ఒకే రోజు ఐదుగురు కూలీలకు డెంగీ

ABN , First Publish Date - 2020-09-17T09:38:47+05:30 IST

ఓ వైపు అభివృద్ధి చెందిన కాలనీ మరో వైపు అన్ని సౌకర్యాలు ఉన్న బస్తీ మధ్యలో కొన్ని గుడిసెలు...

ఒకే రోజు ఐదుగురు కూలీలకు డెంగీ

మరికొంత మందికి తీవ్ర అస్వస్థత

అపరిశుభ్ర వాతావరణంలో గుడిసెలు

బంజారాహిల్స్‌లోని కాలనీ, 

బస్తీ వాసుల్లో వణుకు


బంజారాహిల్స్‌, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఓ వైపు అభివృద్ధి చెందిన కాలనీ మరో వైపు అన్ని సౌకర్యాలు ఉన్న బస్తీ మధ్యలో కొన్ని గుడిసెలు... అక్కడ కనీసం సౌకర్యాలు లేవు. ఎక్కడ పడితే అక్కడ అపరిశుభ్రత నెలకొనడంతో దోమలు విజృంభిస్తున్నాయి. గుడిసెల్లో ఉంటున్న కూలీల్లో సగం మందికి తీవ్ర అస్వస్థత. వీరిలో బుధవారం ఐదుగురికి డెంగీ అని తేలింది. దీంతో ఒక్కసారిగా కాలనీ, బస్తీలు ఉలిక్కిపడ్డాయి. అసలే కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంటువ్యాధులు కూడా ప్రబలితే పరిస్థితి ఏంటి అని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12 ప్రధాన రహదారిలో శ్రీనివాస్‌ కన్‌స్ట్రక్షన్స్‌ భారీ ప్రాజెక్ట్‌ చేపట్టింది. ఇందులో పనిచేసేందుకు బెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 200 మంది కూలీలు నగరానికి వచ్చారు. వీరు ఎమ్మెల్యే కాలనీ, ఎన్‌బీనగర్‌ బస్తీ మధ్య ఉన్న ఖాళీ స్థలంలో గుడిసెలు వేసుకొని ఉంటున్నారు.


వీరికి కనీస వసతులను నిర్మాణ దారులు కల్పించలేదు. దీంతో కూలీలు ఖాళీ ప్రదేశాన్ని బహిర్భూమిగా ఉపయోగిస్తుండడంతో గమనించిన స్థానికులు విషయాన్ని పలుమార్లు జీహెచ్‌ఎంసీ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఎవరూ స్పందించలేదు. పది రోజులుగా కూలీలు ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవుతూ వచ్చారు. 30 మందికి పైగా జ్వరం, వాంతులు, విరోచనాల బారినపడి స్థానిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స పొందారు. ఒకే ప్రాంతం నుంచి ఇంత మంది రావడంతో వైద్యులకు అనుమానం వచ్చింది. ఆరుగురికి బుధవారం పరీక్షలు చేయగా ఐదుగురికి డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


నిర్ఘాంతపోయిన మలేరియా ప్రతినిధులు...

ఒకే ప్రాంతంలో ఐదు డెంగీ కేసులు నమోదు కావడంతో జీహెచ్‌ఎంసీ ఆరోగ్య విభాగం అప్రమత్తమైంది. మలేరియా ప్రతినిధులు బస్తీని సందర్శించారు. అక్కడి అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి వారు నిర్ఘాంతపోయా రు. మౌలిక సదుపాయాలు లేకపోగా గుడిసెల చెంతనే మురుగు ప్రవహిస్తుండడంతో పాటు, మంచినీరు కూడా కలుషితమవుతున్నట్టు వారు గుర్తించారు. కూలీలందరికీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. డెంగీ కే సుల గురించి తెలియగానే ఎమ్మెల్యే కాలనీ, ఎన్‌బీ నగర్‌ వాసులు ఉలిక్కిపడ్డారు. తాము ఊహించిందే జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుడిసెల వద్ద అపరిశుభ్ర వాతావరణం కారణంగా చుట్టు పక్కల ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయని గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2020-09-17T09:38:47+05:30 IST