జీతాలు పెంచాలని కాంట్రాక్టు కార్మికుల ధర్నా
ABN , First Publish Date - 2020-12-30T06:03:21+05:30 IST
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ ఆరోపించారు.

మంగళ్‌హాట్, డిసెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ ఆరోపించారు. మంగళవారం టీఎస్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ హైదరాబాద్ సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో కోఠిలోని డీఎంఈ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా నిర్వహించారు. యూసుఫ్ మాట్లాడుతూ.. 8 సంవత్సరాలుగా జీతాలు పెంచకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెం. 68 ప్రకారమే ఇప్పటికీ జీతాలు చెల్లిస్తున్నారని, ప్రతి ఐదేళ్లకు జీవోను సవరించి జీతాలు పెంచాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు ఎం.నర్సింహ కూడా మాట్లాడారు. అనంతరం డీఎంసీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.