దత్తాత్రేయతో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ భేటీ

ABN , First Publish Date - 2020-12-15T06:20:18+05:30 IST

స్వరాష్ట్రానికి వచ్చిన హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌లు సోమవారం

దత్తాత్రేయతో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ భేటీ
జి.కిషన్‌రెడ్డిని, డా.కె.లక్ష్మణ్‌ను సన్మానించి బోకే అందజేస్తున్న బండారు దత్తాత్రేయ

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయంపై చర్చ    

కిషన్‌రెడ్డి, డా.కె.లక్ష్మణ్‌లకు అభినందనలు
 రాంనగర్‌, డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): స్వరాష్ట్రానికి వచ్చిన హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌లు సోమవారం ఉదయం 9 గంటలకు రాంనగర్‌లోని దత్తాత్రేయ నివాసంలో భేటీ అయ్యారు. కొవిడ్‌ కారణంగా 9 నెలలుగా హిమాచల్‌ప్రదేశ్‌లో ఉండి రెండు రోజుల క్రితం నగరానికి వచ్చిన దత్తాత్రేయను కిషన్‌రెడ్డి, డా.కె.లక్ష్మణ్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొవిడ్‌ సమస్యపై దత్తాత్రేయతో వారు చర్చించారు. రాష్ట్రంలో కొవిడ్‌తో చనిపోయిన బీజేపీ ఇతర పార్టీల నాయకులు, ప్రముఖులు, ప్రజల మరణాలు అంశంపై వారు చర్చించారు. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బీజేపీ 48 కార్పొరేటర్లను గెలుచుకోవడం హర్షణీయమని, ఇది పార్టీ పటిష్టతకు, భవిష్యత్‌కు శుభపరిణామం అని దత్తాత్రేయ కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లతో అన్నారు. అభ్యర్థుల ఎంపిక, గెలుపు కోసం కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లకు శాలువాలు కప్పి పూలబొకే ఇచ్చి దత్తాత్రేయ అభినందించారు. రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీ మరింత పటిష్టమయ్యేలా కృషి చేయాలన్నారు. ఇదిలా ఉండగా దత్తాత్రేయను గ్రేటర్‌ హైదరాబాద్‌లో గెలిచిన పలువురు తాజా కార్పొరేటర్లు, పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నేతి రాజేశ్వర్‌, డాక్టర్‌ ఆవుల రాంచందర్‌రావు, వెంకటరెడ్డి, గిరి, ఓంప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.
విదేశాల్లో భారతీయ సంస్కృతి వ్యాప్తికి  కృషి చేయాలి..
రాంనగర్‌: విదేశాల్లో భారతీయ విలువలు, సంప్రదాయాలను పెంపొందించేందుకు ఇండో కెనడియన్‌ కౌన్సిల్‌ కృషి చేయాలని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సూచించారు. నగరానికి వచ్చిన బండారు దత్తాత్రేయను సోమవారం ఇండో కెనడియన్‌ కౌన్సిల్‌ వ్యవస్థాపకులు ఆర్‌.శే షసాయి కలిసి కెనడాలో భారతీయుల సంక్షేమం, అభివృద్ధి, మన సంస్కృతి, సంప్రదాయలను పెంపొందించే అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ సేవలను అక్కడికి కొత్తగా వచ్చిన వారికి అందించాలన్నారు.
కార్పొరేటర్లు అంకితభావంతో పనిచేయాలి
ముషీరాబాద్‌: ప్రజాసమస్యల పరిష్కారానికి తాజా కార్పొరేటర్లు అంకితభావంతో పనిచేయాలని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం దత్తాత్రేయ నివాసంలో ముషీరాబాద్‌ డివిజన్‌ బీజేపీ తాజా కార్పొరేటర్‌ ఎం.సుప్రియానవీన్‌గౌడ్‌ దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముషీరాబాద్‌ డివిజన్‌ అధ్యక్షుడు బద్రి నారాయణ, నాయకులు సురేష్‌, అనిల్‌, కంచి, సత్యనారాయణ పాల్గొన్నారు.
దత్తాత్రేయను కలిసిన గాంధీనగర్‌ కార్పొరేటర్‌
చిక్కడపల్లి: హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను గాంధీనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌గా గెలుపొందిన పావనివినయ్‌కుమార్‌, జీజేవైఎం నగర అధ్యక్షుడు ఎ.వినయ్‌కుమార్‌ మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. డివిజన్‌ కార్పొరేటర్‌గా రెండున్నరవేలపైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందిన పావనివినయ్‌కుమార్‌ను గవర్నర్‌ బండారుదత్తాత్రేయ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన స్థానాలను అధిరోహించాలని, ప్రజల సమస్యలపై పోరాడాలని గవర్నర్‌ సూచనలు ఇచ్చారని పావనివినయ్‌కుమార్‌ వివరించారు.

దత్తాత్రేయ కారు ప్రమాదంపై బీజేపీ నేతల ఆందోళన
సోమవారం ఉదయం రాంనగర్‌లో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లతో భేటీ అయిన తర్వాత ఇంటి నుంచి సూర్యాపేటలో జరిగే పౌర సన్మానానికి బయలుదేరిన బండారు దత్తాత్రేయ కారు చౌటుప్పల్‌ సమీపంలో అదుపు తప్పి రోడ్డు కిందకు వెళ్లింది. ఈ ఘటనతో నగరంలోని బీజేపీ నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇంటి నుంచి బయలుదేరిన గంటన్నర వ్యవధిలో ఈ ఘటన జరిగిన సమాచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో హైరానా చెందారు. ఈ ప్రమాదంలో దత్తాత్రేయకు, కారులో ఉన్న సలహాదారుడు, డ్రైవర్‌కు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read more