార్య. లాక్‌డౌన్‌లో పవిత్ర పురాణ గ్రంథ అనువాదంలో నిమగ్నమైన ఆయన్ను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. ‘శృతప్రకాశిక’ వ్యాఖానం ప్రత్యేకత, భారతీయ సనాతన ధర్మశాస్త్రాల వైశిష్ట్యంతో పాటు తన దైనందిన జీవితంలోని కొన్ని విశేషాలను రామానుజాచార్య పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి) : లాక్‌డౌన్‌తో మాకు పెద్ద సమస్యేమీ లేదు. ఎందుకంటే, నేను ‘శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధిని సంస్కృత కాలేజీ’ ప్రిన్సిపాల్‌గా రిటైర్‌ అయి ఇంచుమించు పద్దెనిమిదేళ్లు. తర్వాత రెండేళ్లు స్పెషల్‌ ఆఫీసర్‌గానూ కొనసాగా. అప్పుడు చిన్న జీయర్‌ స్వామి వంటి కొందరు పెద్దలు తమ సంస్థల్లో చేరమని అడిగారు. అయితే, ‘నేను మళ్లా ఉద్యోగం చేయను. నాకు చాలా పనులున్నాయి. ధర్మ ప్రచారం చేయాలి. వ్యాస భగవానుడి పురాణాలపై ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అలా కాకుండా, కొన్ని పురాణాల్లోని మూల శ్లోకాలను, వాటి తాత్పర్యాలతో సహా రాయాలి. అవిగాక మన పురాణాల్లో ఎనిమిది వేల వ్రతాలున్నాయి. సూర్యభగవానుడిపై పన్నెండు వేల శ్లోకాలున్నాయి. వాటితో పాటు నదులు, మాసాల వైశిష్ట్యం గురించి చాలా మందికి తెలియదు. కనుక ఆ సంస్కృత శ్లోకాల్లో కొన్నైనా తెలుగులోకి అనువదించే పనిలో ఉంటా’’ అని వాళ్లకు చెప్పాను. తర్వాత కొందరు దాతలు కోరితే, ‘భాగవతం’, ‘పద్మపురాణం’, ‘నారదపురాణం’, ‘కూర్మపురాణం’, ‘స్కాందపురాణం’, ‘హరివంశ మహాపురాణం’, ‘లక్ష్మీతన్త్రమ్‌’, ‘పరాశరస్మృతి’ అనువాదం చేసిచ్చాను. అవన్నీ పుస్తకాలుగా వచ్చాయి. నా ఆసక్తి మేరకు ‘ఏకాదశి వైభవం’ పేరుతో పన్నెండు వేల శ్లోకాలను అనువదించాను. ఇప్పుడు ఆ బుక్‌ ప్రింట్‌ అవుతోంది. ‘విష్ణుపురాణాని’కి వ్యాఖ్యానం ‘విష్ణుచిత్తీయం’ నా అనువాదం రెండు సంపుటాలు పదిరోజుల కిందట విడుదలయ్యాయి. 


లాక్‌డౌన్‌తో లాభం..

పరబ్రహ్మ అంటే ఏమిటో సూత్రరూపంలో వివరిస్తూ వ్యాసమహర్షి రాసిన ‘బ్రహ్మసూత్రం’కి భగవత్‌ రామానుజాచార్య రాసిన వ్యాఖ్యానాన్ని ‘శ్రీభాష్యం’ అంటారు. ఇది చాలా ప్రసిద్ధి. దీనిపై వ్యాఖ్యానం చేయడం అంత సులువు కాదు. రామానుజుని శిష్యపరంపరకి చెందిన సుదర్శనసూరి ‘శ్రీభాష్యాని’కి ‘శృతప్రకాశిక’ పేరుతో వ్యాఖ్యానం రాశారు. అందులో 545 సూత్రాలుంటాయి. ఎంతోమంది మహానుభావులు ‘శృతప్రకాశిక’ను తెలుగులోకి అనువదించాలని ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. కానీ ఒక మహాపండితుడు, నాకు గురు సమానులు వరంగల్‌కి చెందిన నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్య (ఇప్పుడు లేరు) ఒక సూత్రానికి వ్యాఖ్యానం రాశారు. అవి ఐదు సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. రెండేళ్ల కిందట ఒకసారి వారిని పలకరిద్దామని వెళ్లాను. అప్పుడు ఆయన నాతో ‘‘నీకు ఒక భారం అప్పచెబుతున్నాను. ‘శృతప్రకాశిక’ను తెలుగులోకి అనువదించాలి. ఆ పని నీవే పూర్తి చేయగలవు’’ అన్నారు. అందుకు ‘‘సరే’’ అన్నాను. ఇప్పుడు నేను ఏడాదిగా ‘శృతప్రకాశిక’ ని తెలుగీకరించే పనిలో ఉన్నా. లాక్‌డౌన్‌కి ముందు ఎవరైనా పిలిస్తే ప్రవచనాలు చెప్పడానికో, ధర్మప్రచారానికో వెళ్లడం. ఇంటికొచ్చిన వాళ్లతో మాట్లాడటం. మిగతా సమయమంతా రాసుకునేవాడిని.  లాక్‌డౌన్‌వల్ల నాకేమి లాభం అంటే, నా పనికి విఘ్నం కాలేదు. ఇప్పుడు నా వద్దకి ఎవరూ రారు. కనుక హాయిగా రాసుకుంటున్నా. నా భార్య సుమతి కూడా నాతో ఏమైనా మాట్లాడాలంటే, నేను రాయడం ఆపేసిన తర్వాతే పలకరిస్తారు. ఒక్కోసారి సమయం మరిచి, అర్థరాత్రి ఒంటిగంట వరకూ రాస్తూ కూర్చుంటా. అప్పుడు ఆమె ‘ఇవాళ నిద్రపోయే ఆలోచన మానుకున్నారా’’ అంటారు. ఇక నేను పని ఆపేసి, నిద్రకి ఉపక్రమిస్తా. నా భార్య సహకారంతోనే నేను ఈ మహా గ్రంథాలను అనువదించగలుగుతున్నాను. ఆమె తోడ్పాటు లేకుంటే నేనేమీ చేయగలను.! ఈ మూడు నెలల్లో 1,500 పేజీలు రాశాను. ఇప్పటి వరకు ఇంచుమించు నాలుగు వేల పేజీలు పూర్తి అయ్యా యి. ఇంకొక మూడు వేల పేజీలు రాయాలి. వీలైనంత త్వరలోనే అవన్నీ తొమ్మిది సంపుటాలుగా వెలువడతాయి. ఉపనిషత్తులకు భాష్యం అనువదించాలని నా కోరిక. త్వరలోనే ఆ పనీ మొదలుపెడతా. 


ధర్మప్రబోధం...

నన్ను తీర్చిదిద్దింది మా గురువు శ్రీమాన్‌ కోయిల్‌ కందాడై శఠకోప రామానుజాచార్య. ‘‘ధర్మ ప్రచారం చేయి. ఎవరొచ్చి అడిగినా... నాకు రాదు, తెలియదు, చెప్పను అని మాత్రం అనకు. ఒకవేళ నీకు తెలియని విషయమైతే, నేర్చుకొని చెప్పు. మన జ్ఞానార్జన పదిమందికి చెప్పడానికే, దాచుకోడానికి కాదు’’ అని ఉపదేశించారు. ఇప్పటికీ ఆయన ఆజ్ఞ శిరసావహిస్తున్నాను. దాదాపు ఇరవై ఏళ్లుగా కొన్ని టెలివిజన్‌ కార్యక్రమాలు, మరికొన్ని పత్రికల కాలమ్స్‌ ద్వారా భక్తుల ధర్మసందేహాలు తీరుస్తున్నా. అమెరికాలోని కొందరు తెలుగు వాళ్లు అడిగితే, తొమ్మిదేళ్లు ‘రామాయణం’, ‘శ్రీభాష్యం’, ‘ధర్మశాస్త్రాలు’ ఆన్‌లైన్లో బోధించాను. కొన్నేళ్లు బాగ్‌ అంబర్‌పేట్‌లోని ‘అహోబిల మఠం’లో ‘భాగవతం’ చెప్పాను. కొంతమంది కోరిక మేరకు, ఇప్పుడు ‘శ్రీవచనభూషణం’, ‘తత్వత్రయం’, ‘గురుభావ ప్రకాశిక’, ‘పరిభాషేందు శేఖరం’ పురాణాలను రోజూ  రెండు గంటలు ఆన్‌లైన్లో చెబుతున్నాను. నా జీవితమంతా ధర్మ అధ్యయనం, ధర్మ ప్రబోధమే. 


రోజువారీ జీవితంలో..

తెల్లవారుజాము ఐదింటికి నిద్రలేస్తాను. ఒక అరగంట ఇంట్లో నే నడుస్తా. ఆరు నుంచి ఎనిమిదింటి వరకు ఆన్‌లైన్లో ప్రవచనాలు చెబుతున్నా. కొన్నిసార్లు ఆ పనిలేకపోతే రాసుకుంటా. తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించి, పూజలో కూర్చుంటా. పదింటికి పూజ ముగించుకొని, అల్పాహారం తీసుకుంటా. అందులో దద్దోజనం, పొంగల్‌, ఉప్మా, చపాతీ, ఇడ్లీ, ఊతప్పం.. ఇలా ఇంట్లో ఏమి వండితే అవి తింటాను. అనారోగ్యం వల్ల ఇప్పుడు ఉప్పు, కారం, పులుపు చాలా వరకు తగ్గించాను. మధ్యాహ్నం 1.30కి భోజనంలో ఒక తొక్కు, కూరతో అన్నమే తింటాను. చలువ కనుక మజ్జిగ పులుసు రెగ్యులర్‌గా తీసుకుం టా. రెండు గంటలకి టీవీలో ‘మహాభారతం’ చూస్తాను. తర్వాత కాసేపు నిద్రపోతా. సాయంత్రం నాలుగింటి నుంచి మళ్లీ రాసుకోవడం మొదలవుతుంది. రాత్రి భోజనంలో చపాతీ, ఇడ్లీ వంటి అ ల్పాహారమే తీసుకుంటా. అప్పుడు కాసేపు వార్తలు చూస్తా. తిరిగి రాతపనిలో కూర్చుంటా. ఇప్పుడు రోజుకి సుమారు ఏడు నుంచి ఎనిమిది గంటలు రాయడంతోనే సరిపోతోంది. నేను మొదటి నుంచి బయట ఆహారం కాదు కదా, మంచినీళ్లు కూడా ముట్టను. 


సనాతనమే సరైన మార్గం..

కరోనా నివారణకు ప్రభుత్వం ఎలాంటి నియమాలు విధించిందో, అవన్నీ సనాతన వేద సంప్రదాయాలే. బయట నుంచి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్లు, చేతులు కడుక్కోవాలి. ఇతరులతో మాట్లాడేప్పుడు నోటికి వస్త్రం అడ్డుపెట్టుకోవాలి. నోట్లో, ముక్కులో, చెవిలో, కంట్లో వేళ్లు పెట్టుకోకూడదు. ఇవన్నీ మన పెద్దలు చెప్పినవే.  మన ఆచార సూత్రాలన్నీ ఆరోగ్యసూత్రాలే. శాస్త్రజ్ఞానం లేనివాళ్లు వీటిని మూఢాచారమని, ఛాందస్తమని అన్నారు. ఇప్పుడు అదే సైన్స్‌ అయింది. ఎప్పటికైనా ప్రపంచాన్ని కాపాడేది భారతదేశ విజ్ఞాన శాస్త్రమే. పాశ్చాత్యుల పద్ధతే చూడండి.. ఊరంతా తిరిగి, ఆ బూట్లు, సాక్సులతోనే నేరుగా ఇంట్లోకి వెళితే రోగాలు రాక మరేం వస్తాయి. మన సంప్రదాయంలో షేక్‌హ్యాండే లేదు. ‘రామాయణం’ మొత్తంలో రాముడు ఒక్క సుగ్రీవుడితో మాత్రమే కరచాలనం చేశాడు. అదీ, షేక్‌హ్యాండ్‌ వానర ఆచారం కనుక. మన సైన్స్‌ రోగాలు పెంచిందా, తగ్గించిందా.! ఒక చిన్న క్రిమి వచ్చి, ప్రపంచాన్ని ఒణికిస్తోంది. అంటే, ‘మీ బతుక్కి ఇది చాలురా’ అని భగవంతుడు మనిషిని అన్నట్లేగా. సైన్స్‌, అభివృద్ధి, విజ్ఞానం అంతా ఒక్క క్రిమి ధాటికి తలవంచాయి కదా.! ఈ ఉపద్రవాలకి సనాతన భారతీయ సంప్రదాయమే ప్రత్యామ్నాయం. అదే మనమంతా ఆచరించాలి. 


హోమధూమం.. క్రిమి సంహారం...

మన పురాణాల్లో రకరకాల క్రిముల ప్రస్తావన ఉంది. అందు లో మన పెద్దలు వాటి పరిష్కార మార్గాలనూ సూచించారు. అయితే, ఆ నివారణా చర్యలు చేయమంటే వీళ్లు చేయరు. మశూచిక, విశూచిక, సూక్ష్మవేధిని, హృదయభేదిని, సీతవ్యాపిని, కాస ము, శ్వాస తదితర ఆరోగ్య సమస్యలు క్రిమి వల్ల తలెత్తే వ్యాధు లు, నివారణా మార్గాలను ‘బ్రహ్మాండపురాణం’, ‘పద్మపురాణం’, ‘బ్రహ్మపురాణం’ తదితర ప్రాచీన గ్రంథాల్లో వివరించారు. సరైన ఆహారం సమయానికి తీసుకొని, పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తవని మన పూర్వీకులు పలు గ్రంథాల్లో వివరించారు. మితిమీరిన మాంసభక్షణ, ద్వేషం, వైరం, వాంఛ, మద్యపానం రోగాలకు ప్రధాన కారణం. కరోనా వంటి వైర్‌సలకు పెద్ద వ్యాక్సిన్‌ హోమధూమం.


ప్రతివాడలో పెద్ద హోమం చేసినప్పుడు, ఆ హోమధూమం అక్కడంతా ప్రసరిస్తే... చుట్టూ ఉన్న క్రిములన్నీ చనిపోతాయి. ఇప్పుడు కూడా వైరస్‌ నిర్మూలన కోసం ఐదు రోజులు, వారం, తొమ్మిది రోజులు... అలా ప్రతి ఊరు-వాడ అంత టా హోమాలు జరగాలి. నెయ్యితో పాటు వరిపేలాలు, గోధుమపిండి, మినపప్పు, అలిసింతల మిశ్రమాన్ని హోమంలో వేస్తారు. దాన్నుంచి వెలువడే పొగ అంతటా వ్యాపించినప్పుడు హానికర క్రి ములన్నీ పోతాయి. అందుకే హోమం చేయండని చెప్పాను. మనవాళ్లకు హోమాలంటే పడదు కదా.! కొన్ని కోట్లరూపాయలు పరిశోధనలకు మాత్రం కేటాయిస్తారు. కానీ ఇలాంటి సనాతన ఆచారాలు మనవాళ్లకు పట్టవు. 

Updated Date - 2020-06-09T10:56:22+05:30 IST