సైబరాబాద్‌ సైలెంట్‌

ABN , First Publish Date - 2020-03-23T09:21:15+05:30 IST

రోనా కట్టడికి సైబరాబాద్‌ పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. జనతా కర్ప్యూలో భాగంగా ఐటీ కారిడర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, ట్రిపుల్‌ఐటీ, కొత్తగూడ, కొండాపూర్‌, రాయదుర్గంతో పాటు ప్రాంతాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

సైబరాబాద్‌ సైలెంట్‌

జనతా కర్ఫ్యూ సక్సెస్‌

స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం

బోసిపోయిన రోడ్లు, కూడళ్లు


మాదాపూర్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడికి సైబరాబాద్‌ పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. జనతా కర్ప్యూలో భాగంగా ఐటీ కారిడర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, ట్రిపుల్‌ఐటీ, కొత్తగూడ, కొండాపూర్‌, రాయదుర్గంతో పాటు ప్రాంతాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. గతంలో ఎన్నడు లేనివిధంగా నగర ప్రజలు, ప్రయాణికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు కట్టుబడి ఉదయం 6 గంటల నుంచే ఇళ్ల నుంచి బయటకు రాలేదు. కొన్ని ప్రాంతాల్లో తాగునీరు, పాలప్యాకెట్లు దొరకక ఇబ్బందులు ఎదురయ్యాయి. మాదాపూర్‌లోని షాపింగ్‌ మాళ్లు, రెస్టారెంట్లు, కిరాణాషాపులతో పాటు అన్ని దుకాణాలు మూసివేశారు. మెడికల్‌ షాపులు, ఆస్పత్రులు మినహా మిగితావన్ని స్వచ్ఛందంగా మూత పడ్డాయి. 


ఇళ్లకే పరిమితం.. 

హైటెక్‌సిటీ నిశబ్దం రాజ్యమేలింది. స్థానికులు, హాస్టల్స్‌ నిర్వాహకులు స్వచ్ఛందంగా మూసివేశారు. గతంలో బిల్‌ క్లింటన్‌ నగర పర్యటనలో భాగంగా సైబర్‌ టవర్‌ను వీక్షించేందుకు వచ్చిన సమయంలో నెలకొన్న వాతావరణ  ప్రస్తుతం నెలకొందని స్థానికులు చెప్పారు. 


రోడ్లన్నీ ఖాళీ

నిత్యం లక్షలాదిమంది ఐటీ ఉద్యోగులు, వాహన దారులు రాకపోకలు సాగించే ఐటీ కారిడర్‌ మూగబోయింది. రోజూ ఐటీ కారిడార్‌కు సుమారు ఆరు లక్షలకు పైగా వాహనాలు వచ్చిపోతుంటాయి. దీంతో హారన్ల మోతలు, వాహనాల ధ్వనులతో నిండివుండే హైటెక్‌ రోడ్లపై ఆదివారం కనీసం పదుల సంఖ్యలో కూడా వాహనాలు కనిపించలేదు. 


పర్యటించిన సీపీ సజ్జనార్‌

సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ సైబర్‌టవర్‌ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైర్‌సను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను  విజయవంతం చేసిన ప్రజలను ఆయన అభినందించారు. ఇది కర్ప్యూ కాదని ప్రజా సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమమని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన కరోనా వైర్‌సను కట్టడి చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ జనతా కర్ఫ్యూను సోమవారం ఉదయం 6 గంటల వరకు పొడిగించినట్లు తెలిపారు. కర్ఫ్యూ సమయంలో తిరుగుతున్న వాహనదారులను ఆపి  జనతా కర్ఫ్యూ అవశ్యకత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌, మాదాపూర్‌ ఏడీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ రవికుమార్‌, మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డితో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.  


ప్రజలు సహకరించాలి

జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన ప్రజలకు రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.   విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రద్దీ ప్రాంతాలు, గుంపులు గుంపులుగా తిరగవద్దని సూచించారు. 


చప్పట్లతో అభినందన

కరోనా వైరస్‌ కట్టడిలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌, ఉన్నతాధికారులు, పోలీస్‌ సిబ్బందితో కలిసి సైబర్‌టవర్‌ ముందు చప్పట్లతో అభినందనలు తెలిపారు. వీరితో పాటు స్థానిక కాలనీలవాసులు, అపార్ట్‌మెంట్‌వాసులు చప్పట్ల కొడుతూ వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.  

Updated Date - 2020-03-23T09:21:15+05:30 IST