గ్రేటర్‌లో విభిన్న వనాలు

ABN , First Publish Date - 2020-09-05T08:09:49+05:30 IST

విజ్ఞానం.. వినోదం.. ఆహ్లాదం.. ఆనందం.. సంస్కృతి.. సంప్రదాయాలను ప్రతిబింబించేలా, ఆయా అంశాలపట్ల

గ్రేటర్‌లో విభిన్న వనాలు

 ప్రత్యేక థీమ్‌లతో సరికొత్త పార్కులు

24 థీమ్‌లు.. 50 ఉద్యానవనాలు

15చోట్ల పనులు ప్రారంభం

ఆహ్లాదం.. ఆనందానికి కేరా్‌ఫగా.. 

సంప్రదాయం, సంస్కృతి చాటడం మరో ప్రత్యేకత


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 4 (ఆంధ్రజ్యోతి): విజ్ఞానం.. వినోదం.. ఆహ్లాదం.. ఆనందం.. సంస్కృతి.. సంప్రదాయాలను ప్రతిబింబించేలా, ఆయా అంశాలపట్ల అవగాహన కల్పించేలా ఉద్యానవనాల రూపకల్పనకు జీహెచ్‌ఎంసీ కసరత్తు ప్రారంభించింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందర్నీ ఆకట్టుకునేలా వినూత్న, విభిన్న థీమ్‌లతో సరికొత్త పార్కులను అభివృద్ధి చేయనుంది. మహిళల కోసం.. చారిత్రక నేపథ్యం వివరించేలా.. సైన్స్‌.. పూల వనం.. ఏడు వింతలు... ఇలా 24 థీమ్‌లు.. రూ.123 కోట్లతో గ్రేటర్‌కు నలు వైపులా 50 పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. పలు ఏజెన్సీలు సమర్పించిన వాటిలో 24 థీమ్‌లను అర్బన్‌ బయోడైవర్సిటీ విభాగం ఎంపిక చేసింది. ఇప్పటికే 15 ప్రాంతాల్లో పనులు ప్రారంభమయ్యాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వాకింగ్‌ ట్రాక్‌లు, బెంచీలు తదితర రెగ్యులర్‌ వసతులతోపాటు థీమ్‌ తరహా అభివృద్ధి ఈ పార్కుల ప్రత్యేకత. వాకింగ్‌ ట్రాక్‌లు, థీమ్‌లకు అవసరమైన పరికరాల ఏర్పాటు పనులు ఇంజనీరింగ్‌ విభాగం బాధ్యత కాగా.. మొక్కలు నాటడం, ల్యాండ్‌ స్కేపింగ్‌ వంటివి బయోడైవర్సిటీ విభాగం చూసుకుంటుంది. 


టొపియరీ పార్కు

పొదలతో వివిధ రకాల జంతువులు, ఏనుగు, హంస, ఒంటె, కంగారు, నెమలి, కుందేలు తదితర జంతువుల ఆకృతులను ఏర్పాటు చేస్తారు. పిరమిడ్‌లు, విభిన్న ఆకృతులతో సందర్శకులను ఆకట్టుకునేలా ఈ పార్కులు ఉంటాయి. 


కలర్స్‌.. 

విభిన్న రంగులతో ఆకర్షణీయంగా ఈ పార్కు ఉంటుంది. ఇంధ్ర ధనస్సు, జెయింట్‌ వీల్‌, రోలర్‌ కోస్టర్‌, ఫన్‌ ఫెయిర్‌ వంటి ఈ పార్కులో ప్రత్యేకం. కుర్చీలు, షెడ్డులూ విభిన్న రంగులతో ఏర్పాటు చేయనున్నారు. 


మహిళల కోసం..

మహిళల కోసం ఈ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఉదయం, సాయంత్రం నడకతోపాటు ఓపెన్‌ జిమ్‌, ఆటలు తదితర వసతులు కల్పిస్తారు. 


మొఘల్‌ గార్డెన్‌..

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మొఘల్‌ గార్డెన్‌ ఉంది. వివిధ రకాల మొక్కలు ఈ గార్డెన్‌లో ఏర్పాటు చేస్తారు. ఒకే రకానికి చెందిన వేర్వేరు జాతుల మొక్కలు వీలైనన్ని ఎక్కువగా ఉంటాయి. తెలుపు, ఎరుపు, క్లైంబింగ్‌, ఫ్లోరిబండ, గ్రంఽధాఫ్లోరా, గ్రౌండ్‌ కవర్‌, డేవిడ్‌ అస్టిన్‌ తదితర జాతుల గులాబీ మొక్కలు ఏర్పాటు చేస్తారు. వేర్వేరు రకాల మొక్కలతోపాటు సేదతీరేందుకు చేసే ఏర్పాట్లు పర్షియన్‌ శైలిలో ఉంటాయి. 


సైన్స్‌ థీమ్‌ పార్కు

విజ్ణానాన్ని పంచేలా ఈ పార్కులు ఉంటాయి. రోబోటిక్‌ పరిజ్ఞానం ఎలా పనిచేస్తుంది..? టెలిస్కోప్‌, ఫిక్షన్‌, 3డీ యానిమేషన్‌ వంటి థీమ్‌లతో పార్కు ఉంటుంది. నీటి శుద్ధి, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలూ ఉంటాయని ఓ అధికారి తెలిపారు, 


మరిన్ని థీమ్‌లు..

జపనీస్‌ థీమ్‌ పార్కు, బాంబు గార్డెన్‌, మల్టీ జనరేషన్‌ పార్కు, షేడ్‌ గార్డెన్‌, ఇంటరాక్టివ్‌ పార్కు, ఇల్యూజన్‌ థీమ్‌ పార్కు, కమ్యూనిటీ పార్కు, ఫ్రాగ్నెన్స్‌ గార్డెన్‌, రాక్‌ గార్డెన్‌, ఎన్విరాన్‌మెంట్‌ పార్కు, ప్లే పార్కు, ఫ్లవర్‌/ఫ్రాగ్నెన్స్‌ పార్కు, జిమ్‌ పార్కు, ఎల్‌ఈడీ పార్కు, సెవెన్‌ వండర్స్‌ పార్కు.


చిల్డ్రన్స్‌ పార్కు

పిల్లల ఆటలకు ప్రాధానత్యనిస్తు ఈ పార్కును అభివృద్ధి చేస్తారు. స్పింగ్‌ రైడర్స్‌, ట్యూబ్‌లు, స్వింగ్స్‌, స్లైడ్స్‌, సీ- సాస్‌, ప్లే గ్రౌండ్‌ క్లైంబర్స్‌ వంటివి ఏర్పాటు చేస్తారు. వివిధ రకాల ఆటలతోపాటు విజ్ఞానాన్ని పంచే పలు అంశాలూ ఉంటాయి. 


బతుకమ్మ...

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ పార్కును అభివృద్ధి చేస్తారు. తంగేడు, గునుగు, చామంతి, మందారం, బంతి తదితర పూలతో బతుకమ్మను తయారు చేసేందుకు ఏర్పాటుచేసే పూల మొక్కలు ఈ పార్కులో ఉంటాయి. బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతితో అవినాభావ సంబంధం తదితర వివరాలను పార్కుల్లో రాతపూర్వకంగా ఏర్పాటు చేస్తారు. పండుగ సమయంలో మహిళలు ఆడేందుకు, బతుకమ్మను గంగమ్మ ఒడిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. 

Updated Date - 2020-09-05T08:09:49+05:30 IST