1946లో తొలి డబుల్‌ డెక్కర్‌

ABN , First Publish Date - 2020-11-25T05:53:37+05:30 IST

ఆనాటి నగర ప్రయాణంలో ఒక తీపి జ్ఞాపకం డబుల్‌ డెక్కర్‌ బస్సు ప్రయాణం.

1946లో తొలి డబుల్‌ డెక్కర్‌

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఆనాటి నగర ప్రయాణంలో ఒక తీపి జ్ఞాపకం డబుల్‌ డెక్కర్‌ బస్సు ప్రయాణం. పదిహేనేళ్ల కిందటి వరకూ సికింద్రాబాద్‌, కోఠి, అఫ్జల్‌గంజ్‌, జూపార్కు రూట్లలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు తిరిగేవి. డబుల్‌ డెక్కర్‌ బస్సులో కిటికీ పక్కన కూర్చొని, పల్లీ బఠానా నములుతూనో, అల్లం మురబ్బా చప్పరిస్తూనో నగర అందాలను వీక్షిస్తూ, ప్రయాణించడం అప్పటి నగరవాసికి మిగిలిన మరపురాని మధురానుభూతి. కొద్దిరోజుల కిందట మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా తన డబుల్‌ డెక్కర్‌ బస్సు ప్రయాణ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. మళ్లీ వీలైతే ఆ సర్వీసులను ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రిని కోరారు. ఈ నేపథ్యంలో డబుల్‌ డెక్కర్‌ బస్సు చరిత్రలోకెళితే, నిజాం స్టేట్‌ రైల్వేస్‌-రోడ్డు ట్రాన్స్‌పోర్టు డివిజన్‌ డబుల్‌ డెక్కర్‌ సర్వీసులను 1946లో ప్రారంభించింది. ఆల్బియన్‌ ఈక్స్‌19 మోడల్‌లోని పదిహేను బస్సులను ఇంగ్లండ్‌ నుంచి తెప్పించారు. 56 సీటింగ్‌ కెపాసిటీగల ఆ బస్సుల భాగాలు నౌకాయానం ద్వారా చెన్నై, ముంబాయి నగరాలకు దిగుమతి అయ్యాయి. రోడ్డు రవాణా ద్వారా బస్సు విడిభాగాలను నగరానికి తీసుకొచ్చి, అల్విన్‌ మెటల్‌ వర్క్స్‌ లిమిటెడ్‌లో అసెంబుల్‌ చేసేవారని చరిత్ర అధ్యయనకారిణి పి. అనూరాధా రెడ్డి చెబుతున్నారు.

Read more