నిరుపేదల నిరీక్షణ

ABN , First Publish Date - 2020-12-11T06:09:59+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు

నిరుపేదల నిరీక్షణ

డ‌బుల్ ఇళ్ల కేటాయింపు ఎప్పుడు..?

గతంలోనే లక్షలాది మంది దరఖాస్తు

లబ్ధిదారుల ఎంపిక దిశగా పడని అడుగులు

పూర్తయిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు

విభిన్న ఫలితాలతో పునరాలోచన

కేటాయింపు ఇప్పట్లో కష్టమే అంటున్న అధికార వర్గాలు

కొందరికి ఇస్తే.. మెజార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం


డిసెంబర్‌ నాటికి 75 వేల రెండు పడకల ఇళ్లు సిద్ధమవుతాయి. దశల వారీగా అర్హులకు అందజేస్తాం - పలు సమావేశాల్లో పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు. 

ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడడం లేదు. నిరుపేదల ఆత్మగౌరవ గృహాల కేటాయింపులో  నిర్లక్ష్యం కనిపిస్తోంది. అన్ని పనులు పూర్తయి 40 వేల ఇళ్లు సిద్ధంగా ఉన్నా.. లబ్ధిదారుల ఎంపిక మొదలు కాలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇళ్ల కేటాయింపు ఇప్పట్లో ఉంటుందా..? అంటే కచ్చితంగా ఉంటుందని చెప్పలేమని ఉన్న తస్థాయి అధికార వర్గాలు సమాధానమిస్తున్నాయి. దశల వారీగా కేటాయిస్తారా..? అన్ని ఇళ్ల పనులు పూర్తయిన అనంతరమా..? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదని పేర్కొన్నారు. 

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు నిరుపేదలు ఆత్మగౌరవంగా నివసించేందుకు రెండు పడకల ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించింది. అప్పట్లో ఎన్నికైన పాలకమండలి గడువూ త్వరలో పూర్తవుతుంది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెల్లడయ్యాయి. రెండు నెలల అనంతరం కొత్త పాలకమండలి కొలువుదీరే అవకాశమూ ఉంది. అయినా ఇళ్ల కేటాయింపు విషయం చర్చకు రావడం లేదు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేటాయింపు ఇప్పట్లో ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిమాండ్‌కు సరిపడా ఇళ్లు అందుబాటులో లేకపోవడం, కొందరికి అలాట్‌ చేస్తే మిగతా వాళ్లకు ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావన కలుగుతుందన్న యోచనా ఓ కారణంగా చెబుతున్నారు. 


లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడు..?

రెండు పడకల ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించిన అనంతరం గ్రేటర్‌ పరిధిలో ఆరు లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. వారిలో ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ఇల్లు అందలేదు. నగరంలోని 111 ప్రాంతాల్లో రూ. 9,714 కోట్లతో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థల వివాదం, కోర్టు కేసుల నేపథ్యంలో 2500 ఇళ్ల పనులు ప్రారంభం కాలేదు. 98 వేల ఇళ్లలో 8 వేలు ఇన్‌సిటు(అంతకుముందు ఉన్న రేకుల ఇళ్లు, గుడిసెలు కూల్చి వాటి స్థానంలో నిర్మించేవి) కాగా.. మిగతావి ఔటర్‌ ఆవల, లోపలి ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. వీటిలో 40వేల ఇళ్ల పనులు పూర్తయ్యాయి. నెలాఖరు లేదా వచ్చే నెల వరకు మరో 25 వేల ఇళ్లు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. రహదారులు, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ నెట్‌వర్క్‌, పార్కులు వంటి సదుపా యాలు కల్పిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో యూనిట్‌కు రూ.75 వేలు అదనంగా ఖర్చు చేస్తున్నారు. మొత్తంగా ఒక్కో ఇంటికి అంతస్తులను బట్టి రూ.8.3 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు పూర్తయిన ఇళ్ల కేటాయింపు చేపడతామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖను ఆదేశించారు. ఇంకా విధివిధానాలపైనా పూర్తిస్థాయి స్పష్టత రాలేదని చెబుతున్నారు. ఇన్‌సిటులో నిర్మించిన ఇళ్లు దాదాపు 2500 మంది లబ్ధిదారులకు అందజేశారు. ‘ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తుల వడపోత జరుగుతోంది. గతంలో ప్రభుత్వం నుంచి వాంబే, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, ఇందిరమ్మ, ఇతరత్రా ఇళ్లు తీసుకున్నారా..? లబ్ధిపొందిన వారి నుంచి వచ్చిన దరఖాస్తులెన్ని ఉన్నాయి’ అన్నది పరిశీలిస్తున్నామని ఓ అధికారి చెప్పారు. ఇంతకుముందు సర్కారు నుంచి ఇళ్లు పొం దిన వారికి రెండు పడకల ఇళ్లు ఇచ్చేది లేదని గతంలోనే ప్రకటించారు. ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు ఇస్తోంది. మొదటి విడతగా రూ.750 కోట్లు విడుదల చేసిన కేంద్రం... జాబితా పంపకపోవడంతో రెండో విడత నిధులను నిలిపివేసింది. 


బూత్‌ బంగ్లాలుగా మారే ప్రమాదం...

పూర్తయిన ఇళ్లను స్వాధీనం చేసుకోవాలని నిర్మాణదారులు జీహెచ్‌ఎంసీని కోరుతున్నారు. అక్కడ సెక్యురిటీ సిబ్బందిని ఏర్పాటుచేసి కాపలా ఉంచడం తమకు ఆర్థికంగా భారమవుతోందని ఇప్పటికే పలుమార్లు అధికారులతో పేర్కొన్నారు. సర్కారు విజ్ఞప్తి మేరకు లాభాపేక్ష లేకుండా సామాజిక బాధ్యతగా భావించి ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నది వారి అభిప్రాయం. పనులు పూర్తయిన అనంతరం వాచ్‌మెన్‌లు/గార్డులను ఏర్పాటు చేయకుంటే ఇళ్లలోని తలుపులు, నల్లాలు, స్విచ్‌ బోర్డులు, విద్యుత్‌ వైర్లు చోరీకి గురయ్యే ప్రమాదముంది. వాటిని కాపాడాలంటే భద్రతాపరమైన ఏర్పాట్లు చేయాల్సిందే. ఇది తమకు తలకు మించిన భారంలా మారుతుందని చెబుతున్నారు. సిద్ధమైన ఇళ్లను కేటాయించకుండా వదిలేస్తే పాడయ్యే అవకాశమూ ఉందంటున్నారు. గతంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంలో భాగంగా ఎల్లమ్మబండ, అ బ్దుల్లాపుర్‌మెట్‌, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్ల కేటాయింపు పూర్తి కాలేదు. ప్రస్తుతం అవి బూత్‌ బంగ్లాలను తలపిస్తున్నాయి. కేటాయింపు జరగని పక్షంలో రెండు పడకల ఇళ్ల పరిస్థితీ అలానే మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Updated Date - 2020-12-11T06:09:59+05:30 IST