సరిగా తినండి... ఆరోగ్యంగా ఉండండి

ABN , First Publish Date - 2020-04-14T10:54:15+05:30 IST

కొవిడ్‌-19 మన జీవితాలపై పెను ప్రభావాన్నే చూపుతోంది. లాక్‌డౌన్‌ వల్ల ముఖ్యంగా ఆహార అలవాట్ల పరంగా

సరిగా తినండి... ఆరోగ్యంగా ఉండండి

కొవిడ్‌-19తో మారిన ఆహారపు అలవాట్లు

ఇంటి వంటకే ఓటు... బయట ఫుడ్‌కు లేదు చోటు

సమతుల్యమైన ఆహారంతో రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చంటున్న న్యూట్రిషియని్‌స్టలు

పండ్లకు చోటు కల్పించాలంటున్న డైటీషియన్లు


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌13 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 మన జీవితాలపై పెను ప్రభావాన్నే చూపుతోంది. లాక్‌డౌన్‌ వల్ల ముఖ్యంగా ఆహార అలవాట్ల పరంగా అధిక మార్పులు వస్తున్నాయి. ఇంట్లో తీసుకునే ఆహార పరిమాణమూ పెరిగింది. దాంతో పాటుగా బయట తీసుకునే ఆహారం గణనీయంగా తగ్గింది. హోటల్‌ ఇండస్ట్రీపై ఇది చూపే ప్రభావం ఎలాగున్నా నగరవాసుల ఆరోగ్య  పరంగా మాత్రం మంచి మార్పునకు నాంది పలుకుతోందని న్యూట్రిషియని్‌స్టలు, డైటీషియన్లు అంటున్నారు.


ఈ లాక్‌డౌన్‌ పుణ్యమా అని ఇంటి ఫుడ్‌కు మించినదేముందంటూనే భారతీయ ఆహారపు అలవాట్లకు జై కొడుతున్నారు. ఆరోగ్యవంతమైన ఆహారంతో రోగనిరోధకశక్తి పెరిగి కరోనా నుంచి రక్షణ పొందొచ్చని పౌష్టికాహార నిపుణులంటున్నారు. ఇప్పుడు ప్రజల ఆలోచనా విధానంతోపాటు ఆహార అలవాట్లు కూడా మారాయి. ఉదయమే నిమ్మరసం తాగడం మొదలు పప్పుదినుసులు, ఆకుకూరలు వంటి వాటికి తమ డైట్‌లో చోటు కల్పిస్తున్నారు. సమీ-సబిన్సా గ్రూప్‌ డైరెక్టర్‌, సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ అంజు మజీద్‌ మాట్లాడుతూ విటమిన్‌ సీ, ఈతోపాటు కొన్ని రకాల హెర్బ్‌ల్స్‌ వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుందన్నారు. 


డైట్‌ ఎలా ఉండాలంటే...

ఉదయం పూట.. ఆరు గంటలకు టీ, కాఫీ లేదంటే లెమన్‌ జ్యూస్‌ లాంటివి తీసుకోవాలి.  6-7 గంటల మధ్యలో సింపుల్‌ వ్యాయామాలు చేయాలి. ఉదయం 7-8 గంటలకు బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తి చేసుకుని, 9-10 గంటలకు జ్యూస్‌లు తాగాలి. 12.30-1 గంట లోపు లంచ్‌ తీసుకోవాలి. కాకపోతే బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ ఇంపార్టెంట్‌. ఒక రోజులో అది కుదరదనుకుంటే వారంలో అయినా లభించేలా చూసుకోవాలి. మధ్యాహ్నం 3-4 గంటలకు స్నాక్స్‌ తీసుకోవాలి. సాయంత్రం 6-7 గంటల నడమ డిన్నర్‌ పూర్తవ్వాలి. రాత్రి 9 గంటలకు గ్లాసు పాలు తాగితే మంచిది.


సమతులాహారం తీసుకుంటే మంచిది...

ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. శరీరానికి విటమిన్స్‌, మినరల్స్‌ కావాలి. విటమిన్‌ ఏ, బీ, సీ లాంటివి పండ్లు, కూరగాయల నుంచి వస్తాయి. టిఫిన్స్‌లో ఇడ్లీ, దోసెలను రోటి పచ్చళ్లతో తీసుకుంటే కొంత మేరకు బెటర్‌. క్యారెట్‌ తురుము, కొత్తిమీర, కరివేపాకు లాంటివి చట్నీలలో జోడిస్తే విటమిన్స్‌, మినరల్స్‌ అందుతాయి. తద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది. జీర్ణక్రియకూ తోడ్పడతాయి. లెమన్‌, ఆరెంజ్‌ లాంటి సిట్రస్‌ ఫ్రూట్స్‌, టమాటా లాంటివి డైట్‌లో భాగం చేసుకోవాలి.


మధుమేహ బాధితులకు కార్బోహైడ్రేట్స్‌తో ఇబ్బంది ఉంటుంది కదా అని అంటే కార్బోహైడ్రేట్స్‌లో రెండు రకాలుంటాయి. సింపుల్‌ కార్బోహైడ్రేట్స్‌లో రైస్‌ లాంటివి ఉంటాయి. కానీ, సింపుల్‌ కార్బోహైడ్రేట్‌ను కాంప్లెక్స్‌ చేయాలంటే రైస్‌ క్వాంటిటీ తగ్గించి, వెజిటెబుల్‌ కొంత, లీఫీ వెజిటెబుల్‌ కొంత యాడ్‌ చేసుకుంటే, బ్లడ్‌లోకి షుగర్‌ స్లోగా కలుస్తుంది. వెంట వెంటనే ఆకలిగా ఫీలవ్వకుండా మెయిన్‌టెన్‌ చేయొచ్చు.  వైట్‌ రైస్‌ బదులు బ్రౌన్‌ రైస్‌లో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఉన్నా ఏదో ఒక సమయంలో వ్యాయామాలు చేస్తే బెటర్‌. రోజూ కనీసం రెండు రకాల పండ్లను తీసుకోవాలి.

- గాయత్రి, కన్సల్టెంట్‌ డైటీషియన్‌, అపోలో హాస్పిటల్స్‌, హైదర్‌గూడ 


ఆరోగ్యకరమైనఆహారం తీసుకోవాలి... 

ఇప్పుడు ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు చేసుకోవాలి. చాలా కుటుంబాల్లో సంప్రదాయ వంటకాలకు ప్రాధాన్యం పెరిగింది. సిట్రస్‌ ఫ్రూట్స్‌ ఎక్కువగా తీసుకుంటున్నారు. రోజుకు రెండు మూడు సార్లు నిమ్మరసం తీసుకుంటే మంచిది. విటమిన్‌ సీ ఉంటే శరీరంలో ఐరన్‌ కంటెంట్‌ బాగుంటుంది. టమాటా కూడా తీసుకోవచ్చు. ఆయిల్స్‌తో ఫ్రైస్‌ కాకుండా కూరలు వండుకోవాలి. ఆకుకూరలను డైట్‌లో భాగం చేసుకోవాలి. కిచిడీ లాంటివి ఆరోగ్యానికి మంచిది. పుదీనా రైస్‌, లెమన్‌ రైస్‌ లాంటివి కూడా తీసుకోవచ్చు. స్నాక్‌లా బజ్జీలు తినడం కాకుండా వెజిటెబుల్స్‌, ఫ్రూట్స్‌ తీసుకోవాలి. టీ, కాఫీ తప్పదనుకునే వారు స్పైసెస్‌ జోడించుకోవాలి. రాత్రి పూట పుల్కా, రోటీలాంటివి తీసుకోవచ్చు. 

- కమలజ, సీనియర్‌ సైంటిస్ట్‌, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషియనిస్టు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం


Updated Date - 2020-04-14T10:54:15+05:30 IST