బీఎస్‌-4 వాహన రిజిస్ర్టేషన్లకు సమీపిస్తున్న డెడ్‌లైన్‌

ABN , First Publish Date - 2020-03-13T09:30:20+05:30 IST

భారతదేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం చేపట్టిన బీఎస్‌-4 వాహనాల తయారీ నిలిపివేత వాహనాల రిజిస్ర్టేషన్‌లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

బీఎస్‌-4 వాహన రిజిస్ర్టేషన్లకు సమీపిస్తున్న డెడ్‌లైన్‌

ఆలస్యం చేస్తే... ఇబ్బందులే

ఆర్టీఏ కార్యాలయాలకు వాహనదారుల క్యూ

ఇబ్రహీంపట్నంలో రికార్డు స్థాయిలో ఆదాయం

మూడు రోజుల్లో అరకోటి ఫ్యాన్సీ ఆదాయం


హయత్‌నగర్‌/దిల్‌సుఖ్‌నగర్‌, మార్చి12 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం చేపట్టిన బీఎస్‌-4 వాహనాల తయారీ నిలిపివేత వాహనాల రిజిస్ర్టేషన్‌లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్చి 31వ తేదీని బీఎస్‌-3, బీఎస్‌-4 వాహనాల రిజిస్ర్టేషన్‌లకు చివరి తేదీగా గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇంతకాలం రిజిస్ర్టేషన్‌ను కాలయాపన చేసిన వాహనదారులు పదిరోజులుగా ఆర్టీఏ కార్యాలయాలకు పరుగెడుతున్నారు. వాహనాల రిజిస్ర్టేషన్‌కు మరో పక్షం రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో పాత వాహనదారులతో పాటు కొత్తగా వాహనాలను కొనుగోలు చేసిన వినియోగదారులు కూడా ఆర్టీఏ కార్యాలయాల ముందు క్యూ కడుతున్నారు. దీంతో ఆర్టీఏ కార్యాలయాలకు వాహనదారుల తాకిడి పెరగడంతోపాటు ఆదాయం కూడా రెట్టింపయ్యింది.


రిజిస్ర్టేషన్‌ల డెడ్‌లైన్‌కు రోజులు దగ్గర పడుతుండడంతో వాహనదారులు వీలైనంతత్వరగా రిజిస్ర్టేషన్‌లు చేయించుకోవాలని అధికారులుసూచిస్తున్నారు. గడువు తేదీ పొడిగింపు ఉండదని ప్రతీ వాహనదారుడు పరిగణనలోకి తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ప్రాంతీయ రవాణాశాఖ అధికారి(ఆర్టీవో) రఘునందన్‌గౌడ్‌ చెప్పారు. డెడ్‌లైన్‌ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయంలో వాహనదారుల సౌలభ్యం కోసం రిజిస్ర్టేషన్‌ సమయాలను పొడిగించడంతోపాటు కౌంటర్‌ల సంఖ్యను పెంచినట్లు తెలిపారు. ఆర్టీఏ అధికారుల సూచనలు, సలహాలను పాటించి రిజిస్ర్టేషన్‌లకు సహకరించాలని ఆయన కోరారు. 


ఏప్రిల్‌ 1 తరువాత స్ర్కాప్‌ చేసినట్లే... 

సుప్రీంకోర్టు ఆదేశానుసారం బీఎస్‌-3, బీఎస్‌-4 వాహనాలను ఈ నెల 31వ తేదీలోపు రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తి చేయకుంటే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి సదరు వాహనాలు స్ర్కాప్‌ చేసినట్లేనని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రిజిస్ర్టేషన్‌ లేని వాహనాలు రోడ్లపై తిరిగితే సీజ్‌ చేయడంతో పాటు తుప్పు కింద వేస్తామన్నారు. 


రిజిస్ర్టేషన్‌ సమయం పొడిగింపు...

వాహనాల రిజిస్ర్టేషన్‌కు వాహనదారుల తాకిడి పెరగడంతో పాటు, ముగింపు గడువు సమీపిస్తుండడంతో ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ర్టేషన్‌ సమయాలను పెంచినట్లు రఘునందన్‌గౌడ్‌ వెల్లడించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు  ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ర్టేషన్‌లు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటర్‌ల సంఖ్యను పెంచామన్నారు. 


సీజింగ్‌ వాహనాలు... సవరణల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

ఫైనాన్స్‌ ఇబ్బందుల నేపథ్యంలో రిజిస్రేష్టన్‌ కాకుండా సీజ్‌ చేయబడిన వాహనాలకు కూడా రిజిస్ర్టేషన్‌ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహన పత్రాలలో చిరునామా మార్పిడి, పేరులో తప్పులు తదితర సవరణలకు కూడా అవకాశం కల్పిస్తూ రిజిస్ర్టేషన్‌లు చేస్తున్నారు.


మూడు రోజుల్లో రికార్డు స్థాయి ఆదాయం...

గతంలో ఇబ్రహీంపట్నం కార్యాలయంలో ప్రతి రోజు 150 నుంచి 200 వాహనాలు (నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌) రిజిస్ర్టేషన్‌లకు వచ్చేవి. కానీ పది రోజులుగా రోజూ సరాసరి 500 నుంచి 560 వరకు వాహనాలు వస్తున్నాయి. దీంతో రవాణా శాఖకు రెట్టింపు ఆదాయం సమకూరుతోంది. రిజిస్ర్టేషన్‌ ఆదాయంతో పాటు గత వారంలో కేవలం మూడు రోజుల్లో ఫ్యాన్సీ నెంబర్ల వేలం పాటలో రూ.50 లక్షల పైచిలుకు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం కార్యాలయం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు మూడు రోజుల్లో ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా అరకోటి ఆదాయం సమకూరడం ఇదే ప్రథమం.


22 లోపు రిజిస్ర్టేషన్‌ చేసుకోవడం ఉత్తమం... రఘునందన్‌గౌడ్‌, ఆర్టీఓ, ఇబ్రహీంపట్నం 

మార్చి 31వ తేదీ వరకు డెడ్‌లైన్‌ ఉన్నప్పటికీ 22వ తేదీ లోపు రిజిస్ర్టేషన్‌లు చేయించుకునేందుకు వాహనదారులు ముందుకు రావాలి. చివరి నిమిషంలో ఆందోళన చెందవద్దు. చివరి నాలుగైదు రోజులు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో అనుకోకుండా సిస్టమ్స్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తితే వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. టీఆర్‌(టెంపరరీ రిజిస్ర్టేషన్‌) నెంబర్‌ ఉన్న వాహనదారుల ఫోన్‌లకు ఇప్పటికే షోరూంలతో పాటు ఆర్టీఏ కార్యాలయాల నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషలలో రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలని మెస్సేజ్‌లు పంపడం జరిగింది. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవు.


Updated Date - 2020-03-13T09:30:20+05:30 IST